పండగకు లైన్‌క్లియర్! | Clear festival line! | Sakshi
Sakshi News home page

పండగకు లైన్‌క్లియర్!

Jan 4 2014 1:27 AM | Updated on Sep 2 2017 2:15 AM

పండగకు లైన్‌క్లియర్!

పండగకు లైన్‌క్లియర్!

ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు పండగ రోజుల్లో అడ్డంకులను అధిగమించాలన్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి.

=‘ప్రైవేటు’ యాజమాన్యాల హుషారు
 =భారీగా పెరిగిన టికెట్ ధరలు

 
 విశాఖపట్నం, న్యూస్‌లైన్ : ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు పండగ రోజుల్లో అడ్డంకులను అధిగమించాలన్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. మహబూబ్‌నగర్ పాలెం బస్సు ప్రమాద ఘటన తర్వాత వీరికి గడ్డు కాలం మొదలైంది. కాంట్రాక్ట్ క్యారియర్ పర్మిట్‌తో స్టేజి క్యారియర్‌గా తిరుగుతున్న బస్సులు పెద్ద సంఖ్యలో తనిఖీల్లో పట్టుబడ్డాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తున్న దాదాపు 80 బస్సులను అధికారులు సీజ్ చేసి యజమానులకు దడ పుట్టించారు. కోర్టు అనుమతులతో బయటపడ్డ బస్సులు మళ్లీ రోడ్డెక్కలేదు.

రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం కావడంతో బస్సుల గ్యారేజీలకు పరిమితమై మూడు నెలలుగా ట్రావెల్స్ వ్యాపారం కుదేలైంది. పండగ రోజుల్లో వ్యాపారం జరిగితే తమ కష్టాలు తీరుతాయన్న ఆశలతో ట్రావెల్స్ యజమాన్యాలు వేచి ఉన్నాయి. ఇందుకోసం రాజధాని స్థాయిలో సంప్రదింపులు చేసి దాడులు జరగకుండా పావులు కదిపారని సమాచారం. ఆ శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ట్రావెల్స్ నిర్వాహకులు అమ్మకాలను విస్తృతం చేశారు. పోటాపోటీగా టికెట్లను అమ్మే పనిలో నిమగ్నమయ్యారు.

ఈ నేపథ్యంలో మూడు నెలలుగా రోడ్డెక్కడానికి భయపడ్డ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఇప్పుడు పుంజుకున్నాయి. క్రిస్మస్ నుంచి తనిఖీల జాడ లేకపోవడం, అధికారులు చూసీచూడనట్టు ఉండటంతో బహిరంగంగా రాకపోకలు చేస్తున్నాయి. ప్రముఖ ట్రావెల్స్ సంస్థల బస్సులు అన్ని ప్రాంతాలకు దాదాపు నడుస్తున్నాయి. ఆన్‌లైన్, ట్రావెల్స్ కార్యాలయాల్లో టికెట్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. వోల్వో బస్సులో హైదరాబాద్‌కు రూ.1,800 వరకూ, తిరుపతికి రూ.2,000, చెన్నైకు రూ.2,200, బెంగుళూరుకు రూ.2,400లు టిక్కెట్ల ధరలున్నాయి. 13,14,15,16 తేదీల్లో టికెట్‌లు అందుబాటులో ఉంచకపోవడం విశేషం. పండగ రోజుల్లో రెట్టింపు వసూళ్లకు పాల్పడేందుకు ఇందుకు సిద్ధపడినట్టు తెలుస్తోంది.
 
దాడులు తగ్గుముఖం...
 
మరోవైపు ఇప్పటికే విశాఖలో రవాణా అధికారుల దాడులు తగ్గాయి. దాడులు జరిగినా చిన్నా, చితకా ట్రావెల్స్ బస్సులపైనే ప్రతాపం ఉంటోంది. అధికారుల తనిఖీలు కేవలం అపరాధ రుసుం వసూళ్లకే పరిమితమ్మన్న విమర్శలున్నాయి. పదుల సంఖ్యలో బస్సులు నగరం నుంచి వె ళుతున్నా అధికారులు నోరు మెదపడం లేదు. పైనుంచి వచ్చిన ఆదేశాలకనుగుణంగా తనిఖీలు జరపడం, నిలిపివేయడం వంటి చర్యలతో అధికారులు విసిగిపోతున్నారని చెబుతున్నారు. కాగా శుక్రవారం షీలానగర్ వద్ద జరిపిన దాడుల్లో అధికారులు స్టేజి క్యారియర్‌గా నడుస్తున్న ఒక బస్సును సీజ్ చేశారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement