బరితెగిస్తున్న చైన్ స్నాచర్లు | Sakshi
Sakshi News home page

బరితెగిస్తున్న చైన్ స్నాచర్లు

Published Wed, Sep 30 2015 2:52 AM

బరితెగిస్తున్న చైన్ స్నాచర్లు - Sakshi

పోలీసులమంటూ నమ్మబలికి
గొలుసు లాక్కునే యత్నం
మహిళ, స్థానికులు ప్రతిఘటించడంతో పరారైన యువకులు

 
 బద్వేలు అర్బన్ : బద్వేలులో చైన్ స్నాచర్లు బరితెగిస్తున్నారు. స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్ ఎదుటే పోలీసులమని చెప్పి ఓ మహిళ మెడలో గొలుసులాక్కునేందుకు ప్రయత్నించారు. మహిళతో పాటు చుట్టుపక్కలవారు ప్రతిఘటించడంతో బైక్‌పై యువకులు పరారయ్యారు. మంగళవారం చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి వివరాలలోకెళితే.. స్థానిక గాండ్లవీధిలో నివసిస్తున్న ఓ మహిళ పోరుమామిళ్ల రోడ్డులోని తమ వస్త్రదుకాణానికి వెళ్లి ఇంటికి వెళ్తున్న సమయంలో అర్బన్ స్టేషన్ ఎదుట ఇద్దరు యువకులు మహిళను ఆపి తాము పోలీసులమని, చెన్నైనుంచి బద్వేలుకు దొంగలు వచ్చారని మీ వద్ద ఉన్న బంగారు నగలు దాచుకోవాలని చెప్పారు.

అలాగే నగలతో బయట తిరిగితే రూ.1000లు జరిమానా చెల్లించాలని హెచ్చరించారు. ఇదంతా నమ్మే రీతిలో లేకపోవడంతో సదరు మహిళ యువకులను ప్రశ్నించడంతో గుర్తింపుకార్డు కూడా చూపించినట్లు తెలిసింది. దీంతో మహిళ చేసేది లేక చేతికి ఉన్న గాజులను కర్చీప్‌లో కట్టుకునేందుకు బయటకు తీస్తున్న సమయంలో పక్కనే ఉన్న మరో యువకుడు మహిళ మెడలోని తాళిబొట్టు సరుడును లాక్కునేందుకు ప్రయత్నించాడు.

మహిళ పూర్తిస్థాయిలో ప్రతిఘటించి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు కూడా పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ యువకులు బంగారు గొలుసును వదిలేసి అక్కడినుంచి ద్విచక్రవాహనంలో ఉడాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు పట్టణంలో గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది.

Advertisement
Advertisement