ఆదుకుంటేనే...ఆడుకుంటాను

Boy Suffering With Cancer In Darshi Prakasam - Sakshi

 క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న బాలుడు

రూ.3 లక్షలుంటే చికిత్స

దాతల సాయం కోసం ఎదురు చూపులు

ప్రకాశం ,దర్శి: బడి ఈడు పిల్లలతో ఆడుకునే బాలుడు ఆటలకు దూరమయ్యాడు.. ఆనందంగా గంతులేస్తూ ఆడుకునే తోటి స్నేహితులను చూసి తానెప్పుడు అలా ఆడుకోగలనా లేదా అని ఎదురు చూస్తున్నాడు.  తనకు వచ్చిన కాన్సర్‌ బారి నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి  ఎవరైనా దాతలు సహకారం అందిస్తారనే ఆశతో వేయికళ్లతో ఎదురు చూస్తున్నాడు. దర్శి పంచాయతీ పరిధిలోని శివరాజనగర్‌ గ్రామానికి చెందిన షేక్‌ జిలానీ కుమారుడు వాహిద్‌ అనే ఏడేళ్ల వయస్సున్న బాలునికి బ్లడ్‌క్యాన్సర్‌ వచ్చింది.

ఒక సంవత్సరం క్రితం బాలుడు తరచూ జ్వరంతో బాధపడటం, ఆస్పత్రిలో చూపించగానే తగ్గి మళ్లీ వస్తోంది. గుంటూరు ఆస్పత్రిలో చూపించగా ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోతున్నాయని హైదరాబాద్‌ తీసుకెళ్లాలని సూచించారు. అక్కడ టెస్ట్‌లలో బాలునికి బ్లడ్‌ క్యాన్సర్‌ అని నిర్ధారించారు. వారి ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న  వైద్యులు  చెన్నైలోని అడయార్‌ ఆసుపత్రిలో చూపించుకోవాలని సలహా ఇచ్చారు. దీంతో ఆరునెలలు అక్కడే ఉండి ఓ చికెన్‌ షాపులో పనిచేస్తూ బాలుడికి ట్రీట్‌మెంట్‌ ఇప్పించారు. ఎనిమిది నెలల క్రితం వరకు వాహిద్‌ అడయార్‌ ఆసుపత్రిలో చికిత్స పొందాడు.  ఇంటికి తీసుకొచ్చిన తరువాత కూడా వారు చెప్పిన సమయంలో  చెన్నై తీసుకువెళ్లి టెస్టులు చేయించి తీసుకు వస్తున్నారు. అయితే మళ్లీ ఆరోగ్యం క్షీణించింది. బాలుడు నీరసించాడు. మళ్లీ అడయార్‌ ఆస్పత్రిలో  చూపించగా బ్లడ్‌ క్యాన్సర్‌ మళ్లీ తిరగబెట్టిందని.. వెంటనే ట్రీట్‌మెంట్‌ మొదలు పెట్టాలని రూ.25 లక్షలు ఖర్చవుతుందని  చెప్పారు. దీంతో బాలుని తండ్రి జిలానీ గుండె జారినంత పనైంది.

తన పరిస్థితి ఆసుపత్రిలో చెప్పగా  ఆసుపత్రి తరఫున  రూ.15 లక్షలు మంజూరు చేశారు. ఏపీ ప్రభుత్వం ద్వారా మరో రూ.10 లక్షలు మంజూరు చేయించుకుని వస్తే ట్రీట్‌మెంట్‌ చేస్తామని అన్నారు. జిలానీ సచివాలయం చుట్టూ రెండు నెలలు తిరిగి రెండు దఫాలుగా రూ.8 లక్షలు మంజూరు చేయించుకున్నాడు. ఆస్పత్రికి కట్టాల్సిన మరో రూ.2 లక్షలు, అక్కడ అయ్యే ఇతర ఖర్చులు మరో లక్ష రూపాయలు సహృదయం కలిగిన దాతలు సాయం చేస్తారని ఎదురు చూస్తున్నాడు. ఈనెల 14వ తేదీన బాలుడుని ఆసుపత్రికి తీసుకు రావాలని వైద్యులు సూచించారు. అప్పటిలోగా బాలుని వైద్యఖర్చులకు డబ్బులు ఎలా తేవాలని తలమునకలవుతున్నాడు. జిలానీకి ఇల్లు లేదు, పొలం లేదు..పని చేసుకుంటే తినాలి..లేకుంటే పస్తులుండాలి. ప్రస్తుతం రాజంపల్లిలో చికెన్‌ షాపులో పని చేస్తూ అద్దె ఇంట్లో ఉంటూ కుటుంబం పోషిస్తూ జీవనం సాగిస్తున్నాడు. తాను సంపాదించి వైద్యం చేయించే పరిస్థితి లేదు. దాతలు వచ్చి సాయం చేస్తే తన కుమారుడుని బతికించుకుంటానని వేడుకుంటున్నారు. సాయం చేయవలసిన దాతలు ఎస్‌బీఐ దర్శి శాఖ ఖాతా నంబర్‌:34224821839కు నగదు జమ చేయవచ్చు. పూర్తి వివరాలకు బాలుని తండ్రి జిలానీ సెల్‌ నంబర్‌ 8465043500 నంబరును సంప్రదించవచ్చు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top