మన్యంలో మంచి వైద్యం | Better healing in manyam | Sakshi
Sakshi News home page

మన్యంలో మంచి వైద్యం

Jun 14 2015 1:33 AM | Updated on Aug 20 2018 8:20 PM

అటవీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన, గిరిజనేతర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో వైద్య, ఆరోగ్య శాఖ పని చేస్తోందని కేఆర్ పురంలోని ఐటీడీఏ డెప్యూటీ డీఎంహెచ్‌వో వంశీలాల్ రాథోడ్ చెప్పారు.

అటవీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన, గిరిజనేతర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో వైద్య, ఆరోగ్య శాఖ పని చేస్తోందని కేఆర్ పురంలోని ఐటీడీఏ డెప్యూటీ డీఎంహెచ్‌వో వంశీలాల్ రాథోడ్ చెప్పారు. గిరిజన మండలాలైన బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం, వేలేరుపాడు, కుకునూరు ప్రాంతాల్లోని ప్రజలకు ఎప్పటికప్పుడు ఆరోగ్య సూచనలు అందజేస్తూ.. అవసరమైన వారికి తక్షణ వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. బుట్టాయగూడెం పీహెచ్‌సీలో అందుతున్న వైద్య సేవలు, రోగుల ఇబ్బందులు, వైద్య సిబ్బంది పనితీరు, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ఆయన ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారారు. వంశీలాల్ రాథోడ్ రిపోర్టింగ్ ఇలా సాగింది.
 
 
 
 రాథోడ్ : ఏమ్మా..  మీది ఏ ఊరు. ఏ సమస్యతో పీహెచ్‌సీకి వచ్చారు.
 ఎస్.దుర్గమ్మ : మాది బుట్టాయగూడెం సార్. ఒకటే ఒళ్లు నొప్పులు.
 రాథోడ్ : డాక్టర్ గార్కి చూపించుకున్నారా. వైద్యం ఎలా చేశారు.
 ఎస్.దుర్గమ్మ : బాగానే చూశారు. ఇంజెక్షన్ చేసి మాత్రలు ఇచ్చారు.
 రాథోడ్ : ఏమ్మా.. పీహెచ్‌సీలో వైద్య సేవలు ఎలా అందుతున్నాయి
 పూరి సత్యవతి (బాలింత) : డాక్టరమ్మలు వైద్యం బాగానే చేస్తున్నారయ్యా.
 రాథోడ్ : నీకు రావమ్మా.. మహాలక్ష్మి పథకం గురించి తెలుసా!
 పూరి సత్యవతి : తెలుసండి. నరుసమ్మ చెప్పింది.
 రాథోడ్ : ఏం చంద్రరావ్.. ఆసుపత్రికి మళ్లీ వచ్చావేంటి.
 చంద్రరావు : దగ్గు తగ్గలేదు సార్.
 రాథోడ్ : డాక్టర్ గారూ.. రోగుల విషయంలో సిబ్బంది
 ఎలా ఉంటున్నారు.
 
 పి. మోజెస్, డాక్టర్ : మాతోపాటు సిబ్బంది కూడా బాగా పనిచేస్తున్నారు సార్. రోగులు వస్తే వెంటనే స్పందించి వారికున్న వ్యాధిని తెలుసుకుని తక్షణ వైద్య సేవలు అందిస్తున్నాం సార్.
 రాథోడ్ : సుధా మేడమ్.. వైద్యం అనంతరం రోగులకు సూచనలు ఏమైనా ఇస్తున్నారా.
 పి.సుధ, డాక్టర్ : ఇస్తున్నాం సార్. వ్యాధి తీవ్రతను బట్టి వైద్య సేవలు అందిస్తున్నాం. పాటించాల్సిన జాగ్రత్తల్ని వివరిస్తున్నాం. జ్వరాలు, ఇత వ్యాధులు ప్రబలకుండా పాటించాల్సిన ముందస్తు జాగ్రత్తలపై సూచనలు ఇస్తున్నాం.
 
 రాథోడ్ : పని ఒత్తిడి ఎలా ఉంది.
 పి.కిరణ్, డాక్టర్ : పని ఒత్తిడి అధికంగా ఉంది సార్. స్టాఫ్‌ను నియమిస్తే బాగుంటుంది.
 రాథోడ్ : ఓకే. సిబ్బంది కొరత విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పీహెచ్‌సీలలో భర్తీ చేయాల్సిన పోస్టులకు సంబంధించి ప్రతిపాదనలు పంపించాం.
 

Advertisement
 
Advertisement
Advertisement