టీడీపీ కోసమే ఐటీ గ్రిడ్స్‌ సంస్థ ఏర్పాటు!

cyber crime Police searching for ashok dakavaram - Sakshi

సాక్షి, నెల్లూరు : ఏపీ ప్రజల డేటా చోరీకి పాల్పడిన ఐటీ గ్రిడ్స్‌ సంస్థ వ్యవహారం తాజాగా నెల్లూరు జిల్లాలో అలజడి రేపుతోంది. ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ డాకవరం అశోక్  స్వస్థలం నెల్లూరు జిల్లా అల్లూరు. కాగా జిల్లాకు చెందిన బీదా సోదరులకు అశోక్‌ అత్యంత సన్నిహితుడు. టీడీపీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర సహకారంతోనే అశోక్‌ ...మంత్రి నారా లోకేష్‌ వద్ద చేరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ కోసమే అశోక్‌... ఐటీ గ్రిడ్స్‌ సంస్థను ఏర్పాటు చేసినట్లు సమాచారం. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ టీడీపీకి చెందిన అధికారిక ‘సేవామిత్ర’  యాప్‌ను రూపొందించింది. ఇందుకోసం విశాఖపట్నంలోని బ్లూ ఫ్రాగ్‌ మొబైల్‌ టెక్నాలజీస్‌ సంస్థ అవసరమైన సమాచారం అందజేసినట్లు తెలుస్తోంది. చదవండి....  (ఆంధ్రప్రదేశ్‌లో భారీ డేటా స్కామ్‌!)

మరోవైపు పరారీలో ఉన్న దాకవరం అశోక్‌ కోసం సైబరాబాద్‌ క్రైం పోలీసులు గాలింపు విస్తృతం చేశారు. ఇందుకోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, అశోక్‌ ఆచూకీ కోసం యత్నిస్తున్నారు. డేటా చోరీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు  విచారణకు హాజరు కావాలంటూ సీఆర్పీసీ 161 సెక్షన్‌ కింద ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ ఆయన నిన్న కూడా విచారణకు హాజరు కాలేదు. దీంతో దాకవరం అశోక్‌ కోసం గాలింపు ముమ్మరం చేశారు.

ఇక ఐటీ గ్రిడ్స్‌ సంస్థపై హైదరాబాద్‌ ఎస్సార్‌ నగర్‌ పోలీస్ స్టేషన్‌లో సోమవారం మరో కేసు నమోదు అయింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల వ్యక్తిగత డేటాను చోరీ చేశారంటూ దశరధరామిరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతో  అశోక్‌పై ఐపీసీ 420, 419, 467, 468, 120 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సాక్షులను విచారిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top