కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి రాష్ట్ర పరిపాలనను తెలుగుదేశం ప్రభుత్వం అప్పగించిందని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీడీఎస్‌యు)
పలాస: కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి రాష్ట్ర పరిపాలనను తెలుగుదేశం ప్రభుత్వం అప్పగించిందని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీడీఎస్‌యు) రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రామకృష్ణ అన్నారు. అందులో భాగమే కార్పొరేట్ దిగ్గజం, నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ నేడు మంత్రి అయ్యారని ఆరోపించారు. పలాస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా విద్యా సదస్సు ఆదివారం జరిగింది. పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షురాలు డి.మల్లిక అధ్యక్షతన జరిగిన సదస్సులో రామకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు ప్రపంచ బ్యాంకు ఏజెంటని విమర్శించారు.
తొమ్మిదేళ్లు అధికారంలో, మరో తొమ్మిది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండడంతోపాటు నేడు మళ్లీ అధికారంలోకి వచ్చిన ఆయన ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్వీర్యం చేసి ప్రైవేటు విద్యా సంస్థలకు ప్రోత్సాహం ఇస్తున్నారన్నారని మండిపడ్డారు. డీటీఎఫ్ రాష్ట్ర నాయకుడు కోత ధర్మారావు మాట్లాడుతూ దేశంలో 25 శాతం మందికి మాత్రమే ప్రభుత్వం ప్రకటించినట్టు 2,400 కేలరీల శక్తి భోజనం లభిస్తోందన్నారు. చాలామంది అత్యంత దారిద్య్రరేఖకు దిగువున జీవిస్తూ విద్య, వైద్య సదుపాయాలకు దూరంగా ఉన్నారన్నారు. పలాస ప్రభుత్వ జూనియన్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రాజగోపాలరావు మాట్లాడుతూ ఉద్యమాలు చట్ట పరిధిలో ఉండాలని, అందుకు నాయకత్వం కూడా అవసరమని చెప్పారు. అలాంటి ఉద్యమ సంస్థయే పీడీఎస్‌యూ అని విద్యార్థులంతా తమ సమస్యలు పరిష్కరించుకోవడానికి శాంతియుతంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
డి.మల్లిక మాట్లాడుతూ చాలీచాలని మెస్ చార్జీలతో విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించుకోవడాని కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పీడీఎస్‌యు అంటే ధర్నాలు, ఆందోళనలే కాదని, సామాజిక స్పృహ కలిగి మంచి యువతీ, యువకులుగా తయారు కావాలన్నారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ నాయకులు ఎస్.పెంటయ్య, రమేష్, వంకల మాధవరావు, గోపిప్రవీణ్ పాల్గొన్నారు. సదస్సు అనంతరం విద్యార్థులంతా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు.