
కొలువు మండపం కూల్చివేతకు శ్రీకారం
తిరుమల శ్రీవారి ఆలయానికి ఆగ్నేయ దిశలో ఉన్న పురాతన కొలువు మండపం కూల్చివేసే పనులు బుధవారం ప్రారంభించారు.
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయానికి ఆగ్నేయ దిశలో ఉన్న పురాతన కొలువు మండపం కూల్చివేసే పనులు బుధవారం ప్రారంభించారు. ఈ మండపానికి వంద మీటర్ల దూరంలో కొత్తగా ఇదే మండపాన్ని పునర్నిర్మించే పనులు యథావిధిగా సాగుతున్నాయి. ఆలయం వద్ద ఉన్న కొలువు మండపంలో రోజూ శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి కొన్ని దశాబ్దాలుగా సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహిస్తున్నారు. 2003లో మాస్టర్‌ప్లాన్ కింద వేయికాళ్ల మండపంతోపాటు
దీనిని తొలగించాలని నిర్ణయించినా అప్పట్లో వీలు కాలేదు. దక్షిణమాడ వీధి విస్తరణలో భాగంగా దీనిని తప్పకుండా తొలగించాలని ఇటీవల టీటీడీ అధికారులు భావిం చారు. ఆమేరకు మండపంలోని వస్తువులు, పరికరాలను ఇప్పటికే తొలగించారు. మండపం కూల్చివేత పనులు బుధవారం పూర్తిస్థాయిలో చేపట్టారు. ఇక్కడ ప్రతిరోజూ సాయంత్రం వేళలో నిర్వహించే సహస్రదీపాలంకరణ సేవను వాహన మండపం పక్కనున్న వైభవోత్సవ మండపంలోకి మార్పు చేశారు.