కాస్త సూడండయ్యా? | Divine Department Letter To District Collector | Sakshi
Sakshi News home page

కాస్త సూడండయ్యా?

Mar 26 2018 1:03 PM | Updated on Sep 22 2018 8:25 PM

Divine Department Letter To District Collector - Sakshi

పిఠాపురం: స్థానిక శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానంలో వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేయాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్‌ జిల్లా కలెక్టరుకు రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది డిసెంబర్‌ 26న మహాసంస్థానాన్ని దేవాదాయ శాఖ స్వాధీనం చేసున్న అనంతరం అక్కడ ట్రస్టు సభ్యులు రూ.కోట్లలో అవినీతికి పాల్పడినట్టు అధికారులు ప్రకటించారు. వాటికి సంబంధించి పలు ఆధారాలను సేకరించారు. తదనంతర పరిణామాలలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పలు దఫాలుగా విచారణలు జరిపి అప్పటి ఈఓ చందక దారబాబుపై పలు ఆరోపణలు చేస్తూ ఆయనను సస్పెండ్‌æ చేశారు. అప్పటి నుంచి అన్నవరం ఈఓ జితేంద్ర పర్యవేక్షణలో సంస్థానం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తొలుత ఐఏఎస్‌ స్థాయి అధికారి ఉంటే తప్ప రూ.కోట్లలో జరిగిన అవినీతిపై విచారణ సాధ్యం కాదని చెబుతూ అన్నవరం ఈఓను నియమించిన దేవాదాయ శాఖ మూడు నెలలుగా  విచారణలో ఎటువంటి పురోగతి సాధించలేదు. మూడు నెలల అనంతరం కలెక్టర్‌కు విచారణ జరపండంటూ లేఖ రాయడం పలు అనుమానాలకు దారితీస్తోంది.

కావాలనే కాలయాపన చేశారా?
సంస్థానంలో ఆదాయ వ్యయాలకు సంబంధించి ఎటువంటి రికార్డులు సక్రమంగా లేవని ముందే గుర్తించిన అధికారులు అవినీతి జరిగిందని నిర్ధారణకు వచ్చారు. అలాంటప్పుడు అనుమానితులపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా కేవలం సంస్థాగత విచారణ పేరుతో నెల రోజులకు పైగా కాలయాపన చేసి ఒక అధికారిని సస్పెండ్‌ చేసి చేతులు దులుపేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విచారణ జరుగుతుందంటూ చెప్పుకొచ్చిన దేవాదాయ శాఖాధికారులు మూడు నెలలుగా మౌనంగా ఉండి ఇప్పుడు విచారణ చేయాలనడంలో అంతర్యమేమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. విచారణలో ఏ అవినీతి జరగలేదని తామే చెబితే భక్తుల నుంచి వ్యతిరేకత వస్తుందని, అదే విచారణ వేరే అధికారులు చేస్తే అప్పుడు ఏ వివాదానికి అవకాశం లేకుండా అవినీతి గుట్టుచప్పుడు కాకుండా గట్టెక్కుతుందన్న ఆలోచనతోనే ఇప్పుడు ఈలేఖ రాశారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు డిప్యూటీ కలెక్టరు హోదా కలిగిన అన్నవరం ఈఓ ఈ అవినీతిపై ఎందుకు విచారణ చేయలేక పోయారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

పక్కా ఆధారాలున్నా పట్టించుకోలేదు!
సంస్థానానికి సంబంధించి అన్ని బ్యాంకు అకౌంట్లు ఆదాయాలు, ఆస్తులపై హక్కులన్నీ తన అనంతరం ట్రస్టు సభ్యులకు సంక్రమించేలా రాయించుకుని రిజిస్టర్‌ చేయించుకున్న వీలునామా విషయాన్ని పక్కన పెట్టేశారని భక్తులు విమర్శిస్తున్నారు. సంస్థానం పేరున ఉండాల్సిన ఆస్తులను వ్యక్తుల పేరున రాయించుకున్న వీలునామాలు బయటపడినప్పుడు సంబంధిత వ్యక్తులపై కేసులు ఎందుకు పెట్టలేదని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement