విలక్షణతకు మారుపేరు పార్వతీపురం

Constituency Review Of Parvathipuram - Sakshi

ఓటర్ల నాడి అంచనా వేయడం కష్టం

కొప్పల వెలమల మద్దతే కీలకం

సాక్షి, పార్వతీపురం: ఏజెన్సీ ముఖ ద్వారంగా ఉన్న పార్వతీపురం నియోజకవర్గానికి ఆది నుంచి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి ఓటర్ల నాడి పట్టుకోవడం తలలు పండిన రాజకీయవేత్తలకు సైతం చిక్కలేదు. నియోజవర్గం ఏర్పాటు నుంచి నేటి వరకు ఓటర్లు విలక్షణ తీర్పునిస్తున్నారు. గతంలో పార్వతీపురం నియోజకవర్గం జనరల్‌గా ఉండేది. ప్రస్తుతం 2014 నుంచి ఎస్సీ రిజర్వేషన్‌గా కొనసాగుతోంది. అప్పట్లో కురుపాం రాజుల పాత్ర రాజకీయాల్లో ఎక్కువగా ఉండేది. ప్రతి ఎన్నికల్లో వారు కీలక పాత్ర పోషించేవారు. రాజులు ఎవరికి మద్దతు తెలిపితే ఆ వైపు విజయవకాశాలు ఉంటాయన్న భావన ఉండేది. 1952 నుంచి ఇప్పటి వరకు జరిగిన రెండు ఉప ఎన్నికలతో పాటు 16 సార్లు సాధారణ ఎన్నికలు జరిగాయి. నియోజకవర్గం మొట్టమొదటి ఎమ్మెల్యేగా మాజీ మంత్రి కిషోర్‌ చంద్రదేవ్‌ తండ్రి దుర్గాప్రసాద్‌ దేవ్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఇప్పటివరకు జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో 8 పర్యాయాలు కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించగా... టీడీపీ అభ్యర్థులు ఐదు సార్లు విజయం సాధించారు. 1967లో స్వతంత్ర పార్టీ తరఫున మరిశర్ల వెంకటరామినాయుడు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరలా 1978లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జనతా పార్టీ తరఫున చీకటి పరశురాం నాయుడు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే పార్వతీపురం నియోజకవర్గంలో ఆ నాటి నుంచి నేటి వరకు కురుపాం కురుపాం రాజుల ప్రాబల్యం కొనసాగుతోంది. పార్వతీపురం నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలు అధికంగా ఉన్నప్పటికీ రాజుల రాజకీయ ముద్ర నేటికీ కొనసాగుతూనే ఉంది. 1972లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి గెలుపొందిన చీకటి పరశురాంనాయుడుకు 1978లో కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్‌ ఇవ్వలేదు. దీంతో ఆయన జనతా పార్టీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడిపై విజయం సాధించారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత మరిశర్ల వెంకటరామినాయుడు టీడీపీలో చేరి కాంగ్రెస్‌ అభ్యర్థి దొడ్డి పరశురాంపై విజయం సాధించారు. 1985లో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో కూడా మళ్లీ వీరిద్దరూ తలపడగా వెంకటరామినాయుడినే విజయం వరించింది. 1989లో జరిగిన ఎన్నికల్లో కూడా తెలుగుదేశంపార్టీ తరఫున పోటీ చేసిన యర్రా కృష్ణమూర్తి, కాంగ్రెస్‌ అభ్యర్థి మరిశర్ల శివున్నాయుడిపై విజయం సాధించారు.

1994లో కూడా వీరిద్దరి మధ్యే పోటీ జరగ్గా యర్రా కృష్ణమూర్తే గెలుపొందారు. 1997లో యర్రా కృష్ణమూర్తి శ్రీకాకుళం ఎన్నికల ప్రచారానికి వెళ్లి మృత్యువాత పడడంతో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కృష్ణమూర్తి భార్యర యర్రా అన్నపూర్ణమ్మ పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి మరిశర్ల శివున్నాయుడిపై విజయం సాధించారు. 1999లో జరిగిన ఎన్నికల్లో మాత్రం వరుసుగా మూడుసార్లు ఓడిపోయిన మరిశర్ల శివున్నాయుడు (కాంగ్రెస్‌) టీడీపీ అభ్యర్థి ప్రతిమాదేవిపై 15 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అప్పటినుంచి 2014 వరకు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ హవా కొనసాగుతూ వచ్చింది. 2004లో జరిగిన ఎన్నికల్లో కురుపాంనకు చెందిన శత్రుచర్ల విజయరామరాజు పార్వతీపురం అసెంబ్లీ స్థానానికి జనరల్‌ కోటాలో పోటీచేశారు. ఈయనపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ద్వారపురెడ్డి జగదీష్‌ పోటీచేసి పరాజయం పొందారు.

అనంతరం విజయరామరాజు వైఎస్‌ క్యాబినెట్‌లో అటవీశాఖామంత్రిగా పనిచేశారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన కారణంగా పార్వతీపురం నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్‌ చేయబడింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన సవరపు జయమణి తెలుగుదేశం  అభ్యర్థి బొబ్బిలి చిరంజీవులపై విజయం సాధించారు. అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో  కాంగ్రెస్‌ తరఫున అలజంగి జోగారావు, తెలుగుదేశం తరఫున బొబ్బిలి చిరంజీవులు, వైఎస్సార్‌సీపీ నుంచి జమ్మాన ప్రసన్నకుమార్‌ పోటీ చేయగా బొబ్బిలి చిరంజీవులు విజయం సాధించారు.  

కొప్పల వెలమలే నిర్ణేతలు
నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలుపు ఓటమిలను నిర్ణయించేది ప్రధాన సామాజిక వర్గమైన కొప్పలవెలమలే. ప్రతి ఎన్నికలోనూ కొప్పల వెలమ సామాజిక వర్గం ఏ పార్టీవైపు పనిచేస్తే ఆ పార్టీ తప్పక గెలుస్తుంది. కొప్పలవెలమ సామాజికవర్గం మూడు మండలాలతో పాటు పార్వతీపురం మున్సిపాల్టీలో కూడా బలంగా ఉంది. అయితే 2014లో పార్వతీపురం నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్‌ కావడంతో మాల, మాదిగ సామాజికవర్గ ఓటర్లకు ప్రాధాన్యం దక్కింది. ఎన్నికల్లో కొప్పల వెలమ తర్వాత మాదిగ సామాజికవర్గ ఓటర్లే కీలకం. 

పార్వతీపురం నియోజకవర్గంలో ఓటర్లు 

మొత్తం ఓటర్లు        1,75,625
పురుషులు       87,120
మహిళలు      88,493
ఇతరులు       12

ఎమ్మెల్యేల వివరాలు..
1952లో పార్వతీపురం నియోజకవర్గం ఏర్పాటు
1952–57 : దుర్గాప్రసాద్‌ దేవ్‌  (కాంగ్రెస్‌)
1957–62  : చంద్రచూఢామణి దేవ్‌  (కాంగ్రెస్‌)
1962–67 : చంద్ర చూఢామణిదేవ్‌   (కాంగ్రెస్‌)
1967–72 : మరిశర్ల వెంకటరామినాయుడు (స్వతంత్ర)
1972–77 : చీకటి పరశురాం నాయుడు  (కాంగ్రెస్‌)
1978–83 : చీకటి పరశురాం నాయుడు  (జనతా)
1984 :  మరిశర్ల వెంకటరామినాయడు  (టీడీపీ)
1985 :  మరిశర్ల వెంకటరామినాయుడు  (టీడీపీ)
1989–94 : యర్రా కృష్ణమూర్తి   (టీడీపీ)
1994–97 : యర్రా కృష్ణమూర్తి  (టీడీపీ)
1997–99:  యర్రా అన్నపూర్ణమ్మ  (టీడీపీ)
1999–2004 : మరిశర్ల శివున్నాయుడు(కాంగ్రెస్‌)
2004–2009 : శత్రుచర్ల విజయరామరాజు   (కాంగ్రెస్‌)
2009–2014 : సవరపు జయమణి   (కాంగ్రెస్‌)
2014–2019:  బొబ్బిలి చిరంజీవులు  (టీడీపీ) 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top