చాపకింద నీరులా.. కరోనా

Corona Positive Cases Increase Five days in West Godavari - Sakshi

నరసాపురంలో ఒకరికి పాజిటివ్‌..16కి చేరిన కేసులు

మరో ఆరుగురికి కూడా కరోనా నిర్ధారణ? నేడు వెల్లడించే చాన్స్‌

ఏలూరులో 3, గూడెంలో 2, పెనుగొండలో ఒకరికి పాజిటివ్‌ అని సమాచారం

జిల్లాలో హైఅలర్ట్‌.. అప్రమత్తమైన అధికారులు 

రెడ్‌జోన్లలో కట్టుదిట్టమైన చర్యలు

సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లాపై కరోనా మహమ్మారి తన ప్రభావం చూపుతోంది. ఇప్పటికే 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా ఇప్పుడు వారి నుంచి కుటుంబ సభ్యులకు, ఇతరులకు వ్యాపిస్తుంది. తాజాగా ఆదివారం నర్సాపురంలో ఒక పాజిటివ్‌ కేసు నమోదు అయ్యింది. దీంతో కేసుల సంఖ్య 16కి చేరింది. మరో ఆరుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు సమాచారం. ఆ వివరాల్ని పూర్తిస్థాయిలో నిర్ధారించుకుని సోమవారం ప్రకటిస్తారని తెలుస్తోంది. నర్సాపురంలోని పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఢిల్లీలోని మర్కత్‌ సమావేశానికి హాజరై తిరిగి వచ్చినట్లు సమాచారం. అధికారికంగా ప్రకటించని కేసుల్లో ఏలూరులో మూడు, తాడేపల్లిగూడెంలో రెండు, పెనుగొండలో ఒకటి ఉన్నట్లు వెల్లడైంది. ఆదివారం మొత్తం 113 రిపోర్టులు రాగా అందులో 106 రిపోర్టులు నెగిటివ్‌ వచ్చాయని, నర్సాపురం వ్యక్తికి పాజిటివ్‌ వచ్చిందని కలెక్టర్‌ ముత్యాలరాజు తెలిపారు. మరో ఆరు కేసుల విషయంలో కొంత సందిగ్ధత ఉందని.. వాటిని రెండోసారి పరిశీలనకు పంపామని చెప్పారు. నివేదిక సోమవారం వచ్చే అవకాశం ఉందని.. ముందుజాగ్రత్తగా ఆయా ప్రాంతాల్ని రెడ్‌జోన్లుగా ప్రకటించి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

రెడ్‌జోన్‌ ప్రాంతాలు దిగ్బంధం
ప్రాథమికంగా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన కేసులను మరోసారి పరీక్షలకు పంపుతున్నారు. అక్కడ కూడా పాజిటివ్‌ వస్తేనే అధికారికంగా ప్రకటిస్తున్నారు. గతంలో నారాయణపురంలో ఒక వ్యక్తికి పాజిటివ్‌ వచ్చినట్లు ప్రకటించినా.. తర్వాత రిపోర్టులో నెగిటివ్‌ రావడంతో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రాథమికంగా నిర్ధారణ అయిన ప్రాంతాల్లో రెడ్‌జోన్‌గా ప్రకటించి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. వారు ఎవరిని కలిశారో సర్వే చేసి.. వారి ఆరోగ్య వివరాల్ని ఆరాతీస్తున్నారు. కొత్త కేసులు కూడా ఢిల్లీకి వెళ్లి వచ్చినవారివే కావడంతో ఆయా తేదీల్లో ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు.

ఐదు రోజుల్లో మారిపోయిన సీన్‌
జిల్లాలో ఐదు రోజుల క్రితం వరకూ ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం నుంచి సీన్‌ మారిపోయింది. ఒకేసారి 15 కేసులు నమోదవడం ప్రజలను ఆందోళనకు గురిచేసింది. కేసుల్లో ఢిల్లీ వెళ్లి వచ్చిన వారే ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. తాజా కేసులు కూడా వారివేనని సమాచారం. పెనుగొండలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి కుమార్తెకు పాజిటివ్‌గా తేలింది. తాడేపల్లిగూడెంలో వ్యక్తిగత పనిమీద ఢిల్లీ వెళ్లి ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో తిరిగి వచ్చిన భార్యాభర్తలకు పాజిటివ్‌ అని ప్రాథమికంగా నిర్ధారించినా అధికారికంగా ప్రకటించలేదు. ఏలూరులో మరో మూడు కేసులు పాజిటివ్‌ వచ్చినట్లు తెలుస్తోంది. వారిలో బ్యాంకు ఉద్యోగి కూడా ఉన్నట్లు చెబుతున్నారు. పాజిటివ్‌ ఉన్న వ్యక్తిని కలవడంతో అతనికి కూడా పాజిటివ్‌ వచ్చినట్లు భావిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top