‘తెలంగాణ కోసం 1100 మంది ప్రాణాలను పణంగా పెట్టారు.
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ‘తెలంగాణ కోసం 1100 మంది ప్రాణాలను పణంగా పెట్టారు. రాష్ట్ర సాధనకు 60 ఏళ్లుగా సుదీర్ఘ ఉద్యమం సాగుతోంది. ఎంతోమంది అమరుల త్యాగాల ఫలితంగా ప్రభుత్వం దిగి వచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. ఈ సమయంలో కొందరు సీమాంధ్రులు కుట్ర పన్ని తెలంగాణను అడ్డుకునేందుకు ప్రయత్నించడం సరికాదు’ అని టీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. ఈనెల 29న జరిగే సకలజన భేరి పోస్టర్‌ను టీఎన్‌జీవోస్ సంఘ కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏలూరి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల సహనాన్ని పరీక్షించవద్దని సీమాంధ్రులకు సూచించారు. జిల్లాలో తెలంగాణ ఉద్యమాన్ని అణిచేందుకు సీమాంధ్ర అధికారులు కిందిస్థాయి సిబ్బందిని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.
ఇక్కడ ఉండటం ఇష్టం లేకుంటే సీమాంధ్ర అధికారులు వారి ప్రాంతాలకు వెళ్లాలన్నారు. తెలంగాణ పునర్‌నిర్మాణంలో ఉద్యోగులు భాగస్వాములవుతారని, ఉద్యోగులను ఇబ్బం ది పెడితే ఆ తర్వాత వారికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. తెలంగాణ ప్రాంతం అన్ని రంగాలలో వెనుకబడిందని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అభివృద్ధి సాధ్యమని, అందుకే దశాబ్దాలుగా ఉద్యమం సాగుతోందని వివరించారు. చరిత్ర, అవశ్యకత, అవసరం తెలియని సీమాంధ్ర స్వార్థ రాజ కీయ నాయకులు, ఉద్యోగులు స్వలాభం కోసం కృతిమ ఉద్యమం చేస్తున్నారని విమర్శించారు. ఏపిఎన్‌జీవో నాయకుడు అశోక్‌బాబు హద్దుమీరి వ్యవహరిస్తున్నాడని, తెలంగాణ ప్రజలను, ఉద్యోగులను కించపరచేలా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తీరు మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.
ఈనెల 29న హైదరాబాద్‌లో జరిగే సకలజనుల భేరిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమానికి ఇది కీలక సమయమని, దీనికి ఉద్యోగులు అండగా నిలవాలని కో రారు. కార్యక్రమంలో టీజీవోస్ జిల్లా అధ్యక్షుడు ఖాజామియా, తెలంగాణ ఉద్యోగ జేఏసీ అధ్యక్ష కార్యదర్శులు కూరపాటి రంగరాజు, నడింపల్లి వెంకటపతిరాజు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు కారుమంచి శ్రీనివాసరావు, సాంబశివరావు, టీటీజేఏసీ జిల్లా అధ్యక్షుడు నాగి రెడ్డి, నాయకులు కె.కృష్ణారెడ్డి, అశోక్ చక్రవర్తి, వెంకటేశ్వరరావు, మదన్‌సింగ్, కొం గర వెంకటేశ్వరరావు, నారాయణ, శంకర్, బాబుజాన్ ,మురళి, రత్నాకర్, శ్రీనివాసరావు, కోడి లింగయ్య, కోటేశ్వరరావు, మల్లెల రవీంద్రపసాద్, రమేష్, వెంకటేశ్వర్లు, ఎం.వెంకటేశ్వరరావు, సారధి, వల్లోజు శ్రీనివాస్, రమణయాదవ్, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.