వరద జలాలను ఒడిసి పట్టాలి..

CM YS Jagan Review On Irrigation Department - Sakshi

నాలుగేళ్లలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి

జిల్లాల వారీగా ప్రాజెక్టులపై నివేదికలు సిద్ధం చేయండి

జల వనరుల శాఖ సమీక్షా సమావేశంలో  సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: వరద వచ్చినప్పుడే జలాలను ఒడిసిపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. ఆయన గురువారం జలవనరుల శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర్రంలో ఇప్పటి వరకూ జరిగిన సాగునీటి ప్రాజెక్టుల పనుల గురించి ఇరిగేషన్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సముద్రంలోకి నీళ్లు వెళ్లకముందే కృష్ణా వరద జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టులన్నీ నిండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. 120 రోజులు వరద వస్తుందనే లెక్కలను సవరించాలన్నారు.

ఈ సీజన్‌లో వరద వచ్చినా ప్రాజెక్టులను నింపడానికి చాలా సమయం పడుతుందని చెప్పారు. అతి తక్కువ సమయంలో భారీగా వరద వచ్చిందని..శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నిండి వరద  జలాలు సముద్రంలోకి వెళ్ళాయన్నారు. దేవుడి దయతో  రెండోసారి వరద వచ్చిందన్నారు. 30 రోజులు మాత్రమే వరద వస్తుందని అంచనా వేసి ఆ మేరకు నీటిని తరలించడానికి చర్యలు చేపట్టాలన్నారు. ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నాకూడా సాగునీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ప్రతి రూపాయిని కూడా సద్వినియోగం చేయాలని అధికారులకు సూచించారు.

నాలుగేళ్లలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తికావాలి..
సాగునీటి ప్రాజెక్టు పనుల్లో స్కాంలు లేకుండా పారదర్శకంగా పనులు చేపట్టాలని సీఎం చెప్పారు. సాగునీటి ప్రాజెక్టు పనుల్లో రివర్స్‌ టెండరింగ్‌ విధానం పాటించాలన్నారు. సాగునీటి ప్రాజెక్టులు నాలుగేళ్లలో తప్పనిసరిగా పూర్తికావాలని.. దీని కోసం జిల్లాల వారీగా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఒడిశాతో అభ్యంతరాలున్న ప్రాజెక్టులపై నోట్‌ ప్రిపేర్‌ చేయాలని..సమస్యల పరిష్కారానికి ఆ రాష్ట్ర్ర ముఖ్యమంత్రితో చర్చలకు సన్నాహకాలు చేయాలని అధికారులను ఆదేశించారు. జంఝావతి ప్రాజెక్టుపైనా ఒడిశా అభ్యంతరాలు కారణంగా పూర్తిస్థాయిలో సాగునీరు ఇవ్వలేకపోతున్నామని అధికారులు తెలపగా.. దీనిపై నోట్‌ ప్రిపేర్‌ చేయాలని సీఎం ఆదేశించారు. జిల్లాల వారీగా ప్రాజెక్టులపై నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. నాలుగేళ్లలో వాటిని పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలన్నారు. పల్నాడును సస్యశ్యామలం చేయాలని..దీని కోసం పనులు వేగవంతం చేయాలన్నారు. తోటపల్లి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్‌ను పూర్తిచేయాలని ఆదేశించారు.

పునరావాస పనుల్లో ఉదారంగా వ్యవహరించండి...
సహాయ పునరావాస పనుల్లో ఉదారంగా ఉండాలని..ముంపు ప్రాంతాల బాధితుల పట్ల మానవతా దృక్పథంలో వ్యవహరించాలని అధికారులను సూచించారు. జిల్లాల మధ్య నీళ్ల కోసం కొట్లాటలు ఉండకూడదని..ఆప్యాయతలు పంచుకునే వాతావరణం ఉండాలన్నారు. ఎక్కడ సమస్యలు ఉన్నాయో గుర్తించి.. ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. మూడు నాలుగేళ్లలో ప్రాధాన్యతా ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలని సీఎం ఆదేశించారు. ఆక్వా కారణంగా మంచి నీటి కాల్వలు కలుషితం కాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. కలుషిత నీటిని తాగి.. ప్రజలు తీవ్ర రోగాల బారిన పడుతున్నారన్నారు. ఎక్కడ మురుగునీటిశుద్ధి ప్లాంట్లు కావాలో అక్కడ  ఏర్పాటు చేయాల్సి అవసరం ఉందని చెప్పారు.

ఆర్‌ఆర్‌ ప్యాకేజీ కల్పనలో ప్రాధాన్యతనివ్వాలి..
పోలవరం ప్రాజెక్టు సహాయ పునరావాస పనులపై సీఎం సమీక్ష జరిపారు. దీని కోసమే ప్రత్యేక అధికారిని నియమించామని సీఎం తెలిపారు. మొన్నటి వరదల్లో మునిగిన ప్రాంతాల ప్రజలకు ఆర్‌ఆర్‌ ప్యాకేజీ కల్పనలో ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ఆదేశించారు. వచ్చే సీజన్‌నాటికి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించారు. చింతలపూడి లిఫ్ట్‌ ఇరిగేషన్‌పైనా సీఎం రివ్యూ నిర్వహించారు. భూసేకరణలో సమస్య ఉందని అధికారులు నివేదించారు. 600 ఎకరాలకుపైగా భూమిని సేకరించాలని అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుపైనా సీఎం సమీక్ష నిర్వహించారు. సమీక్ష సమావేశంలో ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top