
ఢిల్లీ బయల్దేరిన ముఖ్యమంత్రి
అధిష్టానం పిలుపు మేరకు ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి ఢిల్లీ బయల్దేరారు. మంగళవారం ఉదయం ఆయన హస్తనకు పయనం అయ్యారు.
హైదరాబాద్ : అధిష్టానం పిలుపు మేరకు ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి ఢిల్లీ బయల్దేరారు. మంగళవారం ఉదయం ఆయన హస్తనకు పయనం అయ్యారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో సీమాంధ్రలో పరిస్థితులు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఢిల్లీ పెద్దలు సీఎంను హుటాహుటిన ఢిల్లీకి పిలిపించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇప్పటివరకు శాంతియుతంగా సాగుతున్న ఉద్యమంలో ఇటీవలి కాలంలో చెదురుమదురుగా అవాంఛనీయ సంఘటనలు కూడా చోటుచేసుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు, రాజకీయపరమైన తాజా పరిస్థితులపై సీఎంతో పార్టీ పెద్దలు చర్చించనున్నారని తెలుస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి ఆంటోనీ కమిటీతో భేటీ కానున్నట్లు సమాచారం. సీమాంధ్రప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు నేడు కమిటీని కలవనున్నారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ఢిల్లీలో అందుబాటులో ఉండాల్సిందిగా అధిష్టానం ఆదేశించింది.