మీసేవ..దోపిడీకి తోవ 

Corruption In Mee Seva Centers - Sakshi

పంటల బీమా దరఖాస్తుల అప్‌లోడ్‌లో చేతివాటం

రైతు వాటా రూపాయి హా మీసేవ ఖర్చు రూ. 200

రైతులపై పెనుభారం హా పట్టించుకోని ఉన్నతాధికారులు

సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యాలకు తూట్లు

అన్నివర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా అవినీతి రహిత, పారదర్శక పాలన అందించేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కృషిచేస్తుంటే కొన్ని సంస్థలు, కొందరు అధికారుల తీరు ఆ లక్ష్యాలను నీరు గారుస్తోంది. రైతుల భూమితో పాటు పంటల వివరాలను ప్రధానమంత్రి ఫసల్‌బీమాకు అప్‌లోడ్‌ చేయడానికి మీ సేవ కేంద్రాలు ఒక్కో రైతునుంచి రూ. 150 నుంచి రూ. 200 తీసుకుంటూ దోపిడీకి పాల్పడుతున్నాయి.ఇది పేద ,మధ్య తరగతి రైతులకు భారంగా మారడమే కాక సీఎం జగన్‌ లక్ష్యాలకు తూట్లు పొడుస్తోంది. 

సాక్షి ప్రతినిధి కడప: ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు రైతుల పంటలబీమాకు సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇక తమ వాటాగా కేవలం ఒక్క రూపాయి చెల్లించడంతోపాటు తమ పంటల వివరాలను మీసేవల ద్వారా బీమా కంపెనీకి అప్‌లోడ్‌ చేయించుకొనే బాధ్యతను రైతులకు అప్పగించింది. దీన్ని అవకాశంగా తీసుకున్న మీసేవ కేంద్రాలు రైతులవద్ద రూ.150 నుంచి 200 వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నాయి. బీమా ప్రీమియం రైతు వాటా కేవలం రూపాయి మాత్రమే కాగా మీసేవా కేంద్రాలు మాత్రం వన్‌–బీ కోసం రూ. 50 నుంచి 60 రూపాయలు, రైతు భూ వివరాలను ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన పోర్టల్‌కు అప్‌లోడ్‌ చేసినందుకు రూ.100 నుంచి రూ.150 వరకు వసూలు చేస్తున్నారు. ఇది పేద, మధ్య తరగతి రైతులకు మరింత భారంగా మారింది.

మీసేవల దోపిడీ పుణ్యమా అని వైఎస్‌ జగన్‌ప్రభుత్వంతో పాటు తాముకూడా బీమా ప్రీమియం చెల్లించినట్లు అవుతోందని రైతులు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 51 మండలాల పరిధిలో లక్షలాది మంది రైతులు ఈ సీజన్‌ కు తాము సాగుచేస్తున్న పత్తి, మిరప,పసుపు, చెరకు వరి,కంది,జొన్న,సజ్జ,ప్రొద్దుతిరుగుడు తదితర పంటలకు సంబంధించి బీమాకోసం దరఖాస్తు చేస్తున్నారు. ఈ పంటలకు జూలై 31వ తేదీలోగా ప్రీమియం చెల్లించాలని గడువు విధించారు. బీమా ప్రీమియం మొత్తం రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది. రైతులు తమ భూమి, సాగుచేసిన పంటల వివరాలు మీసేవల ద్వారా ప్రధానమంత్రి ఫసల్‌బీమాకు అప్‌లోడ్‌ చేయించాలి. జగన్‌ సర్కార్‌ ప్రోత్సాహంతో పంటలు సాగుచేసిన రైతులందరూ ఈ ఏడాది బీమా చేసేందుకు సిద్ధమయ్యారు.
రైతుల అవసరాలే అవకాశంగా...
రైతుల అవసరాలను అవకాశంగా తీసుకున్న మీ సేవ కేంద్రాలు దోపిడీకి తెరలేపాయి. వాస్తవానికి వన్‌–బీ లేదా అడంగల్‌ కు రూ.25 రూపాయలు మాత్రమే తీసుకోవాల్సి ఉండగా రూ.50 నుంచి 60 రూపాయలు వసూలు చేస్తున్నారు. అదికూడా వన్‌–బీ స్టాంపు పేపర్‌(క్వాలిటీ) కాకుండా ఏ ఫోర్‌ సైజ్‌ వైట్‌ నార్మల్‌ పేపర్‌పై ప్రింట్‌ తీసి ఇస్తున్నారు. వాస్తవానికి ఒక్క వన్‌–బీ, అడంగళ్ల లోనే కాదు అన్నిరకాల సర్టిఫికెట్లకు మీ సేవా కేంద్రాల వారు అధికంగా వసూళ్లు చేస్తున్నారు. ఉదాహరణకు ఆధార్‌కార్డు సవరణకు రూ. 50 తీసుకోవాల్సి ఉండగా రూ. 200 తీసుకుంటున్నారు. కొత్త ఆధార్‌ కార్డు ఎన్‌రోల్‌ మెంట్‌ ప్రీగా చేయాలి కానీ రూ. 200 తీసుకుంటున్నారు. బర్త్‌ సర్టిఫికెట్‌కు రూ.35 మాత్రమే తీసుకోవాల్సి ఉండగా రూ.60 వసూలు చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్‌ సర్టిఫికెట్‌కు రూ.35 కు బదులు రూ. 100 తీసుకుంటున్నారు. ప్రతి సర్టిఫికెట్‌పైనా రూ.30 కి తక్కువ లేకుండా అదనంగా తీసుకుంటుండగా సీజనల్‌గా డిమాండ్‌ను బట్టి రూ. 100 నుంచి రూ. 200కు తక్కువ లేకుండా వసూలు చేస్తున్నారు. 

కొందరు రెవెన్యూ అధికారులకూ వాటాలు 
మీసేవ కేంద్రాలు అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నా స్థానిక రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదు. పైగా వారి దోపిడీకి సహకరిస్తున్నారు. చాలామంది రెవెన్యూ అధికారులకు వాటాలు ముడుతుండడంవల్లే మిన్నకుండిపోతున్నారన్న విమర్శలున్నాయి.  గతంలో ఏ ప్రభుత్వం ప్రీమియం మొత్తాన్ని రైతుల తరపున చెల్లించిన దాఖలాలు లేవు. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ప్రభుత్వమే రైతుల పక్షాన అన్నిరకాల పంటలకు సంబంధించిన బీమా ప్రీమియం చెల్లిస్తుందని చెప్పిన వైఎస్‌ జగన్‌ సీఎం కాగానే మాట నిలబెట్టుకున్నారు. తొలి బడ్జెట్‌ లోనే ఇందుకోసం రూ.1163 కోట్లు కేటాయించారు.ప్రధానమంత్రి ఫసలబీమా యోజన కింద వరి పంటకు ఒక్క ఎకరాకు రూ.440 రూపాయలు, కందికి రూ. 240, జొన్నకు రూ. 200,సజ్జకు రూ.150, ప్రొద్దుతిరుగుడుకు రూ. 240, పత్తికి రూ. 1200, మిరపకు రూ. 3900, పసుపుపంటకు రూ. 4 వేలు, చెరకుకు ’రూ. 3,150 చొప్పున మొత్తం ప్రీమియంను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమే చెల్లించనుంది. దాదాపు 2లక్షల హెక్టార్లలో రైతులు బీమా కోసం దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు.ఈ లెక్కన మీసేవా కేంద్రాలు వసూళ్లు అడ్డూఅదుపూ లేకుండా సాగనుంది. 

పట్టించుకోని ఉన్నతాధికారులు:
జిల్లావ్యాప్తంగా మీసేవ కేంద్రాల దోపిడీ సాగుతోంది.ఇందుకు కొందరు స్థానిక అధికారుల మద్దతే కారణమనే ఆరోపనలున్నాయి. కొందరు అధికారులకు మీసేవా కేంద్రాలనుంచి ప్రతి నెలా మామూళ్లు ముడుతున్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్న తాధికారులు స్పందించి మీసేవా కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించి వారిపై చర్యలు తీసుకుంటే పేద,మధ్య తరగతి ప్రజలకు కొంతైనా మేలు జరుగుతుంది.

చర్యలు తీసుకోవాలి
మీసేవలో ఎటువంటి సర్టిఫికెట్‌ పొందాలన్నా నిర్ణయించిన దానికంటే అదనంగా వసూలు చేస్తున్నారు. బీమా దరఖాస్తుకు రూ.150 తీసుకుంటున్నారు. కరువు నేపథ్యంలో రైతుకు ఇది భారమే. గంటల తరబడి వేచి ఉంటేనే బీమా దరఖాస్తు పూర్తవుతుంది. కేంద్రాల వద్ద సరైన వసతులు కూడా ఉండటం లేదు. అదనపు వసూళ్లపై అధికారులు చర్యలు తీసుకుని అడ్డుకట్ట వేయాలి.  
– రామనారాయణరెడ్డి, మిద్దెల, కాశినాయన మండలం

దోపిడీ చేస్తున్నారు
మీసేవ నిర్వాహకులు దోపిడి చేస్తున్నారు. ప్రస్తుతం బీమా చేసుకోవాలంటే ప్రభుత్వం చేయూతనిస్తున్నా దరఖాస్తు చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాం. దీనికి తోడు అదనంగా రూ.100 నుంచి రూ.150 వసూలు చేస్తున్నారు. దీనిపై ప్రశ్నించినా ప్రయోజనం లేదు. ఉన్నతాధికారులు పరిశీలించి నిర్ణయించిన రుసుం తీసుకునేలా చర్యలు చేపట్టాలి.    
– నాగేశ్వరరెడ్డి, బసనపల్లె, కాశినాయన మండలం

అడ్డూఅదుపు లేదు 
మీసేవ కేంద్రాల్లో దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోయింది. ప్రస్తుతం అన్ని రకాల ధ్రువీకరణపత్రాలు మీసేవ ద్వారా పొందాల్సి ఉండటంతో వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలను తీసుకోవడం లేదు. దోపిడీకి పాల్పడుతున్న మీసేవ కేంద్రాలపై చర్యలు తీసుకోవాలి.      – పెంచల్‌రెడ్డి, గోపవరం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top