కాయ్ రాజా.. కాయ్! | Cock fight in sattupalli Mandal | Sakshi
Sakshi News home page

కాయ్ రాజా.. కాయ్!

Dec 29 2013 12:56 PM | Updated on Sep 2 2017 2:05 AM

కాయ్ రాజా.. కాయ్!

కాయ్ రాజా.. కాయ్!

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో కోడిపందేలా నిర్వహణకు జోరుగా ఏర్పాటు సాగుతున్నాయి. సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఆనవాయితీ పేరిట ఇక్కడ కోడిపందేలు నిర్వహించడం రివాజుగా మారింది.

సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో కోడిపందేల నిర్వహణకు జోరుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఆనవాయితీ పేరిట ఇక్కడ కోడిపందేలు నిర్వహించడం రివాజుగా మారింది. సంస్కృతి, సంప్రదాయం పేరుతో పందేలు నిర్వహిస్తున్నప్పటికీ.. పలు కుటుంబాలు ఆ జూదంలో పాల్గొని వీధిన పడుతున్నాయి. సత్తుపల్లి మండలం పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లాల సరిహద్దులో ఉండటంతో ఆంధ్ర ప్రాంతంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే కోడిపందేల జోరు ఇక్కడ కూడా కనిపిస్తోంది. ఈ క్రమంలో లక్షల రూపాయలు చేతులు మారుతుంటాయి.
 
నిర్వహణకు  ఏర్పాట్లు..
సత్తుపల్లి మండలం గంగారం-చింతంపల్లి రహదారిలోని ఓ మామిడితోటలో కోడి పందేల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ మూడురోజులు కోడిపందేలు నిర్వహించేందుకు పోలీ సు అధికారుల నుంచి అనుమతులు వచ్చేశాయంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. పందేలు వేసే స్థలం(బిర్రు)లో కూర్చునేందుకు ‘వీఐపీ’, ‘వీవీఐపీ’ పేరిట పాసులు పంపిణీ చేస్తున్నారు. గతేడాది వరకు పశ్చిమగోదావరి జిల్లా జనార్ధనవరం, చింతంపల్లి, శ్రీనివాసపురం, కళ్లచెరువు, వెంకటాపురం తదితర గ్రామాలలో నిర్వహించే కోడి పందేలకు సత్తుపల్లి ప్రాంతానికి చెందిన పందెంరాయుళ్లు వెళ్లేవారు. అయితే ఈ ఏడా ది ఇక్కడే పందేల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
 
ఇద్దరు నేతల సహకారంతో..
ఆంధ్రా ప్రాంతంలో నిర్వహించే కోడిపందేలకు అక్కడి ప్రజా ప్రతినిధులే అన్నీ దగ్గరుండి చూసుకుంటారనే ప్రచారం ఉంది. అదే తరహాలో సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన పాలక, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఇద్దరు ముఖ్య నేతల సహకారంతో కోడిపందేలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. అధికారిక అనుమతులు వచ్చేందుకు ఓ మాజీ కేంద్రమంత్రి ముఖ్య అనుచరుడు సహకరించారని, జిల్లా స్థాయిలో అధికారులందరినీ ‘మేనేజ్’ చేశారని ప్రచారం సాగుతోంది. కాగా, ప్రతిపక్ష పార్టీకి చెందిన ఈ ప్రాంత ముఖ్యనేతల అనుచరులు కోడిపందాల నిర్వహణ ఏర్పాట్ల బాధ్యతలు చూస్తున్నారు.
 
పందేల ముసుగులో పేకాట..!
కోడి పందేల ముసుగులో పేకాట స్థావరాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది. ఉదయం కోడి పందేలు ముగియగానే.. రాత్రి వేళల్లో పేకాట నిర్వహిస్తారని సమాచారం. జూదరులను ఆకట్టుకునేందుకు మద్యం, బిర్యానీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ప్రతిదానికి ఒక ధర నిర్ణయించి దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు పందేల నిర్వాహకులు అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. దీనిపై సత్తుపల్లి సీఐ యు.వెంకన్నబాబును ‘న్యూస్‌లైన్’ సంప్రదించగా, కోడి పందేలకు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఎక్కడైనా నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోడిపందేలు, పేకాట స్థావరాల నిర్వహణ గురించి తెలిస్తే తమకు సమాచారం అందివ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement