ఏపీలో మాత్రమే కేజీ రూ. 25

CM YS Jagan Comments on Onion Prices In Assembly - Sakshi

చంద్రబాబు హెరిటేజ్‌ షాపుల్లో ఉల్లి కేజీ రూ.200  

అసెంబ్లీలో ఉల్లి ధరల అంశంపై సీఎం వైఎస్‌ జగన్‌  

రాష్ట్రంలో ఉల్లి దొరకడం లేదని షోలాపూర్, ఆల్వార్‌ నుంచి కొనుగోలు  

ఇప్పటికే 36,536 క్వింటాళ్ల కొనుగోలు

రైతు బజార్లలో కేజీ రూ.25కే విక్రయం 

చంద్రబాబు హయాంలో గిట్టుబాటు ధర లభించక పొలాల్లోనే వదిలేసిన వైనం 

సాక్షి, అమరావతి: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రమే కేజీ ఉల్లి రూ.25 చొప్పున రైతు బజార్లలో ప్రజలకు అమ్ముతోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీలో ఉల్లి ధరల అంశంపై ప్రతిపక్ష టీడీపీ సభ్యులు పోడియం చుట్టుముట్టి నానా యాగీ చేస్తున్న సందర్భంలో సీఎం స్పందించి మాట్లాడారు. ఇప్పటి వరకు 36,536 క్వింటాళ్ల ఉల్లిపాయలు కొనుగోలు చేసి ప్రతి రైతు బజారులోనూ కేజీ రూ.25 చొప్పున అమ్ముతున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఉల్లిపాయలు దొరకనందున, ఎక్కడ దొరికినా కొనుగోలు చేసే కార్యక్రమం చేపట్టామన్నారు. షోలాపూర్, ఆల్వార్‌ లాంటి చోట్ల నుంచి కూడా కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఇదే చంద్రబాబు హయాంలో ఉల్లి పంట రైతులకు గిట్టుబాటు కాక, పొలాల్లోనే వదిలేసిన పరిస్థితులు చూశామని గుర్తు చేశారు. ‘ఇవాళ రైతులకూ మంచిరేటు లభిస్తోంది. మరోవైపు వినియోగదారులకు నష్టం రాకుండా ప్రభుత్వం జోక్యం చేసుకుని తక్కువ ధరకు అమ్ముతున్నాం’ అని వివరించారు. 

హెరిటేజ్‌లో కిలో రూ.200 
చంద్రబాబు హెరిటేజ్‌ షాపుల్లో కేజీ ఉల్లి రూ.200 చొప్పున అమ్ముతున్నారని సీఎం జగన్‌ విమర్శించారు. వీళ్లేమో (టీడీపీ) ఇక్కడకు వచ్చి.. పేపర్లు (ప్లకార్డు) పట్టుకుని దిగజారిపోయి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వీళ్లు చేసే పనులకు న్యాయం, ధర్మం అనేవి ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఉల్లి ధరలపై చర్చకు తాము సిద్ధమని, అదే విధంగా మహిళల భద్రత మీద కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ‘దేశంలో సంచలనాత్మక పరిస్థితులు కనిపిస్తున్నాయి. మహిళల భద్రత కోసం కొత్త చట్టాలు తీసుకొచ్చి ప్రజలకు విశ్వాసం, నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉంది. ఉన్న చట్టాలు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయనే అంశంపై కూడా చర్చ జరగాలి. మహిళలు ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు.. వాళ్లకు భద్రత ఎలా పెంచాలన్న అంశంపైనా చర్చ 
జరగాలి’ అని సీఎం అన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top