అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోవద్దు: సీఎం జగన్‌

CM YS Jagan Review With Municipal And Urban Development Officials - Sakshi

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష

సాక్షి, అమరావతి: కొద్దిపాటి వర్షానికే ప్రజలు నరకయాతన పడుతున్నారని.. ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి బొత్స సత్యనారాయణ, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. వర్షాకాలంలో నగర ప్రజల జీవనం దుర్భరంగా మారుతోందని.. వర్షాకాలంలో ముంబై, చెన్నై లాంటి నగరాల్లో ఏం జరుగుతుందో చూస్తున్నామని.. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదని అధికారులకు సూచించారు. కాల్వలు, ప్రవాహాలకు అడ్డంగా నిర్మాణాల వలన సమస్యలను కొనితెచ్చుకున్నట్లేనన్నారు. పైగా వాటికి చట్టబద్ధత ఉండదని.. ఎప్పటికీ పట్టా కూడా రాదని.. చట్టాలు దీనికి అంగీకరించవన్నారు. నదీ పరీవాహక ప్రాంతాలకు భంగం కలగకుండా చూడాలన్నారు.

మౌలిక​ సదుపాయాల కల్పనపై సుదీర్ఘ చర్చ.. 
నగరాలు, మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పన ప్రణాళికలపై సీఎం జగన్‌ సుదీర్ఘంగా చర్చించారు. తాగునీరు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, వ్యర్థాల తొలగింపు, మురుగునీటి శుద్ధి, పర్యావరణ పరిరక్షణ ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు. వీటి కోసం కొనసాగుతున్న ప్రాజెక్టులు, చేపట్టాల్సిన కొత్త పనులపై అధికారులతో సీఎం సమీక్షించారు. ప్రతి మున్సిపాలిటీలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ ఉండాలని.. మురుగునీటి శుద్ధి ఉండాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఉండాలని..  ఇవన్నీ ఉండేలా ప్రతి మున్సిపాలిటీకి కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి పైపులైన్లు డ్రైనేజీతో సంబంధం లేకుండా చూసుకోవాలని.. పట్టణాలు, నగరాల్లో వ్యర్థాల సేకరణ సరిగ్గా ఉండడం లేదన్నారు. ఆ మేరకు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. వార్డు, గ్రామ సచివాలయ వ్యవస్థను పూర్తిగా వినియోగించుకోవాలని సీఎం సూచించారు. తాగునీరు, డ్రైనేజి, ఇళ్లు, కరెంటు, రేషన్‌ కార్డు, పెన్షన్, ఆరోగ్యశ్రీపై గ్రామ, వార్డు సచివాలయాలు దృష్టిపెట్టాలన్నారు. ఏ సమస్య వచ్చినా.. వెంటనే తక్షణమే పరిష్కారం అయ్యేవిధంగా ఉండాలన్నారు.

మోడల్‌ మున్సిపాలిటీలుగా తాడేపల్లి, మంగళగిరి
తాడేపల్లి, మంగళగిరిలను మోడల్‌ మున్సిపాలిటీలుగా రూపొందించడంపై సమావేశంలో చర్చ జరిగింది. భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, తాగునీటి వసతి, రోడ్ల అభివృద్ధి కోసం ప్రతిపాదనలపై సీఎం చర్చించారు. ప్రస్తుతం ఉన్న వసతులు, పెంచాల్సిన సదుపాయాలపై వివరాలు అడిగారు. తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో ఇళ్లులేని పేదలకు గృహాలు మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. తాడేపల్లిలో కనీసం 15 వేల ఇళ్లు ఇవ్వాలన్నారు. నిర్మించే ఇళ్ల సముదాయాల వద్ద కనీస మౌలిక సదుపాయాలకూ కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని, ఉగాది నాటికి అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సూచించారు. అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, రోడ్లు, కరెంటు, వీధిలైట్లు కనీస మౌలిక సదుపాయాలను కల్పించాలని.. తాడేపల్లి మున్సిపాలిటీలో 100 పడకల ఆస్పత్రికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కృష్ణానది కట్టమీద, కరకట్టలోపల, కాల్వ గట్ల మీద ఉంటున్న వారికి ఇళ్ల నిర్మాణంపై సమావేశంలో సుదీర్ఘ చర్చించిన సీఎం.. వారికి శాశ్వతంగా సమస్య పరిష్కరించాలన్నారు.

ఉగాది నాటికి అందరికీ ఇళ్లు..
ఇళ్ల నిర్మాణం కింద ప్రస్తుతం ఇస్తున్న సెంటున్నర కాకుండా కనీసం 2 సెంట్లు విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, కోరుకున్న ప్రాంతంలోనే ఇళ్ల నిర్మాణం చేసి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పర్యావరణ పరిరక్షణ, నదీ చట్టాలను పటిష్టంగా అమలు చేయడంతో పాటు వీటి కారణంగా పేదలు, సామాన్యులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలూ తీసుకోవాలన్నారు. ఉగాది నాటికి పట్టాలు ఇవ్వడమే కాకుండా మంచి డిజైన్లలో వారికి ఉచితంగా ఇళ్లు కట్టి ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ భూముల్లో సుదీర్ఘ కాలంగా ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న వారికి పట్టాలు మంజూరు చేయాలని సూచించారు. బకింగ్‌ హాం కెనాల్‌ కాలుష్యం కాకుండా చూడాలని.. కాల్వ గట్లపై మొక్కలను విస్తారంగా పెంచాలన్నారు. పేదలకు మంచి సౌకర్యాలు కల్పించడం ద్వారానే ఆదర్శ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దడానికి సాధ్యమవుతాయని,  మున్సిపల్‌ ఆఫీసుల్లో లంచాల వ్యవస్థ లేకుండా నియంత్రించాలన్నారు. ఏ పౌరుడు, బిల్డరు కూడా లంచం ఇచ్చి పనులు చేయించుకునే పరిస్థితి ఉండకూడదని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. (చదవండి: అక్టోబరు 4న వైఎస్సార్‌ వాహన మిత్ర ప్రారంభం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top