15 నుంచి వలంటీర్ల ఖాళీల భర్తీ

CM YS Jagan Video Conference with Collectors and SPs and Officers from Secretariat - Sakshi

ఆ పోస్టులు ఖాళీ అనే మాటే వినిపించకూడదు ‘స్పందన’పై వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్‌

గ్రామ సచివాలయాల ద్వారా జనవరి నుంచి 500కు పైగా సేవలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందాలి

వైఎస్సార్‌ కంటి వెలుగు ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్ల పిల్లలకూ పరీక్షలు 

ప్రతి ఆడబిడ్డ కనీసం డిగ్రీ చదవాలి.. 21 ఏళ్ల తర్వాతే పెళ్లి చేసుకోవాలి 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వలంటీర్ల పోస్టుల ఖాళీలన్నింటినీ ఈనెల 15 నుంచి భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. వలంటీర్ల పోస్టులు ఖాళీ అన్న మాటే తనకు వినిపించకూడదన్నారు. వలంటీర్‌ పోస్టులు ఖాళీగా ఉంటే ప్రయోజనాలు నెరవేరవని, చివరి స్థాయిలో అనుసంధానం నిలిచిపోతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించి వలంటీర్ల ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలన్నారు. ‘స్పందన’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి మంగళవారం సచివాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. గ్రామ వలంటీర్లుగా ఉన్నవారు కొంతమంది గ్రామ సచివాలయ ఉద్యోగాల పరీక్షలు రాసి ఎంపికైనందున వలంటీర్ల పోస్టులు ఖాళీ అయ్యాయని, అలాంటి చోట్ల వెంటనే భర్తీ చేపట్టాలని సీఎం సూచించారు. పట్టణ ప్రాంతాల్లో అవసరమైన చోట వలంటీర్ల విద్యార్హతలను తగ్గించే అవకాశాలను పరిశీలించాలని, ఇంటర్‌ను అర్హతగా పరిగణిస్తే వార్డు వలంటీర్ల పోస్టులు భర్తీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. 

జనవరి నుంచి 500 రకాలకుపైగా సేవలు..
గ్రామ, వార్డు సచివాలయాలు గాంధీ జయంతి సందర్భంగా బుధవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో డిసెంబర్‌ కల్లా అన్నీ సమకూర్చుకోవాలని సీఎం సూచించారు. జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో పని చేస్తూ దాదాపు 500 రకాలకు పైగా సేవలను సచివాలయాల ద్వారా ప్రజలకు అందజేయాలని స్పష్టం చేశారు. జనవరి 1 నుంచి అర్హులైన వారందరికీ కొత్తగా పెన్షన్లు, రేషన్‌ కార్డులు ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. పూర్తిస్థాయిలో పని చేయడం ప్రారంభించాక ప్రతి రోజూ స్పందన కార్యక్రమం చేపట్టాలన్నారు.  

వైఎస్సార్‌ కంటి వెలుగుపై సమీక్ష
‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ కింద ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లలో చదివే విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించేందుకు వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి జగన్‌ సూచించారు. సిబ్బందికి కిట్లను పంపిణీ చేస్తున్నామని, అక్టోబరు 10 నుంచి 16 వరకు విద్యార్ధులకు స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. నవంబరు 1 నుంచి డిసెంబరు 31 వరకు చికిత్స కార్యక్రమాన్ని చేపడతామన్నారు.

పౌష్టికాహార లోప నివారణపై చర్యలు
మహిళలు, పిల్లల్లో పౌష్టికాహార లోపం, రక్తహీనత నివారణకు గ్రామ వలంటీర్ల ద్వారా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో స్క్రీనింగ్‌ పరీక్షల నిర్వహణ ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. పిల్లల్లో పౌష్టికాహార లోప నివారణకు గతంలో రూ.8 ఇస్తుండగా రూ.18 వరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. తల్లులకు మంచి ఆహారం అందించడానికి ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రతి ఆడబిడ్డ కనీసం డిగ్రీ చదవాలని, ఆ తర్వాతే వివాహం గురించి ఆలోచిస్తే బాగుంటుందన్నారు. 21 ఏళ్లు దాటాకే ఆడపిల్లలు పెళ్లిళ్లు చేసుకోవాలని విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలో రక్తహీనత సమస్య అధికంగా ఉందని, చిన్న వయసులో వివాహాల కారణంగా పుట్టే పిల్లలకూ ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయన్నారు.

పెద్దలను ఆదరిద్దాం..
రాష్ట్ర స్థాయి సీనియర్‌ సిటిజన్స్‌ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. కనీసం నలుగురు సీనియర్‌ సిటిజన్స్‌ ఈ కౌన్సిల్‌లో ఉండాలని సూచించారు. నెలకు ఒకసారి వారు తనతో సమావేశం అవుతారని చెప్పారు. ఇదే తరహాలో జిల్లా స్థాయిల్లో కూడా ఈ కౌన్సిళ్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఒక్కరికీ వృద్ధాప్యం తప్పదని, ఇవాళ మనం వారిని సరిగా చూసుకోకపోతే.. రేపు మనల్ని చూసుకునేవాళ్లు కూడా ఉండరని సీఎం పేర్కొన్నారు.   

4న ఏలూరులో ‘వైఎస్సార్‌ వాహనమిత్ర’ ప్రారంభం
ఆటోలు, కార్లు, ట్యాక్సీలు సొంతంగా నడుపుకొనేవారికి ‘వైఎస్సార్‌ వాహన మిత్ర’ పథకం కింద రూ.10 వేలు చొప్పున అందజేసే కార్యక్రమాన్ని అక్టోబర్‌ 4వ తేదీన ఏలూరులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ఆర్థిక శాఖ మంగళవారం టెస్ట్‌రన్‌ కూడా నిర్వహించింది. వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం కింద ఇప్పటివరకు 1,75,309 దరఖాస్తులు అందగా 1,67,283 దరఖాస్తులను ఆమోదించినట్లు అధికారులు తెలిపారు.

5న వైఎస్సార్‌ రైతు భరోసా లబ్ధిదారుల జాబితా!
వైఎస్సార్‌ రైతు భరోసా లబ్ధిదారుల జాబితాను ఈనెల 5వతేదీన గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నం చేయాలని సీఎం సూచించారు. అక్టోబరు 8న తుది జాబితాను వ్యవసాయశాఖకు పంపించాలన్నారు.  

ఈ స్థాయిలో ఇళ్ల పట్టాలు ఇదే తొలిసారి..
ఉగాది నాటికి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి సంబంధించి ఇప్పటివరకు 17,34,817 మంది లబ్ధి దారులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన దరఖాస్తుల పరిశీలన త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. దేశంలో ఎప్పుడూ ఎక్కడా ఈ స్థాయిలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేపట్టలేదని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని చరిత్ర గుర్తుంచుకుంటుందని చెప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top