వేలానికి సుజనా చౌదరి ఆస్తులు

 Bank of India Auctions Sujana Chowdary's  properties  - Sakshi

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు రూ.322.03 కోట్ల రుణం ఎగవేత 

వడ్డీతో కలిపి రూ.400.84 కోట్లకు చేరుకోవడంతో వేలానికి నోటీసు 

మార్చి 23న ఈ–ఆక్షన్‌ విధానంలో ఆస్తుల వేలం 

రూ.837.37 కోట్ల రుణం ఎగవేత కేసు

సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సన్నిహితుడు, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఆస్తుల వేలానికి బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సిద్ధమైంది. ఆ బ్యాంక్‌ నుంచి 2018 అక్టోబర్‌ 26వతేదీన రూ.322.03 కోట్లను 13.95 శాతం వడ్డీపై తీసుకున్న యలమంచిలి సత్యనారాయణ చౌదరి అలియాస్‌ సుజనా చౌదరి సంస్థ సుజనా యూనివర్సల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ రుణాన్ని తిరిగి చెల్లించకుండా మొండికేస్తోంది. అసలు, వడ్డీ కలిపి ఈ ఏడాది ఫిబ్రవరి 20 నాటికి రుణం రూ.400.84 కోట్లకు చేరింది. తిరిగి చెల్లించాలని ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా సుజనా చౌదరి స్పందించకపోవడంతో తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేసేందుకు బ్యాంకు గురువారం నోటీసు జారీ చేసింది. ఆన్‌లైన్‌లో బిడ్‌ల దాఖలుకు తుది గడువు మార్చి 21గా పేర్కొంది. ఈ–ఆక్షన్‌ విధానంలో ఆస్తులను మార్చి 23న 11.30 నుంచి 12.30 గంటల మధ్య వేలం వేస్తామని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ప్రకటించడంతో సుజానా అక్రమాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. (తాతా.. గిఫ్ట్ ఎలా ఇచ్చావు?)

సుజనా చౌదరి ప్రత్యక్షంగా, పరోక్షంగా నిర్వహిస్తున్న వాటిలో సుజనా యూనివర్శల్‌ ఇండస్ట్రీస్, సుజనా మెటల్‌ ప్రొడక్ట్, సుజనా టవర్స్‌ లాంటి లిస్టెడ్‌ కంపెనీలతోపాటు మరో 102 ఇతర కంపెనీలున్నాయి. సుజనా పరోక్షంగా నడిపించే బార్ర్‌టోనిక్స్‌ కూడా లిస్టెడ్‌ కంపెనీయే. మరో 4 కంపెనీలు (విజయ్‌ హోం అప్లయన్సెస్, మెడ్‌సిటీ, లక్ష్మీగాయత్రి, బెస్ట్‌ అండ్‌ కాంప్ట్రాన్‌) మినహా మిగిలినవన్నీ షెల్‌ కంపెనీలే. ఇవి సర్క్యులర్‌ ట్రేడింగ్, బుక్‌ బిల్డింగ్, మనీ ల్యాండరింగ్, పన్ను ఎగవేత కార్యకలాపాలలో దిట్ట. సుజనా  గ్రూపు సంస్థలు వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రూ.8,000 కోట్లకుపైగా రుణాలు తీసుకున్నాయి. అయితే సుజనా సంస్థల ఆస్తుల విలువ రూ.132 కోట్లకు మించదని చెబుతున్నారు. (మా కుటుంబ నికర ఆస్తులు రూ.102.48కోట్లు)

బ్యాంకులను కొల్లగొట్టడంలో ఘనుడు..
సుజనా గ్రూప్‌ ప్రధాన కంపెనీలు రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల (సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా)కు రూ.920 కోట్ల మేర రుణాలు ఎగవేశాయి.
సుజనా యూనివర్సల్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ సంస్థ హెస్టియా లిమిటెడ్, నువాన్స్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ సంస్థలు మారిషస్‌ కమర్షియల్‌ బ్యాంకుల నుంచి రూ.107 కోట్ల రుణం తీసుకుని తిరిగి చెల్లించకుండా బోర్డు తిప్పేశాయి. ఈ రుణానికి సుజనా యూనివర్సల్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేట్‌ గ్యారంటీ ఇచ్చింది. ఈ వ్యవహారంపై ఏపీ హైకోర్టులో మారిషస్‌ కమర్షియల్‌ బ్యాంకు పిటిషన్‌ దాఖలు చేసింది. (సుజనా చౌదరి నివాసంలో సీబీఐ సోదాలు)
బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ పేరుతో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి రూ.304 కోట్ల రుణం పొందేందుకు తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సమర్పించడంపై సుజానా గ్రూపుపై సీబీఐకి బ్యాంకు తాజాగా ఫిర్యాదు చేసింది.
సుజానా గ్రూపు సేల్స్‌ ట్యాక్స్, సెంట్రల్‌ ఎక్సైజ్, కస్టమ్స్, ఐటీ రూపంలో రూ.962 కోట్లను ఎగ్గొట్టడంపై కేసుల విచారణ వివిధ దశల్లో ఉంది.
ఇవన్నీ పరిశీలిస్తే సుజానా గ్రూపు బ్యాంకు రుణాలను భారీగా ఎగ్గొట్టి మనీ ల్యాండరింగ్‌తో కొత్త సంస్థలను ఏర్పాటు చేసుకుని నిధులను దారిమళ్లించినట్లు స్పష్టమవుతోంది.

దోచేసిన సొమ్ముతో భూ దందా
చంద్రబాబుకు సన్నిహితుడైన సుజనా చౌదరి 2014లో రాజధానిపై ప్రకటన వెలువడక ముందే ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా సీఆర్‌డీఏ పరిధిలో భారీగా భూములు కొనుగోలు చేశారు. బ్యాంకులను దోచేసిన సొమ్ముతోనే సుజనా ఆస్తులను పోగేసుకున్నారనే ఆరోపణలకు బలం చేకూరుతోంది. 
సీఆర్‌డీఏ పరిధిలోని చందర్లపాడు మండలం గుడిమెట్లలో సుజనా చౌదరి ఏర‍్పాటు చేసిన 120 కంపెనీల్లో ఒకటైన శివసత్య పిగ్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో 110.6 ఎకరాలను రాజధాని ప్రకటన వెలువడక ముందే రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ అగ్రిమెంట్‌ చేసుకున్నారు. 2018లో తన సంస్థ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. 
సుజనా సోదరుడు యలమంచిలి జతిన్‌ కుమార్‌ ఏర్పాటు చేసిన శివజ్యోతి ఫ్లైకాన్‌ బ్లాక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో 11.56 ఎకరాలను రాజధాని ప్రకటన వెలువడక ముందే కొనుగోలు చేశారు. 
కుటుంబ సభ్యులు, షెల్‌ కంపెనీల పేర్లతో రాజధాని ప్రాంతంలో సుజనా 623.12 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు ఈడీ నిగ్గు తేల్చడం గమనార్హం.     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top