సిద్దిపేట సమీపంలోని రాజీవ్ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వరంగల్ జిల్లా చేర్యాల మండలం చిట్యాల గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్‌ల భర్తలు దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి
సిద్దిపేట అర్బన్, న్యూస్‌లైన్: సిద్దిపేట సమీపంలోని రాజీవ్ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వరంగల్ జిల్లా చేర్యాల మండలం చిట్యాల గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్‌ల భర్తలు దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చిట్యాల గ్రామ సర్పంచ్ సుజాత భర్త మల్లేశం(40), ఆ గ్రామ మాజీ సర్పంచ్ మంగోల్ విజయలక్ష్మి భర్త చిన్న వెంకటయ్యగౌడ్(45)లు ఆదివారం సాయంత్రం ఓ పనిపై సిద్దిపేటకు వచ్చారు. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో హోండా యాక్టివా(ఏపీ28 ఎహెచ్7720 )పై తిరిగి చిట్యాలకు వెళుతున్నారు. ఈక్రమంలో పొన్నాల డాబాల సమీపంలో వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనుక నుంచి వస్తున్న భారీ కంటైనర్ లారీ(హెచ్‌ఆర్ 74-7716) వేగంగా వచ్చి ఢీకొంది.
ఈ సంఘటనలో ద్విచక్రవాహనం ధ్వంసమైంది. వాహనంపై ప్రయాణిస్తున్న మల్లేశం, వెంకటయ్యగౌడ్ తలలు పగిలి తీవ్రంగాయాలు కావడంతో అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. సమాచారం అందుకున్న సిద్దిపేట రూరల్ సీఐ ప్రసన్నకుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. సంఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇప్పుడే వస్తానంటివి...
వెంకటయ్యగౌడ్ కొడుకు రోదన
సంఘటన స్థలంలో మరణించిన వెంకటయ్యగౌడ్ మృతదేహం పక్కన పడి ఉన్న అతని సెల్‌ఫోన్‌ను సేకరించిన పోలీసులు కొన్ని నిమిషాల ముందు డయల్ చేసిన నంబర్‌కు తిరిగి ఫోన్ చేయగా వెంకటయ్యగౌడ్ కుమారుడు ఫోన్‌లో మాట్లాడాడు. పోలీసులు అతనికి సమాచారం అందించడంతో హుటాహుటిన అతను సంఘటనా ప్రదేశానికి చేరుకున్నాడు. తండ్రి మృతదేహంపై పడి గుండె పగిలేలా ఏడ్చాడు. ఇప్పుడే వస్తనంటివి...ఇట్లయిపోయిందని అతను ఆక్రోశించిన తీరు చూసి అక్కడున్న వారు కూడా కన్నీరుమున్నీరయ్యారు.