సాక్షి, కాకినాడ : అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ‘ఫైలిన్’ పెనుతుపానుగా మారుతుండడంతో జిల్లాలో తీర ప్రాంత ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
వణికిస్తున్న ‘ఫైలిన్’
Oct 10 2013 4:18 AM | Updated on Sep 1 2017 11:29 PM
సాక్షి, కాకినాడ : అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ‘ఫైలిన్’ పెనుతుపానుగా మారుతుండడంతో జిల్లాలో తీర ప్రాంత ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. 1996 తుపాను మాదిరిగానే విధ్వంసం సృష్టించే సూచనలు కనిపిస్తుండడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు. కాగా తుపాను హెచ్చరికతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ నీతూప్రసాద్ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు.
గత 58 రోజులుగా సమ్మెలో ఉన్న రెవెన్యూ ఉద్యోగులతో పాటు ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, వ్యవసాయ, ఆర్‌డబ్ల్యూఎస్, మత్స్య, ఏపీ ట్రాన్స్‌కో శాఖల సిబ్బందితో పాటు మండల ప్రత్యేకాధికారులను కూడా అప్రమత్తం చేశారు. సమ్మెను కొనసాగిస్తూనే తుపాను పునరావాస చర్యల్లో పాల్గొనాలని, ఇతర విధుల్లో పాల్గొనరాదని రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ సమావేశం నిర్ణయించింది. కలెక్టరేట్‌తో పాటు ఆర్డీఓ, తహశీల్దార్ల కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌లో 0884-2365506, టోల్ ఫ్రీ నం : 1077, అమలాపురం ఆర్డీఓ కార్యాలయంలో 08856- 233100 నంబర్లతో కంట్రోల్‌రూమ్‌లు పని చేయనున్నాయి. సమ్మెలో ఉన్న తీరప్రాంత తహశీల్దార్లు హుటాహుటిన కార్యాలయాలకు వెళ్లారు.
భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులకు అవకాశం
ఒడిశా తీరంలోని కళింగపట్నం-పరదీప్‌ల మధ్య ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికల కేంద్రం అంచనా వేసింది. తీరం దాటే వరకు ఒక మోస్తరు నుంచి 25 సెంటీమీటర్ల వరకు భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే సంబంధిత శాఖాధికారుల నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. రానున్న మూడు రోజులు తీరంలో 175 నుంచి 185 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, దీంతో మత్స్యకారులెవ్వరూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని కలెక్టర్ నీతూప్రసాద్ హెచ్చరించారు.
ఇప్పటికే తీరంలో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు ప్రధాన కార్యస్థానాల్లో ఉండి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలపాలని కలెక్టర్ ఆదేశించారు. అధికారులు ముందస్తు సమాచారం లేకుండా పనిచేసే ప్రాంతం విడిచి వెళ్లవద్దన్నారు. కాగా తుపాను పునరావాస చర్యలను పర్యవేక్షించేందుకు జిల్లాకు ప్రత్యేకాధికారిగా ఎం.రవిచంద్రను నియమించారు.
Advertisement
Advertisement