గాలేరు–నగరి.. హంద్రీ–నీవా అనుసంధానం

CM YS Jagan Mohan Reddy laid foundation for two projects today - Sakshi

చిత్రావతి రిజర్వాయర్‌ నుంచి ఎత్తిపోతల

పులివెందుల, లింగాల మండలాల్లోని చెరువులకు నీరు

యురేనియం ప్రభావిత గ్రామాలకు కూడా..

కృష్ణా వరద జలాలతో వైఎస్సార్, చిత్తూరు జిల్లాల మెట్ట ప్రాంతాలు సస్యశ్యామలం

సర్వే సంస్థలకు డీపీఆర్‌ తయారీ బాధ్యతలు

నేడు రెండు ప్రాజెక్టులకు సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన

సాక్షి, అమరావతి: గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంతో హంద్రీ–నీవా సుజల స్రవంతి రెండో దశ అనుసంధానం, చిత్రావతి రిజర్వాయర్‌ నుంచి నీటిని ఎత్తిపోసి పులివెందుల, లింగాల మండలాల్లోని చెరువులను నింపడంతోపాటు యూసీఐఎల్‌ (యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌) ప్రభావిత ఏడు గ్రామాల ప్రజలకు నీటిని అందించేందుకు చేపట్టిన ప్రాజెక్టులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం వైఎస్సార్‌ జిల్లా రాయచోటిలో శంకుస్థాపన చేయనున్నారు. ఈ రెండు పథకాల ద్వారా కృష్ణా వరద జలాలను ఒడిసిపట్టి వైఎస్సార్‌ కడప, చిత్తూరు జిల్లాల్లో మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

1.41లక్షల ఎకరాలు సస్యశ్యామలం
వైఎస్సార్‌ కడప జిల్లా గాలివీడు మండలం వెలిగల్లు వద్ద పాపాఘ్ని నదిపై 4.56 టీఎంసీల సామర్థ్యంతో వెలిగల్లు జలాశయాన్ని నిర్మించారు. కానీ, నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులవల్ల ఇది నిండటంలేదు. దీనివల్ల ఆయకట్టుకు నీళ్లందించలేని దుస్థితి నెలకొనడంతోపాటు చక్రాయిపేట మండలంలోని కాలేటివాగు జలాశయానికి కూడా నీరు చేరడంలేదు. అలాగే, హంద్రీ–నీవా సుజల స్రవంతి సామర్థ్యం తక్కువగా ఉండటంతో ఆ ప్రాజెక్టు రెండో దశలో భాగమైన శ్రీనివాసపురం రిజర్వాయర్, అడవిపల్లి రిజర్వాయర్లకు కూడా నీళ్లందించడం కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో.. కృష్ణా వరద జలాలను ఒడిసి పట్టి, ఆ జలాశయాలను నింపడం ద్వారా మెట్ట ప్రాంతాల్లోని 1.41 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించారు.

వెలిగల్లుకు కృష్ణా జలాలు
కృష్ణా వరద నీటిని ఒడిసి పట్టడానికి గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం సామర్థ్యాన్ని పెంచాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించారు. గాలేరు–నగరి ప్రధాన కాలువ 56 కి.మీ. పాయింట్‌ నుంచి రోజుకు 2 వేల క్యూసెక్కుల చొప్పున కాలేటివాగు జలాశయంలోకి ఎత్తిపోసి ఆయకట్టుకు నీళ్లందిస్తారు. అలాగే, కాలేటివాగు జలాశయం నుంచి రోజుకు 450 క్యూసెక్కులను ఎత్తిపోసి.. చక్రాయిపేట, రామాపురం, లక్కిరెడ్డిపల్లె మండలాల్లోని చెరువులను నింపుతారు. ఇదే జలాశయం నుంచి రోజుకు 1,550 క్యూసెక్కుల చొప్పున లిఫ్ట్‌చేసి.. హంద్రీ–నీవా ప్రధాన కాలువలోకి 473 కి.మీ. వద్ద పోస్తారు. ఈ జలాలతో వెలిగల్లు, శ్రీనివాసపురం, అడవిపల్లి జలాశయాలను నింపి ఆయకట్టుకు నీళ్లందిస్తారు. కాగా, గాలేరు–నగరి ప్రధాన కాలువ నుంచి 48 రోజుల్లో 8.164 టీఎంసీలను తరలించేలా ఈ పథకం పనులు చేపట్టడానికి అవసరమైన
సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారీ పనులను ఇప్పటికే సర్వే సంస్థకు అప్పగించారు. ఈ పథకం పనులు చేపట్టడానికి రూ.1,272 కోట్లు అవసరం అవుతాయని అంచనా.

యురేనియం సమస్యకు విరుగుడు
పులివెందుల, లింగాల మండలాల్లో వర్షాభావ పరిస్థితులవల్ల చెరువుల్లోకి నీరు చేరడంలేదు. యురేనియం పరిశ్రమవల్ల మబ్బుచింతలపల్లి, కనంపల్లి, తుమ్మలపల్లి, కొట్టాలు భూమయ్యగారిపల్లి, రాచకుంటపల్లి, వేల్పుల గ్రామాల్లో భూగర్భ జలాలు కలుషితమవడంవల్ల ఆ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి చిత్రావతి రిజర్వాయర్‌ నుంచి రోజుకు 350 క్యూసెక్కుల చొప్పున రెండు టీఎంసీలను తరలించి.. పులివెందుల, లింగాల మండలాల్లో చెరువులను నింపి, యురేనియం ప్రభావిత గ్రామాలకు జలాలను సరఫరా చేసి 25వేల ఎకరాలను సస్యశ్యామలం చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు. ఈ పథకం పనులు చేపట్టడానికి వీలుగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారీ బాధ్యతలను ఇప్పటికే సర్వే సంస్థకు అప్పగించారు. ఈ పథకం పనులు చేపట్టడానికి రూ.108 కోట్లు అవసరం అవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top