అమ్మో.. కేజీహెచ్‌!

CM Chandrababu Naidu Avoid KGH Visit In Visakhapatnam - Sakshi

తాజాగా చంద్రబాబు సందర్శిస్తారని సమాచారం

పదవీ గండంసెంటిమెంట్‌తో వెనకడుగు

సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రుల పదవికి కేజీహెచ్‌ ఎసరు పెడుతుందా? కేజీహెచ్‌ను సందర్శించిన సీఎంలకు పదవీ గండం కలుగుతుందా? ఇది ఎంత వరకు వాస్తవమో తెలియదు గాని.. ముఖ్యమంత్రులు కేజీహెచ్‌ వైపు తొంగి చూడడం లేదు. ఏడాది రెండేళ్ల నుంచి కాదు.. దాదాపు 23 ఏళ్ల నుంచి అడుగు పెట్టడం లేదు. 1995లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కేజీహెచ్‌ను సందర్శించారు. ఇక్కడ నుంచి వెళ్లిన వెంటనే అల్లుడు చంద్రబాబునాయుడు ఆయనను వెన్నుపోటు పొడవడంతో పదవీచ్యుతుడయ్యారు. ఇక అప్పట్నుంచి ఒక్క ముఖ్యమంత్రి కూడా కేజీహెచ్‌కు వచ్చే సాహసం చేయలేకపోతున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గతంలో రెండు మూడు పర్యాయాలు కేజీహెచ్‌ను ఆకస్మిక తనిఖీలు చేయడానికి సిద్ధపడ్డారు.

ఇంతలో కేజీహెచ్‌కు వచ్చిన సీఎంలు పదవులు పోగొట్టుకున్నారని, ఎమ్మెల్యేలు వద్దని వారించారు. దీంతో ఆఖరి నిమిషంలో ఆ సందర్శనను రద్దు చేసుకున్నారు. తాజాగా శ్రీకాకుళం పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం రాత్రి విశాఖ వచ్చారు. టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి అనారోగ్యం పాలవడంతో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. అటు నుంచి వచ్చేటప్పుడు కేజీహెచ్‌ను ఆకస్మిక తనిఖీ చేస్తారంటూ ఆస్పత్రి అధికారులకు సమాచారం అందింది. దీంతో కలవరపడ్డ కేజీహెచ్‌ అధి కారులు రాత్రి విధుల్లో ఉండేæ వైద్యులను అప్రమత్తం చేశారు. అంతా విధుల్లో ఉండాలని, రోగులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని సెల్‌ఫోన్‌ మెసేజీలను పంపారు. ఇంతలో కొంతమంది ఎమ్మెల్యేలు సీఎంను కేజీహెచ్‌కు వెళ్లే సాహసం చేయవద్దని, వెళ్తే పదవీ గండం ఖాయమని చెప్పడంతో ఆయన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలిసింది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కేజీహెచ్‌కు రావడం లేదని అధికారుల నుంచి సమాచారం వచ్చిం ది. దీంతో వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top