విభజన తీర్మానాన్ని ఓడించండి: ఎన్జీవోలు | Defeat bifurcation resolution: APNGOs | Sakshi
Sakshi News home page

విభజన తీర్మానాన్ని ఓడించండి: ఎన్జీవోలు

Oct 13 2013 4:05 AM | Updated on Sep 27 2018 5:59 PM

విభజన తీర్మానాన్ని ఓడించండి: ఎన్జీవోలు - Sakshi

విభజన తీర్మానాన్ని ఓడించండి: ఎన్జీవోలు

శాసనసభలో రాష్ట్ర విభజన తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేస్తామంటూ సీమాంధ్ర జిల్లాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు.

ఎమ్మెల్యేలతో హామీ పత్రాలు తీసుకున్న ఎన్జీవోలు
 సాక్షినెట్‌వర్క్: శాసనసభలో రాష్ట్ర విభజన తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేస్తామంటూ సీమాంధ్ర జిల్లాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. సమైక్యవాదులు, ఏపీఎన్జీవోలు శనివారం పలుచోట్ల ఎమ్మెల్యేల ఇళ్లను దిగ్బంధించి వేర్పాటువాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిందిగా డిమాండ్ చేశారు. మరికొన్నిచోట్ల ఎమ్మెల్యేలను కలిసి తెలంగాణ తీర్మానానికి విరుద్ధంగా ఓటేస్తామంటూ పేర్కొన్న ప్రమాణపత్రాలను తీసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో మంత్రి పితాని సత్యనారాయణ, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఈలి నాని ఇళ్లను ఎన్జీవోలు ముట్టడించారు. విభజనను అడ్డుకుంటామని వారి నుంచి హామీ పత్రం తీసుకున్నారు.
 
 పాలకొల్లు ఎమ్మెల్యే బంగారు ఉషారాణి, కొవ్వూరు ఎమ్మెల్యే టీవీ రామారావు నుంచి కూడా హామీ పత్రాలు తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి ఎమ్మెల్యే శేషారెడ్డితో పాటు రాజమండ్రి రూరల్, కొత్తపేట, పి.గన్నవరం ఎమ్మెల్యేలు చందన రమేష్, బండారు సత్యానందరావు, పాముల రాజేశ్వరీదేవిలు విప్‌ను ధిక్కరించైనా తెలంగాణ  తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామంటూ ఎన్జీఓలకు ప్రమాణపత్రాలు అందజేశారు. విశాఖలో ఎమ్మెల్యేలు రామకృష్ణబాబు, రామానాయుడు, విజయ్‌కుమార్, గొల్లబాబూరావుల ఇళ్లకి ఎన్జీవోలు వెళ్లగా, తెలంగాణకు వ్యతిరేకంగా తాము ఓటేస్తామని ఎమ్మెల్యేలు హామీపత్రాలిచ్చారు. తెలంగాణ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడితే తాను వ్యతిరేకంగా ఓటేస్తానని అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి నడిరోడ్డుపై ఉద్యోగులు, ప్రజల సమక్షంలో ప్రమాణం చేశారు. గుత్తిలో గుంతకల్లు ఎమ్మెల్యే కొట్రికె  మధుసూదన్‌గుప్తా, తాడిపత్రిలో ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డిని కలిసి తెలంగాణ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయాల్సిందిగా సమైక్యవాదులు కోరారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా కార్యాలయాన్ని ముట్టడించారు. అసెంబ్లీలో విభజన తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసే నిమిత్తం ఎమ్మెల్యేల నుంచి హామీ తీసుకునేందుకు శనివారం విజయవాడలో నిర్వహించిన సభలో ఉద్రిక్తత నెలకొంది.
 
 ఈ సభకు మంత్రి సారథితోపాటు ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, యలమంచిలి రవి హాజరయ్యారు. వెల్లంపల్లి మాట్లాడుతూ రాజకీయపార్టీలపై విమర్శలు చేయడంతో ఓ జేఏసీ నాయకుడు జోక్యం చేసుకుని పార్టీలకతీతంగా జరుగుతున్న ఈ సమావేశంలో ఎవరిపైనా విమర్శలొద్దని సూచించారు. దీంతో మరో ఎమ్మెల్యే యలమంచిలి రవి ఒక్కసారిగా ఊగిపోతూ  2009లో చిదంబరం ప్రకటన చేసినప్పుడు మేం వీధుల్లోకి వస్తే మీరంతా ఎక్కడున్నారు’ అని జేఏసీ ఉద్యోగులతో వాగ్వాదానికి దిగారు. దీంతో సభలో ఉద్రిక్తత ఏర్పడింది. సభలో పలువురు లేచి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement