బుచ్చి సీఐ ఓవర్‌యాక్షన్‌

CI Over Action On Grievance Day in PSR Nellore - Sakshi

గ్రీవెన్స్‌డేకు వచ్చిన ఎంపీటీసీలను, అర్జీదారులను అడ్డుకున్న వైనం

నెల్లూరు , కావలి: దగదర్తి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద సోమవారం బుచ్చిరెడ్డిపాలెం సీఐ టి.వి.సుబ్బారావుయాదవ్‌ ఓవర్‌ యాక్షన్‌ చేశారు. విమానాశ్రయ భూములు, ప్రభుత్వ భూములు వేలాది ఎకరాలు ఉన్న మండలం కావడంతో అధికార టీడీపీ నాయకులు భూదందాలకు పాల్పడుతున్నారు. అధికారపార్టీకి నియోజకవర్గ స్థాయి నాయకులైన బీద మస్తాన్‌రావు, బీద రవిచంద్ర, దగదర్తి మండలస్థాయి నాయకులైన మాలేపాటి సుబ్బానాయుడు, రవీంద్రనాయుడులపై మండలంలోని బాధితులు పెద్దఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. సాక్షాత్తూ దగదర్తి మండల రెవెన్యూ అధికారులే బాధితులను టీడీపీ నాయకుల వద్దకు వెళ్లి రాజీచేసుకోవాలని చెబుతుంటారు. బీద సోదరుల వేధింపులతో విసిగి వేసారిపోయిన బాధితులు తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చి తమకు న్యాయం చేయమని అడగడమే మానుకున్నారు.

ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి దృష్టికి పలు అంశాలు రావడంతో సోమవారం దగదర్తి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద జరిగే గ్రీవెన్స్‌డేలో భూ బాధితులు తరలిరావాలని రెండు రోజుల క్రితం పిలుపునిచ్చారు. దీంతో తమకు ఎమ్మెల్యే అండగా ఉంటారనే ఆశతో బాధితులు పెద్దసంఖ్యలో సోమవారం తహసీల్దార్‌ కార్యాయానికి చేరుకున్నారు. అయితే తమ భూ భాగోతాలు ఎక్కడ బయటపడతాయోనని భావించిన బీద సోదరులు, మాలేపాటి సోదరులు బాధితులకు ఆశలు చూపి మండలంలోని కొందరిని తహసీల్దార్‌ కార్యాలయానికి చేర్చారు. అలాగే తమ సొంత మనిషి అయిన బుచ్చిరెడ్డిపాలెం సీఐ టి.వి.సుబ్బారావుయాదవ్‌తోపాటు మరో ఇద్దరు ఎస్‌ఐలను, పోలీసులను కూడా తమకు అన్నిరకాలుగా అనుకూలంగా ఉండేలా అక్కడికి వచ్చేలా ఏర్పాటు చేసుకున్నారు.

కాగా రాష్ట్ర ఇరిగేషన్‌ బోర్డు సభ్యుడి హోదాలో మాలేపాటి రవీంద్రనాయుడు గ్రీవెన్స్‌డేలో అధికారుల వద్ద కూర్చున్నారు. కార్యాలయం బయట తాము తెచ్చుకొన్న మనుషులతో మాలేపాటి సుబ్బానాయుడు హడావుడి చేయసాగాడు. ఈ క్రమంలో బుచ్చి సీఐ గ్రీవెన్స్‌డేకు ఎంపీటీసీ సభ్యులను కూడా పోనివ్వనని మొండికేశాడు. టీడీపీకి చెందిన ఎంపీపీ, రవీంద్రనాయుడులను లోపలికి పంపడంతో సీఐను ఎమ్మెల్యే ఈ విషయంపై ప్రశ్నించారు. సీఐ తాను పంపేది లేదని తెగేసి చెప్పారు. స్థానికులు ఎంపీటీసీని కూడా తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లనివ్వకపోతే ఎలా అంటూ సీఐని నిలదీశారు. అక్కడ ఉన్న పోలీసులు కూడా ఎంపీటీసీలను లోపలికి పంపాలని చెప్పడంతో సీఐ అప్పుడు అంగీకరించారు.

అర్జీదారులను అడ్డుకున్న సీఐ
అర్జీదారులను సీఐ తహసీల్దార్‌ కార్యాలయంలోకి పంపకుండా నిలిపేశారు. గ్రీవెన్స్‌డే అర్జీదారుల కోసమైతే వారిని లోపలికి పంపకపోతే ఎలా అని సీఐని ప్రశ్నించడంతో సీఐకు చిర్రెత్తుకొచ్చింది. క్యూలో నిలబడితేనే ఒక్కక్కరినే లోపలికి పంపుతానని అన్నారు. అర్జీ ఇచ్చి వెళతామని అర్జీదారులు చెప్పినా సీఐ వారిపై కస్సుమన్నాడు. ఇక చేసేది లేక ఎర్రటి ఎండలో కార్యాలయం బయట నిలబడి అర్జీదారులు ఉసూరుమంటూ తమ అర్జీలను లోపల ఉన్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డికి అందజేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా బుచ్చి సీఐ అర్జీదారులను సతాయించడం ద్వారా టీడీపీ నాయకులను సంతోషపెట్టారని çపలువురు వ్యాఖ్యానించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top