ఆ ఐదూ నకిలీనే! | DSC-14 merit list | Sakshi
Sakshi News home page

ఆ ఐదూ నకిలీనే!

Mar 12 2016 3:35 AM | Updated on Sep 3 2017 7:30 PM

డీఎస్సీ-14 ఎంపిక జాబితాలోని ‘నకిలీల’ పుట్ట పగులుతోంది. ఇటీవలే 14 మందిని నకిలీలుగా తేల్చిన ....

డీఈఓ కార్యాలయూనికి చేరిన ఐదుగురి బధిరుల ధ్రువీకరణ పత్రాలపై నివేదికలు
కుల ధ్రువీకరణపై నాన్చుడి ధోరణి
తహశీల్దార్ కార్యాలయాల గడప దాటని నివేదికలు
ఆందోళన చెందుతున్న అభ్యర్థులు

 
అనంతపురం ఎడ్యుకేషన్ : డీఎస్సీ-14 ఎంపిక జాబితాలోని ‘నకిలీల’ పుట్ట పగులుతోంది. ఇటీవలే 14 మందిని నకిలీలుగా తేల్చిన అధికారులు.. వారిని ఎంపిక జాబితా నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో తాజాగా మరో ఎనిమిది మంది చేరారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల 8 మంది బోగస్ స్టడీ సర్టిఫికెట్లు, నలుగురు మాజీ సైనిక కోటా కింద, ఒకరు స్థానిక, మరొకరిని విద్యార్హత ధ్రువీకరణలో తేడా వల్ల తొలగించారు.

 ఐదూ నకిలీనే...
 బధిరుల కోటా కింద ఎంపికైన అభ్యర్థుల విషయం మరోసారి చర్చనీయాంశం కానుంది. 2008 డీఎస్సీని నకిలీ  బధిరులు కుదిపేశారు. ఈసారీ అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బధిరుల కోటా కింద ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ కోఠిలోని ఈఎన్‌టీ ఆస్పత్రి నుంచి ధ్రువీకరణ పత్రాలు అందజేయాల్సి ఉంటుంది. అదికూడా వైకల్యం 70 శాతానికి పైబడిన అభ్యర్థులే అర్హులు. ఈ డీఎస్సీలో సుమారు 20 మంది బధిరుల కోటా కింద ఎంపికయ్యారు. ధ్రువీకరణ పత్రాలపై నివేదికలు ఒక్కొక్కటిగా డీఈఓ కార్యాలయానికి వస్తున్నాయి. ఇప్పటిదాకా ఐదుగురు అభ్యర్థుల ధ్రువీకరణపత్రాలు  వచ్చాయి. ఈ ఐదుగురూ అనర్హులుగా తేలింది. వీరికి 30-50 శాతం మాత్రమే వైకల్యమున్నట్లు  తెలిసింది.  

 నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తహశీల్దార్లు
కుల ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన నివేదికలు తహశీల్దార్ కార్యాలయాల గడప దాటడం లేదు. నాన్చుడు ధోరణి అవలంబిస్తుండటంతో విద్యాశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గుత్తి నుంచి ఇద్దరు అభ్యర్థులు రెసిడెన్షియల్, యల్లనూరు నుంచి ఒకరు, బుక్కపట్నం నుంచి మరో అభ్యర్థి కుల ధ్రువీకరణ, అనంతపురం నుంచి ఒక అభ్యర్థి స్టడీ సర్టిఫికెట్‌పై నివేదికలు కోరుతూ విద్యాశాఖ అధికారులు లేఖలు రాశారు. వీటిలో గుత్తి నుంచి రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు వచ్చాయి. ఇవి అర్హత కల్గినవిగా తెలిసింది. అనంతపురం నుంచి ఓ అభ్యర్థి స్టడీ సర్టిఫికెట్ బోగస్ అని నివేదిక వచ్చింది.

ఇక యల్లనూరు, బుక్కపట్నం తహశీల్దార్ కార్యాలయాల నుంచి కుల ధ్రువీకరణపత్రాల నివేదికలు రావాల్సి ఉంది. ఈ రెండింటిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యాశాఖ అధికారులు వెంట పడుతున్నా.. రెవెన్యూ అధికారులు నాన్చుడి ధోరణి అవలంబిస్తున్నారు. దీంతో జాబితాలో తర్వాత స్థానంలో ఉన్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అనర్హులను తొలగిస్తే తమకు అవకాశం వస్తుందనే ఆశతో రోజూ డీఈఓ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.

 ఇప్పటిదాకా మొత్తం 22 మంది బోగస్
బోగస్ అభ్యర్థుల జాబితా 22కు చేరింది. ఇటీవల 14 మంది జాబితాను అధికారులు ప్రకటించారు. తాజాగా మరో ఎనిమిది బోగస్‌గా తేలింది. ఐదుగురు బధిరుల సర్టిఫికెట్లు, ఒకరు బోగస్ స్టడీ సర్టిఫికెట్, ఇద్దరు బోగస్ కుల ధ్రువీకరణపత్రాలు జత చేసినట్లు తెలిసింది. అయితే.. ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారులు అధికారంగా వెల్లడించాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement