ఉసురు తీస్తున్న పసరు | Children Died For Pasaru Drug In Chittoor District | Sakshi
Sakshi News home page

ఉసురు తీస్తున్న పసరు

Dec 9 2019 8:42 AM | Updated on Dec 9 2019 8:42 AM

Children Died For Pasaru Drug In Chittoor District - Sakshi

ఆ గ్రామాల్లో నాటు వైద్యం చిన్నారులను చిదిమేస్తోంది. మారుమూల గ్రామాలు కావడం, మెరుగైన వైద్యం అందుబాటులో లేకపోవడంతో నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. ఆ మందులు వికటించి కొందరు.. సమయానికి వైద్యం అందక మరికొందరు మృత్యువాత పడుతున్నారు. ఏడాదిలో 14 మంది చిన్నారులు మత్యువాతపడ్డారు. ప్రస్తుతం మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. 

సాక్షి, తిరుపతి/కేవీబీపురం: సత్యవేడు నియోజకవర్గం కేవీబీపురం మండల పరిధిలోని పలు గ్రామాలు పట్టణాలకు దూరంగా అటవీ ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ గ్రామాలకు కోవనూరు, కేవీబీపురంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. పీహెచ్‌సీలకు వెళ్లాలంటే 8 కి.మీ దూరం ఉంది. అక్కడకు వెళ్లినా మెరుగైన వైద్యం అందే పరిస్థితి లేదు. 24 గంటల ఆస్పత్రి అయినా వైద్యులు ఉండరు. ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి. ప్రతి బుధ, శనివారాల్లో చిన్నారులు, గర్భిణులకు వ్యాక్సిన్లు వేయాల్సి ఉన్నా ఆ దాఖలాలు లేవని బస్సులు, ఆటోలు అందుబాటులో లేకపోతే బైక్‌పై తీసుకెళ్లాలి. లేదంటే గ్రామంలోనే ప్రాణాలు విడవాల్సిన పరిస్థితి.

జయలక్ష్మి కాలనీకి చెందిన దంపతులకు నాలుగేళ్ల తర్వాత కలిగిన మగబిడ్డకు జబ్బు చేసింది. పెద్దలు చెప్పారని నాటు మందులు వాడారు. బిడ్డకు ఊపిరితిత్తుల సమస్య ఏర్పడింది. పాలు పట్టిస్తే నేరుగా ఊపిరితిత్తులకు చేరి వాపు రావడంతో భయంతో వారం రోజుల పాటు ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. డబ్బులు ఖర్చు చేసినా ప్రయోజనం లేకపోయింది. కొన్ని రోజులకు బిడ్డ చనిపోయాడు. బైరాజుకండ్రిగకు చెందిన రెండేళ్ల వయస్సు ఉన్న పాపకు ఎక్కిళ్లు ఎక్కువ కావడంతో గ్రామంలోని పెద్దావిడ మాటలు విని ఆకు పసరు మందు తాగించారు. తీవ్రమైన దగ్గు, ఆయాశంతో పాటు నోటి నుంచి రక్తం కారడం మెదలైంది. చాలా ఆస్పత్రులు తిరిగారు. ఊపిరితిత్తులు పూర్తిగా పాడవడంతో ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. 

కామెర్లని నుదురు, చేతిపై కాల్చారు 
దిగువపుత్తూరుకు చెందిన సుప్రియకు చెందిన ఏడాదిన్నర బిడ్డ ఏసుకు కామెర్ల వ్యాధి సోకింది. స్థానిక ఆచారాలు, పెద్దలు చెప్పిన మాట విని ఆ తల్లి నాటు వైద్యుడి చేత చిన్నారి నుదురు, చేతిపై ఇనుప కమ్మిని ఎర్రగా కాల్చి పెట్టించింది. అనంతరం ఆకు పసరు ఇచ్చారు. తొమ్మిది రోజుల తర్వాత ఏసు మరణించింది.  

సరైన సమయంలో వైద్యం అందక 
కేవీబీపురం మండలం ఎస్‌ఎల్‌పురం గ్రామానికి చెందిన శ్యామల బిడ్డకు ఎనిమిది నెలల వయస్సులో జ్వరం వచ్చింది. నాటు మందులు వాడాల్సి వచ్చింది. నాలుగు రోజుల తర్వాత కడుపు బాగా ఉబ్బిపోయింది. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సమయానికి వైద్యం అందకపోవడంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ చెయ్యి జారిపోయాడు. స్థానికులు చెబుతున్నారు. మెరుగైన వైద్యం కోసం పట్టణాలకు వెళ్లాలంటే 30 కి.మీ దూరంలోని శ్రీకాళహస్తి, 48 కి.మీ దూరంలో ఉన్న తిరుపతికి పరుగులు తీయాల్సి వస్తోంది.

చికిత్స పొందుతున్న చిన్నారులు
పెరిందేశం గ్రామానికి చెందిన ఇంకా పేరు పెట్టని 53 రోజుల చిన్నారి, లిఖిత (7నెలలు) తిరుపతి రుయాలో చికిత్స పొందుతున్నారు. ఇందులో లిఖిత పరిస్థితి విషమంగా ఉంది. కొప్పేడుకు చెందిన 18 నెలల మోక్షిత, బంగారమ్మకండ్రిగకు చెందిన రెండున్నరేళ్ల వరలక్షి్మ, సరస్వతీకండ్రిగకు చెందిన రోహిణి (17 నెలలు) పుత్తూరు చిన్నపిల్లల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తాను 
సమస్య నా దృష్టికి రాలేదు. సంబంధిత పీహెచ్‌సీ పరిధి నుంచి డేటా తీసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాను. సచివాలయాల ద్వారా ఈ వారంలోపు 372 మంది ఏఎన్‌ఎంల నియామకాలు జరుగుతాయి. సోమవారం నుంచి వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నాం.  – పెంచలయ్య, డీఎంహెచ్‌ఓ  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement