తుళ్లూరులో ఇల్లు కట్టుకుంటా: చంద్రబాబు | Sakshi
Sakshi News home page

తుళ్లూరులో ఇల్లు కట్టుకుంటా: చంద్రబాబు

Published Tue, Nov 18 2014 9:28 PM

తుళ్లూరులో ఇల్లు కట్టుకుంటా: చంద్రబాబు - Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని భూ సేకరణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రైతులతో సమావేశమయ్యారు. హైదరాబాద్లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో మంగళవారం రాత్రి ఈ భేటీ జరిగింది. తుళ్లూరులో ఇల్లు కట్టుకుంటానని, రాజధాని నిర్మాణం పూర్తయ్యేవరకు అక్కడే ఉంటానని చంద్రబాబు చెప్పారు. రైతులందిరికీ న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. భూమి ఇచ్చిన రైతులకు ఉద్యోగం, మంచి ప్యాకేజీ ఇస్తామని చంద్రబాబు చెప్పారు.


రాజధానిని సింగపూర్లా అభివృద్ధి చేస్తానని, రైతులతో వ్యాపారాలు చేయిస్తానని బాబు చెప్పారు. రాజధాని వస్తే రైతులెవరూ కూలీ పనులు చేసుకోవాల్సిన అవసరం ఉండదని, ఏసీల్లో ఉండొచ్చని బాబు అన్నారు. రైతులకు ఆసక్తి ఉంటే సింగపూర్ తీసుకెళ్తానని చెప్పారు. కాగా కృష్ణా ఒడ్డున భూములు సేకరించవద్దని రైతులు విన్నవించగా,  వాస్తు ప్రకారం రాజధాని అక్కడే ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. రైతులు తమకు మరింత మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని, భూముల సారాన్ని బట్టి ప్యాకేజి ఇవ్వాలని బాబును కోరారు. సమావేశానంతరం మంత్రి రావెల కిశోర్ బాబు విలేకరులో మాట్లాడారు. భూములు ఇచ్చేందుకు రైతులందరూ సంతోషంగా అంగీకరించారని మంత్రి చెప్పారు. కాగా సమావేవంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయినట్టు సమాచారం.

Advertisement
Advertisement