రెండు ప్రాంతాలవారికి సమన్యాయం చేయాలని, లేకుంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ....
సాక్షి, విజయవాడ : రెండు ప్రాంతాలవారికి సమన్యాయం చేయాలని, లేకుంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టాలనుకున్న దీక్ష విషయంలో నగర పోలీసుల హడావుడి విమర్శలకు దారితీస్తోంది. సోమవారం నగరంలో ప్రారంభం కావాల్సిన సమర దీక్ష వేదికను గుంటూరుకు మార్చినా పోలీసులు ఆదివారం హడావుడి సృష్టించారు. దీక్షకు ఎన్నికల కమిషన్ ఇబ్బంది లేదని చెప్పినా, నగర పోలీసులు అవనిగడ్డ ఉపఎన్నికను సాకుగా చూపి అడ్డుకున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో చట్టాన్ని గౌరవించి వేదికను గుంటూరుకు మార్చారు. దీనిపై వైఎస్సార్ సీపీ నాయకులు హైకోర్టులో పిటిషన్ వేయడంతో పాటు కలెక్టర్ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతిని కూడా కలిశారు. అవనిగడ్డలో ఉపఎన్నిక జరుగుతుంటే విజయవాడలో దీక్షను అడ్డుకోవడం అప్రజాస్వామికమని వారు స్పష్టం చేశారు. కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ దీక్ష చేసినపుడు కోడ్ ఎందుకు గుర్తుకురాలేదని ప్రశ్నించారు. కలెక్టర్ స్పందిస్తూ.. విజయవాడ పోలీసు కమిషనర్ ఒప్పుకోకపోవడంతో తానేమీ చేయలేకపోయినట్టు నిస్సహాయత వ్యక్తంచేశారని పార్టీ నాయకుడు అడుసుమిల్లి జయప్రకాష్ ‘సాక్షి’కి తెలిపారు.
కలెక్టర్‌ను కలిసిన వారిలో పార్టీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్, సెంట్రల్ సమన్వయకర్త పి.గౌతమ్‌రెడ్డి ఉన్నారు. దీక్ష ఏర్పాట్ల కోసం ముందుగా ఆర్డర్ ఇచ్చిన మెటీరియల్ ఆదివారం ఉదయం పీవీపీ మాల్‌కు చేరుకుంది. దీన్ని చూసిన మాచవరం సీఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో పెద్దఎత్తున పోలీసులను మోహరించారు. దీనిపై నిర్వాహకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇది ప్రైవేటు స్థలమని, ఏ మెటీరియల్ వస్తే మీకెందుకని నిర్వాహకులు పోలీసులను ప్రశ్నించారు. అయినా ఆదివారం రాత్రి వరకూ పోలీసులు అక్కడ పికెట్ నిర్వహించారు.