వద్దంటున్నా డీఎడ్ కాలేజీలు! | Colleges d-ed the entire fetal genome! | Sakshi
Sakshi News home page

వద్దంటున్నా డీఎడ్ కాలేజీలు!

Jun 13 2014 1:30 AM | Updated on Sep 2 2018 3:39 PM

ప్రభుత్వ కాలేజీలు, సీట్ల సంఖ్యను పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి(ఎన్‌సీటీఈ) ప్రైవేట్ డీఎడ్ కాలేజీలపై మాత్రం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది.

ప్రైవేట్ సంస్థలకు ఎడాపెడా అనుమతులిస్తున్న ఎన్‌సీటీఈ

ప్రభుత్వ కాలేజీలు, సీట్ల పెంపుపై మాత్రం నిర్లక్ష్యం
 
హైదరాబాద్: ప్రభుత్వ కాలేజీలు, సీట్ల సంఖ్యను పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి(ఎన్‌సీటీఈ) ప్రైవేట్ డీఎడ్ కాలేజీలపై మాత్రం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. వద్దంటున్నా ఈ కాలేజీలను మంజూరు చేస్తోంది. ప్రస్తుతమున్న ప్రైవేట్ డీఎడ్ కాలేజీలు చాలని, ఇకపై కొత్త అనుమతులు ఇవ్వొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఎన్‌సీటీఈకి లేఖ రాసినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రభుత్వ కాలేజీలు జిల్లాకు ఒకటి  చొప్పున మాత్రమే ఉన్నాయని, వాటి ని కానీ.. వాటిలోని సీట్ల సంఖ్యను కానీ పెంచాలని కోరినా పట్టించుకోవడం లేదు. తాజాగా 2014-15లో ప్రారంభించేందుకు వీలుగా 53 కొత్త ప్రైవేట్ కాలేజీలకు ఎన్‌సీటీఈ అనుమతులివ్వడం గమనార్హం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే 23 ప్రభుత్వ డైట్‌లతోపాటు 738 ప్రైవేటు డీఎడ్ కాలేజీలు  ఉన్నాయి. వీటన్నింటిలో కలిపి 50 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే సగం కాలేజీల్లో నాణ్యమైన విద్యా బోధన లేకపోగా, కొన్ని కాలేజీలు కనీసం ఎక్కడున్నాయో కూడా తెలియదు. వాటిలో తరగతులు నిర్వహించిందీ లేదు.. చదువు చెప్పిందీ లేదు.

విద్యా శాఖ విచారణ నివేదికలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీ భవనాలకే అదనపు బోర్డు తగిలించి చాలా విద్యా సంస్థలు డీఎడ్ సర్టిఫికెట్లు జారీ చేసే కేంద్రాలుగా మారిపోయాయి. గత ఏడాది 400లకు పైగా కొత్త కాలేజీలకు ఎన్‌సీటీఈ ఇష్టారాజ్యంగా అనుమతులిచ్చింది. దీంతో ప్రైవేట్ కాలేజీల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ డీఎడ్ కాలేజీలు వద్దు మొర్రో అంటూ రాష్ర్ట ప్రభుత్వం లేఖ రాసింది. అయినా ఈసారి మరో 53 కాలేజీలకు(వీటిలోని సీట్ల సంఖ్య 2,650) అనుమతివ్వడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ కాలేజీల్లో 2300 సీట్లు మాత్రమే ఉండటంతో ప్రైవేట్ కాలేజీలు ఇష్టారాజ్యంగా సీట్లను అమ్ముకుంటున్నాయి. తాజా పెంపుతో తెలంగాణలో ప్రైవేట్ డీఎడ్ కాలేజీల సంఖ్య 274కు చేరుకోగా, ఆంధ్రప్రదేశ్‌లో 517కు చేరుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement