నాపై బురద జల్లుతున్నారు | Chandrababu Comments On Power Purchase Agreement | Sakshi
Sakshi News home page

నాపై బురద జల్లుతున్నారు

Jul 20 2019 4:28 AM | Updated on Jul 20 2019 4:30 AM

Chandrababu Comments On Power Purchase Agreement - Sakshi

సాక్షి, అమరావతి: విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)పై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు సమాచారమిస్తోందని ప్రతిపక్ష నేత చంద్రబాబు శుక్రవారం అసెంబ్లీలో ఆరోపించారు. తాము కుదిర్చిన పీపీఏలపైన రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఇచ్చిన సమాచారం ఆధారంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో సమాధానం ఇస్తున్నారని వాపోయారు. ఇంధన వనరుల బడ్జెట్‌ పద్దులపై చర్చ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సంప్రదాయేతర ఇంధన వనరులు– పవన, సౌర విద్యుత్‌ తదితరాలతో రాష్ట్రంలో భవిష్యత్‌లో కరెంటు చార్జీలు పెంచకుండా చూడాలన్న ఉద్దేశంతో ప్రాథమిక దశలో ఖర్చు ఎక్కువైనా పలు ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. ‘‘కర్ణాటకలో సండూర్‌ పవర్‌ పెట్టి ఎక్కువ ధరకు విద్యుత్తు అమ్ముతున్న జగన్‌ ఇక్కడ ముఖ్యమంత్రి అయినందున జరిగిపోయిన వాటిపై చర్యలు తీసుకోవాలని చూస్తున్నారు. బురదచల్లే కార్యక్రమం చేపడితే ఆ బురదలో మీరే మునిగిపోతారు. మీరు ఒక వ్యక్తిని, కొందరిని టార్గెట్‌గా చేసుకుంటున్నారు. పీపీఏలను తోడవద్దని కేంద్ర ప్రభుత్వం లేఖ కూడా రాసింది. మీ సర్కారు తీరు చూసి రాజధానికి ప్రపంచబ్యాంకు రుణాన్ని కూడా రద్దు చేసింది. మీ పనివల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటోంది’’ అంటూ ధ్వజమెత్తారు.

మీరెందుకు తయారు కాలేదు?: డిప్యూటీ స్పీకర్‌ ప్రశ్న
అంతకుముందు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అమ్మేసే తరహాలో గత సీఎం చంద్రబాబు అడ్డగోలుగా పీపీఏలు కుదుర్చుకున్నారని, దానిపై అసెంబ్లీలో చర్చలో పాల్గొనడానికి బదులు బయట ప్రెస్‌కాన్ఫరెన్స్‌లు పెట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు మాట్లాడేందుకు అవకాశమివ్వాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ దశలో సభలోకొచ్చిన చంద్రబాబు.. ‘‘అధ్యక్షా, వాళ్లు(అధికార పక్షం) బాగా తయారయి చర్చకు వచ్చారు. నాకు సమయం కావాలి’ అని కోరారు. సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి.. ‘ఇంధన పద్దులపై చర్చ జరుగుతుందని మీకూ తెలుసుకదా, మీరెందుకు తయారు కాలేదు’ అనడంతో చంద్రబాబు నాలుక్కరుచుకుని చర్చకు ఉపక్రమించారు.

పీపీఏలపై జగన్‌ అస్పష్టత: చంద్రబాబు
కాగా చంద్రబాబు శుక్రవారం అసెంబ్లీలోని తన చాంబర్‌లో మీడియాతో ముచ్చటిస్తూ.. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలపై ముఖ్యమంత్రి అస్పష్టంగా ఉన్నారని, సభలో తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లు మాట్లాడుతున్నారని, సమాధానం చెప్పలేక వెళ్లిపోతున్నారంటూ వ్యాఖ్యానించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement