ఆంధ్ర భీముడు...రాజగోపాలుడు | Dandamudi Rajagopal Rao 37th Death Anniversary | Sakshi
Sakshi News home page

ఆంధ్ర భీముడు...రాజగోపాలుడు

Aug 6 2018 1:15 PM | Updated on Aug 6 2018 1:19 PM

Dandamudi Rajagopal Rao 37th Death Anniversary - Sakshi

ఎండ్లబండిని పైకి ఎత్తుతున్న దండమూడి (ఫైల్‌)

ఆటల పోటీల్లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన కొద్దిమంది భారతీయుల్లో దండమూడి రాజగోపాలరావు ఒకరు. మనదేశం స్వాతంత్య్రం పొందిన తొలినాళ్లయిన 1948లోనే మిస్టర్‌ ఆసియాగా గెలిచి భారతజాతికి వన్నెతెచ్చిన ఘనుడాయన. సోమవారం ఆయన వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం.  

పెదపారుపూడి(పామర్రు): శరీర సౌష్టవ పోటీలో మిస్టర్‌ ఆసియా బిరుదును పొందిన తొలి ఆంధ్రుడే కాక తొలి భారతీయుడు దండమూడి రాజగోపాలరావు. ఆయన తొలి అంకంలో కొల్లి రామదాసు, సోమయాజులు తదితరుల వద్ద తర్ఫీదు పొంది 1938లో తొలిసారిగా పోటీల్లో పాల్గొని జిల్లా వెయిట్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌ కావడం ద్వారా శరీర సౌష్టవంపై దృష్టి పెంచారు. ఫలితంగా  1940లో మొదటిసారిగా రాష్ట్రస్థాయిలో చాంపియన్‌గా గెలుపొందారు. 1945లో జాతీయస్థాయిలో 320 పౌండ్ల బరువు ఎత్తి విజేతగా నిలిచారు. 1948లో జరిగిన ఆసియా శరీరసౌష్టవ పోటీల్లో గెలుపొంది మిస్టర్‌ ఆసియా బిరుదును సొంతం చేసుకున్నారు. 1945 నుంచి 1958 వరకు 13 ఏళ్లపాటు జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌గా గెలుపొందుతూ ఆంధ్రప్రదేశ్‌ కీర్తి పతాకాన్ని దశదిశలా ఇనుమడింపజేశారు.

1948లో జరిగిన కామన్‌వెల్త్‌ పోటీల్లో పాల్గొన్న తొలి ఆంధ్రుడు దండమూడి. రాష్ట్ర వెయిట్‌లిఫ్టింగ్‌ అసోసియేషన్‌కు అనేక సంవత్సరాలపాటు ఉపాధ్యక్షుడిగా కొనసాగారు.
 వెయిట్‌ లిఫ్టింగ్‌లోనే కాక బలప్రదర్శనలో విశేష ప్రతిభ కనబర్చారు. చాతికి గొలుసులు చుట్టి గాలిపీల్చడం ద్వారా చాతిని పెంచి వాటిని తెంపడం లాంటి సాహసకృత్యాలను దండమూడి అనేకం చేశారు. వెయిట్‌ లిఫ్టింగ్‌లో అర్జున అవార్డు గ్రహీత కామినేని ఈశ్వరరావు దండమూడి శిష్యుడిగానే శరరీ సౌష్టవంపై ఆసక్తి పెంచుకున్నారు. ఇదిలా ఉండగా వీరాభిమన్యు, నర్తనశాల తదితర చిత్రాల్లో భీముడి పాత్రను పోషించిన దండమూడి ప్రజల మన్ననలను చూరగొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు వ్యాయామశాలల ఏర్పాటుకు కృషిచేశారు. ఒలింపిక్‌ పోటీల అనంతరం విజయవాడలో ఉచిత వ్యాయామశాల నెలకొల్పారు. ప్రభుత్వం విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులో ఆయనకు ఇచ్చిన స్థలాన్ని మున్సిపల్‌ కార్పొరేషన్‌కు విరాళంగా ఇచ్చారు. దాంతో ఆయన పేరుతో కార్పొరేషన్‌ ఇండోర్‌ స్టేడియం నిర్మించింది. వెయిట్‌ లిఫ్టింగ్‌లో ఆయన ‘ఆంధ్రభీమ, ఇండియన్‌ టార్జాన్‌’, ఇండియన్‌ హెర్క్యులస్,  జాయింట్‌ ఆఫ్‌ ఇండియన్‌ బిరుదులను పొందారు. అంతటి ఘనకీర్తిని కూడగట్టుకున్న ఆయన ఉయ్యూరు మండలంలో గండిగుంటలో 1916 అక్టోబర్‌ 14న జన్మించారు. ఉయ్యూరులో విద్యాభ్యాసం పూర్తిచేసి తర్వాత పెదపారుపూడి మండలం వానపాములలో తన సోదరి రంగమ్మ ఇంట ఉండి జాస్తి బాపయ్య, శిష్ట్లా సోమయాజులు ప్రభతుల ప్రోత్సాహంతో వెయిట్‌లిఫ్టింగ్‌ సాధన ప్రారంభించారు. 1981 ఆగస్టు 6న విజయవాడ లబ్బీపేటలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.

కుటుంబ నేపధ్యం..
ఆయనకు ఐదుగురు సంతానం. వారిలో ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. రెండో కుమారుడు అమెరికాలో, పెద్ద చిన్న కుమారులు విజయవాడలో స్థిరపడ్డారు. కుమార్తె అట్లూరి ఝాన్సీరాణి వానపాముల లో ఉంటూ  కొన్ని సంవత్సరాల క్రితం మరణించింది. ప్రస్తుతం ఆయన కూతురు మనుమడు రాజాజీ ఉంటున్నారు. మరో కుమార్తె ఆయన స్వగ్రామమైన గండిగుంటలో నివాసముంటున్నారు. 

1
1/1

ఊపిరి బిగపట్టి సంకెళ్లు, ఇనుప గొలుసులు తెంపుతున్న దండమూడి(ఫైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement