పేదవాడి సొం‍తింటి కలకు.. బృహత్‌ ప్రణాళిక

CM YS Jagan Review Meeting On Housing Scheme - Sakshi

ఉగాది నాటికి 26.6 లక్షల ఇళ్ల పట్టాలు

2024 నాటికి 30 లక్షల ఇళ్లు

ఇప్పటికి 14,097 వైఎస్సార్‌ జగనన్న కాలనీలు

ప్రతి పేదవాడికి నెరవేరనున్న సొంతింటి కల

భారీ బృహత్‌ కార్యక్రమానికి కార్యాచరణ

ప్రభుత్వ గృహ నిర్మాణ రంగంలో కొత్త చరిత్రకు సీఎం జగన్ శ్రీకారం

ఇంటిపై పావల వడ్డీకే రుణం ఇచ్చేలా బ్యాంకులతో మాట్లాడనున్న ప్రభుత్వం

ప్రతిపేదవాడికి సొంతింటికలను నిజం చేసే దిశగా ప్రభుత్వం బృహత్‌ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఉగాది రోజున 26.6 లక్షల ఇళ్లపట్టాల పంపిణీకి సిద్ధమైన ప్రభుత్వం.. వచ్చే నాలుగేళ్లలో 30లక్షలకుపైగా ఇళ్లను నిర్మించడానికి కార్యాచరణను సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ గృహనిర్మాణ రంగంలో కొత్త చరిత్రను సృష్టించడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు సమాయత్తమైంది. 2024 నాటికి ఈ కలను సాకారం చేసేదిశగా అడుగులేస్తోంది. 

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం గృహ నిర్మాణ శాఖ అధికారులతో క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పుడిస్తున్న ఇళ్లపట్టాలు, నిర్మించాల్సిన ఇళ్లపై పూర్తిస్థాయిలో సమీక్షించారు. ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రతిఏటా నిర్మించాల్సిన లక్ష్యాలపైనా చర్చించారు. పట్టణ, నగరాభివృద్ధి సంస్థలు, గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు, వాటినుంచి ఇప్పటివరకూ మంజూరైన ఇళ్ల వివరాలను సీఎం వైఎస్‌ జగన్‌ అడిగి తెలుసుకున్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాల అమల్లో భాగంగా ఇంకా ఎన్ని ఇళ్లు రాష్ట్రానికి మంజూరు అవడానికి ఆస్కారం ఉందన్న అంశాలపై అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేందుకు ఆస్కారం ఉన్న నిధులు, అదిపోనూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ మేరకు నిధులు అవసరమన్న దానిపై చర్చించారు. మొత్తం మీద ఈ ఉగాది నాటికి 26.6 లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వనున్నామని, వచ్చే నాలుగేళ్లలో 30 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించబోతున్నామని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. సమావేశంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మహా క్రతువులో 45 వేల మంది..
ఇప్పుడు పట్టాలు పొందుతున్న పేదలతోపాటు, సొంతంగా ఇళ్లస్థలాలు ఉన్న పేదలకూ ఇళ్లు నిర్మిస్తామని, మున్సిపాలిటీలు, నగరాభివృద్ధి సంస్థల పరిధిలోనే దాదాపు 19.3 లక్షలకుపైగా ఇళ్లను నిర్మించడానికి ప్రణాళికలు వేసినట్టు అధికారులు సీఎంకు తెలిపారు. గృహనిర్మాణ శాఖలో ఉన్న 4,500 మంది ఇంజనీర్లతోపాటు గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్తగా నియామకం అయిన సిబ్బందిలో 45 వేల మంది కూడా 30 లక్షల ఇళ్ల నిర్మాణ క్రతువులో భాగస్వాములు అవుతారని అధికారులు వెల్లడించారు. మొత్తంగా 45వేల మంది సిబ్బందితో ఈ మహాక్రతువును నిర్వహిస్తామని చెప్పారు. 

నాణ్యంగా.. అందంగా..
ఇళ్లన్నీ ఒకే నమూనాలో ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. డిజైన్‌లో కొన్ని మార్పులు చేర్పులు సూచించారు. నిర్మాణం అత్యంత నాణ్యంగా, అందంగా ఉండేలా చూడాలని ‍స్పష్టం చేశారు. బెడ్‌రూం, కిచెన్, వరండా, టాయిలెట్‌ ఉండేలా డిజైన్‌ రూపొందించారు. ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇంటిపై రూ.25వేల రూపాయల వరకు పావలా వడ్డీకే రుణం ఇచ్చేలా బ్యాంకులతో మాట్లాడాలని, మిగిలిన వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందని సీఎం అధికారులకు తెలిపారు. అత్యవసరాలకు ఈ డబ్బు పేదవాడికి చాలా మేలు చేస్తుందని, అధిక వడ్డీలు చెల్లిస్తూ ఇతరులపై ఆధారపడే పరిస్థితి ఉండదని సీఎం అన్నారు. పేదలకు కడుతున్న కాలనీల్లో చెట్లు నాటాలని, డ్రైనేజీ ఏర్పాటుపైనా సరైన ప్రణాళిక అమలు చేయాలని సీఎం ఆదేశించారు. కరెంటు, తాగునీటి వసతి కూడా కల్పించాలన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top