అక్రమ నిర్మాణదారులకు షోకాజ్‌ నోటీసులు!

crda notices issued to illegal constructions - Sakshi

కృష్ణా నది కరకట్ట లోపల నిర్మాణాలపై చర్యలు

ఏ క్షణమైనా నోటీసులు జారీచేసే అవకాశం

సాక్షి, అమరావతి:  కృష్ణానది కరకట్ట లోపల అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇలాంటి నిర్మాణాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే. చట్టాలను ఉల్లంఘిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా కరకట్ట లోపల నిర్మించిన నిర్మాణాలన్నింటికీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) నోటీసులను సిద్ధం చేసింది.

ఏ క్షణమైనా అక్రమ నిర్మాణదారులకు షోకాజ్‌ నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఇల్లు కూడా అక్రమంగా నిర్మించిందేనని సీఆర్‌డీఏ నిర్ధారించింది. చంద్రబాబు సహా ఆ భవన యజమాని లింగమనేని రమేష్‌కు సైతం నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసింది. కరకట్ట లోపల నిర్మించిన మిగిలిన అన్ని భవనాల యజమానులకు నోటీసులు ఇవ్వనున్నారు. అక్రమ కట్టడమైన ప్రజావేదికను జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే తొలగించారు. దీనికి కొనసాగింపుగా అన్ని అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు సీఆర్‌డీఏ నడుం బిగించింది.  

అక్రమ నిర్మాణానికి ప్రజల సొమ్ముతో హంగులు  
కృష్ణా నదీ తీరంలో లింగమనేని రమేష్‌ కొన్నేళ్ల క్రితం నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి అతిథిగృహం నిర్మించగా, 2015లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు దాన్ని లీజుకు తీసుకుని అందులో నివసిస్తున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే అక్రమ కట్టడంలో నివాసం ఉండడం ఏమిటని ప్రతిపక్షాలు ప్రశ్నించినా చంద్రబాబు లెక్కచేయలేదు. పైగా ప్రభుత్వ నిధులతో ఆ భవనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. జీ+1 భవనంలో అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు అక్రమ కట్టడాలను ప్రోత్సహించడంతో కరకట్ట లోపల చాలామంది అక్రమ నిర్మాణాలు చేశారు. అయితే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సామాన్యుడికి ఒక నిబంధన, పెద్దలకు ఒక నిబంధన ఉండదని, అన్ని అక్రమ నిర్మాణాలను తొలగించేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.  

చంద్రబాబు నివాసంలో అన్నీ అతిక్రమణలే  
చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్‌ అతిథి గృహంలో నిబంధనలకు విరుద్ధంగా కట్టిన జీ+1 భవనం, ఇతర నిర్మాణాలను వారం రోజుల్లో తొలగించాల్సి ఉందని, వాటిని ఎందుకు నిర్మించారో వివరణ ఇవ్వాలని సీఆర్‌డీఏ నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. సీఆర్‌డీఏ నుంచి అనుమతి తీసుకోకపోవడం, ఏపీ బిల్డింగ్‌ రూల్స్‌–2012, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ 2015లో జారీ చేసిన ఉత్తర్వులు, అమరావతి క్యాపిటల్‌ సిటీ జోనింగ్‌ రెగ్యులేషన్‌–2016కి విరుద్ధంగా ఈ నిర్మాణాలు ఉన్నట్లు సీఆర్‌డీఏ గుర్తించింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి పరిధిలోని డి.నెం.250, 254, 272, 274, 790/1లో ఎకరం ఆరు సెంట్ల స్థలంలో అనుమతి లేని ఈ నిర్మాణాలను గుర్తించారు.

తమ నోటీసులపై వారం రోజుల్లో స్పందించి వివరణ ఇవ్వాలని, లేకపోతే సంబంధిత భవనాన్ని తొలగిస్తామని నోటీసుల్లో స్పష్టం చేయనున్నట్లు సమాచారం. ఒకవేళ సంజాయిషీ ఇచ్చినా, అది సంతృప్తికరంగా లేకపోయినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. కృష్ణానది కరకట్టపై వంద మీటర్ల లోపు 50కి పైగా భవనాలను అక్రమంగా నిర్మించినట్లు సీఆర్‌డీఏ అధికారులు గుర్తించారు. వాటన్నింటికీ నోటీసులు అందజేయనున్నారు. నోటీసుల్లో ఇచ్చిన గడువులోపు భవన యజమానులు, అద్దెదారులు వివరణ ఇవ్వకపోయినా, అది సరిగ్గా లేకపోయినా నిబంధనలకు అనుగుణంగా వాటిని కూల్చివేసేందుకు సిద్ధమవుతున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top