ప్రధాని కార్యాలయంలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ అయ్యింది.
ప్రధాని కార్యాలయంలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ అయ్యింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడం, దాన్ని గవర్నర్ నరసింహన్ కూడా ఆమోదించడంతో ఇక రాష్ట్ర మంత్రివర్గం మొత్తం రద్దు అయినట్లయింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండాలని కిరణ్ కుమార్ రెడ్డిని గవర్నర్ కోరడం, ఆయన దానికి ఏమీ సమాధానం చెప్పకపోవడం వంటి పరిణామాలు అన్నీ కోర్ కమిటీలో చర్చకు వచ్చాయి.
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలా, అసెంబ్లీని సుప్త చేతనావస్థలో ఉంచాలా.. ఏం చేయాలనే విషయాలపై కూడా కాంగ్రెస్ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలిసింది. రాష్ట్రపతి పాలన వద్దని, అవసరమైతే తాము నలుగురిలో ఎవరైనా సరే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి సిద్ధమేనని కూడా నలుగురు రాష్ట్ర మంత్రులు గవర్నర్ నరసింహన్కు తెలియజేయడం కూడా కోర్ కమిటీలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.