ఆ 48 గంటలు..

ఆ 48 గంటలు.. - Sakshi


'బాబాయ్.... డాడీ... మమ్మీ...చెల్లి ఎక్కడ.... ఇంకా నాన్న లేవలేదా... ఇక్కడ ఎందుకు ఇంతమంది ఉన్నారు. నాకు మమ్మీ....డాడీ...చెల్లిని చూపించండి...' అంటూ శ్రీనివాస్ కుమారుడు అజయ్ రామ్ అనటంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు కంటతడి పెట్టారు. బాలుడి ఆవేదన చూసి దుఃఖం ఆపుకోలేకపోయారు. ప్రమాదంలో గాయపడి మంచిర్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అజయ్ రామ్ ను తండ్రికి దహన సంస్కారాలు చేసేందుకు రొంపికుంట తీసుకు వచ్చారు. శ్రీనివాస్ తండ్రి రాజేశం మనవడు అజయ్ రామ్ చేత తలకొరివి పెట్టించాడు.


సాక్షి, మంచిర్యాల/మందమర్రి: అది మందమర్రి-శ్రీరాంపూర్ రహదారి. మందమర్రి దాటిన తర్వాత మధ్యలో పాలవాగు బ్రిడ్జి. దానికి 15 అడుగుల కింద రెండు మృతదేహాలు.. వాటిపక్కనే రెండు జీవచ్ఛవాలు. అలా ఒకటికాదు, రెండుకాదు.. 48గంటలు. బ్రిడ్జి పైనుంచే నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. కానీ బ్రిడ్జి కిందనున్న శవాలను.. జీవచ్ఛవాలను ఎవరూ గమనించలేదు. రక్తగాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లి.. మెలకు వ వచ్చినప్పుడల్లా క్షతగాత్రులు చేసిన ఆర్తనాదాలు ఎవరికీ వినిపించలేదు. తమవారికి ప్రమాదం జరిగిందని తెలిసినా బంధువులు, పోలీసులు రెండు రోజులకు గానీ సంఘటన స్థలాన్ని గుర్తించలేదు. చివరకు వారివద్ద ఉన్న సెల్‌ఫోనే వారి ఆచూకీని చూపెట్టింది.

 

 కమాన్‌పూర్ మండలం రొంపికుంట గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ కుందారపు శ్రీనివాస్, భార్య శ్రీలత, కుమారుడు అజయ్‌రామ్, కుమార్తె దీక్షిత గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఆదిలాబాద్ జిల్లా మందమర్రి బంధువుల ఇంట్లో జరిగిన దశదినకర్మకు వెళ్లారు. తోడళ్లుళ్లు, అక్కా చెల్లెళ్లు, అమ్మమ్మ, పిన్నిలతో శ్రీనివాస్ కుటుంబసభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటలకు బెల్లంపల్లిని సెకండ్‌జోన్‌లో ఉన్న తమ బంధువుల ఇంటికి వెళ్లారు. రాత్రి 7గంటలకు ద్విచక్ర వాహనంపై రొపింకుంటకు బయల్దేరారు.

 

 అప్పటికే రాత్రయింది! ‘గింత చీకటైంది. పొద్దున్నె వెళ్లండి బిడ్డా..’ అని బెల్లంపల్లిలోనే ఉండే శ్రీలత తల్లి లక్ష్మి అన్నది. మనమరాలు దీక్షిత అమ్మమ్మ చేయి పట్టుకుని వదల్లేదు. ‘వచ్చింది కర్మకు కాబట్టి ఉండద్దనే ఉద్దేశంతో వెళ్లింది నాబిడ్డా. చీకట్లో జాగ్రత్తగా పొమ్మని చెప్పాను. అయినా పండుగ దగ్గర్లోనే ఉంది. రాత్రి 8.30 వరకు చేరుకుంటుం. ఎప్పుడు పోతలేమానె. చేరుకున్న తర్వాత ఫోన్ చేస్తా’ అని చెప్పి శ్రీలత, శ్రీనివాస్ పిల్లలు ద్విచక్ర వాహనంపై బయలు దేరారు’ అని రోదించుకుంటూ చెప్పింది లక్ష్మి.

 

 ఇంతలోనే ఘోరం..

 శ్రీనివాస్ కుటుంబసభ్యులు మందమర్రి దాటి పాలవాగు వద్దకు చేరుకోగానే కల్వర్టు వద్ద పాము అడ్డుగా వచ్చింది. శ్రీనివాస్ బైక్ నడుపుతుండగా ముందు దీక్షిత కూర్చుంది. డాడీ పాము అనగానే శ్రీనివాస్ భయంతో కంగారుపడ్డాడు. ఇంతలోనే బైక్ కల్వర్టుకు ఢీకొని లోయలో పడింది. కిందనున్న పదునైన బండలపై పడడంతో శ్రీనివాస్, దీక్షిత తలలకు తీవ్ర తీవ్రగాయాలయ్యాయి. పడడంతోనే శ్రీనివాస్ చనిపోగా, దీక్షితకు బలమైన దెబ్బలు తాకడంతో మంచినీళ్లు.. మంచినీళ్లు అని అరిచింది. రెండు గంటల తర్వాత మృతిచెందింది. అభిరామ్ పడడంతోనే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతని కాలు విరిగింది. వెనుక కూర్చున్న శ్రీలతకు నడుంపై దెబ్బలు తాకాయి. కదల్లేని పరిస్థితి. చుట్టూ చీకటి ఉండడంతో ఎవరూ కనిపించలేదు. ఆమె అరుపులు ఎవరూ వినలేదు. ఆమె కూడా అపస్మారక స్థితిలోకి వెళ్లింది. రాత్రి 11 గంటల వరకు అజయ్‌రామ్‌కు మెలుకువ వచ్చింది.  

 

 వినిపించని ఆర్తనాదాలు..

 చుట్టూ కటిక చీకటి.. చెట్లు.. చిమ్మట పురుగుల గోల.. ముళ్ల కంపలు.. రాళ్లు రప్పలపై రక్తపు మడుగులో తండ్రి, చెల్లెలు మృతదేహాలు.. మరోవైపు అపస్మారక స్థితిలోకి వెళ్లిన తల్లి. భయానకం కొలిపే దృశ్యాలు. ఎటూ చూసినా కటిక చీకటి. పామును చూసిన భయంతో ఎటునుంచి వస్తుందోనని బాలుడి భయం.. కాపాడండని కేకలు వేశాడు. ఇంతలోనే మళ్లీ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గురువారం రాత్రి గడిచింది. శుక్రవారం వేల వాహనాలు ఆ కల్వర్టు పై నుంచి వెళ్లాయి. ఎవరూ గమనించలేదు. ఆ రోజు కూడా గడిచింది.

 

 ఇలా 48 గంటలు తల్లీ, కొడుకు జీవచ్ఛవాల్లా ఉన్నారు. శనివారం ఉదయం సృ్పహకోల్పోయిన శ్రీలతకు మెలుకువ వచ్చింది. కదులుదామంటే కదలలేని స్థితి. తన వద్ద ఉన్న సెల్‌ఫోన్ తీసి చూసే సరికి వందల కొద్ది మిస్‌డ్ కాల్స్ ఉన్నాయి. వెంటనే కుటుంబసభ్యులకు తెలియజేయాలని తాపత్రయ పడింది. కమాన్‌పూర్‌లోని తన బంధువులకు ఫోన్ చేసి తమకు ప్రమాదం జరిగిందని.. గోదావరిఖనిలోని రాజేశ్ టాకీస్ దగ్గర అని.. సృ్పహ కోల్పోయింది.

 

 వెతికి వెతికి వేసారి..

 కమాన్‌పూర్, మందమర్రిలోని కుటుంబసభ్యులు ఉదయం నుంచి రహదారి వెంట వెతికారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, కుటుంబసభ్యులు వెతికినా ప్రయోజనం లేదు. ఇరువురు ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఫోన్ రింగవుతుంది కాని ఎవరూ మాట్లాడలేని పరిస్థితి. ఈ రింగ్ కల్వర్టు పైనుంచి పోయే వారికి వినిపించని పరిస్థితి. అంతలోనే మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో మేలుకొవ వచ్చిన అభిరామ్ ఫోన్ శ బ్దం విని మాట్లాడాడు.

 

 ‘పిన్ని దాహం అవుతుంది.. ఆకలవుతుంది..’ అంటూ ఏడ్చారు. అదే సమయంలో పోలీసులు సిగ్నల్ ఆధారంగా వారున్న ప్రాంతాన్ని గుర్తించారు. వెంటనే బాధిత కుటుంబసభ్యులతో కలిసి మందమర్రి-శ్రీరాంపూర్ మధ్యలో ఉన్న కల్వర్టుల వద్ద గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు కల్వర్టు కింద శనివారం రాత్రి 10 గంటలకు వారిని గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉన్న అభిరామ్‌ను, శ్రీలతను మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top