ప్రలోభాలకు గురిచేస్తే కేసులే

Collector Vinay Chand Meeting On Election Code - Sakshi

అన్ని పార్టీలు ఎన్నికల నియమావళి ప్రకారం నడుచుకోవాలి

జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు

కలెక్టర్‌ వినయ్‌చంద్‌

ఒంగోలు అర్బన్‌: ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో రాజకీయ పార్టీ నాయకులు ఓటర్లను బెదిరించడం, ప్రలోభాలకు గురిచేయడం లాంటివి చేస్తే కేసులు నమోదు చేస్తామని కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ అన్నారు. స్థానిక ప్రకాశం భవనంలోని సీపీఓ కాన్ఫరెన్స్‌ హాలులో ఎన్నికల ప్రవర్తనా, నియమావళిపై సోమవారం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల నియమావళి ప్రకారం నడుచుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రచారాలకు సంబంధించి రాజకీయ పార్టీలు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు తీసుకుని సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలన్నారు.

ఏ కార్యక్రమం చేసినా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్‌ స్పీకర్లు వినియోగించకూడదన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు అన్ని పార్టీలు సహకరించాలన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాల్లో ప్రకటనలు జారీ చేసే ముందు మీడియా మానెటరింగ్‌ సర్టిఫికెట్‌తో అనుమతి పొందాలన్నారు. పార్లమెంట్‌ అభ్యర్థులు రూ. 70 లక్షలు, ఎమ్మెల్యే అభ్యర్థులు రూ.28లక్షలు ఎన్నికల వ్యయంగా నిర్ధారించినట్లు తెలిపారు. మద్యం, నగదు పంపిణీ నివారణకు జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల సమాచారాన్ని తెలిపేందుకు కలెక్టరేట్‌లో మీడియా సెల్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ నాగలక్ష్మి, డీఆర్‌ఓ వెంకటసుబ్బయ్య, వైఎస్సార్‌ సీపీ ప్రతినిధులు శింగరాజు వెంకట్రావు, డీఎస్‌ క్రాంతికుమార్, టీడీపి ప్రతినిధి డి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్‌ పార్టీ నుంచి శ్రీపతి ప్రకాశం, జనసేన సుంకర సాయిబాబా, సీపీఐ, సీపీఎం నాయకులు పాల్గొన్నారు.

ముద్రణారంగం, మీడియా ఎన్నికల నియమావళిని పాటించాలి
భారత ఎన్నికల సంఘం సూచించిన నియమ నిబంధనలకు లోబడి ముద్రణరంగం యజమానులు, మీడియా ముద్రణ, ప్రచారాలు చేపట్టాలని ప్రత్యేక కలెక్టర్‌ చంద్రమౌళి అన్నారు. స్థానిక ఎన్టీఆర్‌ కళాపరిషత్‌లో ముద్రణా రంగం యజమానులు, కేబుల్‌ నెట్‌ వర్క్‌ ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి డిక్లరేషన్‌ ఫారం లేకుండా కరపత్రాలు కానీ, గోడపత్రికలు కానీ ప్రచురించకూడదన్నారు. డిక్లరేషన్‌పై ఇద్దరు సాక్షులతో సంతకాలు ఉండాలన్నారు. ప్రింటింగ్‌ అనంతరం పబ్లిషర్‌ సంతకం చేసిన డిక్లరేషన్‌తో పాటు ప్రింటింగ్‌ చేసిన వాటిని సంబంధిత ఎలక్షన్‌ ఎక్స్‌పెండేచర్‌ మానిటరింగ్‌ కమిటీకి అందజేయాలన్నారు. ముద్రించిన కరపత్రాలు, పోస్టర్లు ఎన్ని సంఖ్యలో చేసింది కూడా ముద్రించాలన్నారు.

కేబుల్‌ నెట్‌ వర్క్‌ ద్వారా అభ్యర్థులకు అనుకూలంగా ప్రసారాలు చేయకూడదన్నారు. కులమతాలను రెచ్చగొట్టకుండా కార్యక్రమాలను ప్రసారం చేయాలన్నారు. వీటిపై వీడియో సర్వేలెన్స్‌ బృందాలు పర్యవేక్షిస్తుంటాయన్నారు. అభ్యర్థుల తరఫు చేపట్టే ప్రసారాలకు సంబంధించిన సీడీలను మానెటరింగ్‌ కమిటీ అనుమతితో ప్రసారం చేయాల్సి ఉంటుందన్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. దీనిలో సర్వశిక్ష అభియాన్‌ పీఓ వెంకటేశ్వరరావు, కలెక్టరేట్‌ ఈ విభాగం అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top