తాతా.. గిఫ్ట్‌ ఎలా ఇచ్చావు?

Chandrababu Naidu Gifted 26,640 Heritage Shares To His Grandson Devansh - Sakshi

మనవడు దేవాన్ష్కు 26,640 హెరిటేజ్‌ షేర్లు గిఫ్ట్‌గా ఇచ్చినట్లు చంద్రబాబు ప్రకటన

గత ఎనిమిదేళ్లుగా తన పేరిట ఒక్క షేరూ చూపని బాబు

రూ.కోట్లలో జీతం తీసుకుంటున్న భువనేశ్వరి ఆస్తి గతేడాదితో పోలిస్తే రూ.2.75 కోట్లు తగ్గుముఖం

భార్య జీతంపై ఆధారపడి బతుకుతున్నానని చెప్పిన బాబు ఆస్తి రూ.69 లక్షలు పెరిగిన వైనం

కొన్నప్పటి ఆస్తుల విలువ చూపిస్తున్నప్పుడు ఈ ఏడాది నికర ఆస్తులు రూ.14 కోట్లు ఎలా పెరిగాయి?

ఐటీ దాడులతో నిర్వాణ హోల్డింగ్స్‌ షేర్లను భార్య పేరుపై బదలాయించిన లోకేశ్‌

ఏటా ఆస్తుల ప్రకటన ఎంత బూటకమో బట్టబయలు

సాక్షి, అమరావతి: చంద్రబాబు కుటుంబం ఆస్తుల ప్రకటనలో డొల్లతనం బట్టబయలైంది. హడావిడిగా ఆస్తుల ప్రకటనలో దాగివున్న లోగుట్టు స్పష్టమైంది. ఐటీ దాడుల నేపథ్యంలోనే ఆస్తుల డ్రామా తెరపైకి వచ్చిందని, నిర్వాణ హోల్డింగ్స్‌తో తమకు సంబంధం లేదని చెప్పుకునేందుకే ఈ పాట్లు అని ఆ రంగం నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు 2019లో సీఎం పదవి నుంచి దిగిపోగానే అప్పటి వరకు తన పేరు మీద లేని కోట్ల రూపాయల విలువైన షేర్లను మనవడు దేవాన్ష్కు గిఫ్ట్‌గా ఇచ్చాడు. వరుసగా తొమ్మిదేళ్ల నుంచి ఆస్తులు ప్రకటిస్తున్నామని చెబుతున్నా.. ఎప్పుడూ కూడా చంద్రబాబు తన పేరు మీద హెరిటేజ్‌ కాదు కదా ఏ కంపెనీ షేర్లు ఉన్నట్లు చూపించలేదు. కానీ గురువారం 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తుల ప్రకటనలో చంద్రబాబు తన మనవడికి 26,640 హెరిటేజ్‌ షేర్లను ప్రకటిస్తున్నట్లు చెప్పడం గమనార్హం.

2017–18లో దేవాన్ష్ పేరు మీద షేర్లు లేకపోగా ఇప్పుడు ప్రకటించిన జాబితాలో గ్రాండ్‌ పేరెంట్స్‌ 26,640 షేర్లు బహుమతిగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో దేవాన్ష్ నాయనమ్మ భువనేశ్వరికి చెందిన హెరిటేజ్‌ షేర్లల్లో మార్పులు లేవు. ఈ షేర్లను తాత చంద్రబాబే ఇచ్చాడన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇది ఒక్కటి చాలు ఏటా ఆస్తుల పేరిట చంద్రబాబు అండ్‌ కంపెనీ నడిపిస్తున్న డ్రామా తెలుసుకోవడానికి. కొన్న నాటి ఆస్తుల విలువను ప్రకటిస్తున్నామని చెబుతారు కానీ, కొత్తగా ఆస్తులు కొనకపోయినా ఆస్తుల విలువ మాత్రం భారీగా పెరిగిపోతుండటం తల పండిన ఆర్థిక వేత్తలకు కూడా అర్థం కావడం లేదు. తనకు హెరిటేజ్‌ కంపెనీలో ఒక్క షేరు లేదంటూ చెప్పుకొచ్చిన చంద్రబాబు ఇప్పుడు మనవడికి గిఫ్ట్‌ ఎలా ఇచ్చాడన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఒక సీఎంగా ఉంటూ తాను షేర్లు కలిగిన కంపెనీకి ప్రభుత్వం నుంచి ఆర్డర్లు ఇవ్వడం ఖచ్చితంగా క్విడ్‌ ప్రోకో కిందకే వస్తుందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

ఐటీ దెబ్బతో నిర్వాణ నుంచి లోకేశ్‌ ఔట్‌ 
చంద్రబాబు కుటుంబ ఆస్తులన్నీ నిర్వాణ హోల్డింగ్స్‌ పేరున ఉన్నాయి. ఈ కంపెనీ హోల్‌టైమ్‌ డైరెక్టర్‌ లోకేశ్‌ సన్నిహితుడు కిలారు రాజేష్‌. 15 రోజుల క్రితం కిలారు రాజేష్‌పై ఆదాయ పన్ను శాఖ దాడులు చేసింది. ఈ నేపథ్యంలో లోకేశ్‌.. నిర్వాణ హోల్డింగ్స్‌లో తన పేరిట ఉన్న రూ.1.62 కోట్ల విలువైన (కొన్న విలువ ప్రకారం) షేర్లను బ్రాహ్మణి పేరిట బదలాయించినట్లు చూపించారు.

కోట్లలో జీతం ఉన్నా తగ్గిన ఆస్తులు 
హెరిటేజ్‌ ఫుడ్స్‌ వైస్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ నారా భువనేశ్వరి కోట్ల రూపాయల్లో జీతం తీసుకుంటున్నారు. కంపెనీ భారీ లాభాలు ప్రకటిస్తుండటంతో డివిడెండ్‌ కూడా బాగానే ఇస్తోంది. 2018–19లో కంపెనీ షేరుకు రూ.40 డివిడెండ్‌ ప్రకటించింది. ఈ లెక్క ప్రకారం భువనేశ్వరి పేరు మీద ఉన్న షేర్లకు సుమారు రూ.42 కోట్లు డివిడెండ్‌గా వస్తుంది. కానీ 2017–18తో పోలిస్తే 2018–19 నాటికి భువనేశ్వరి ఆస్తులు రూ.2.75 కోట్లు తగ్గినట్లు చూపించారు. గతేడాదిలో రూ.53.37 కోట్లుగా ఉన్న భువనేశ్వరి ఆస్తులు ఇప్పుడు రూ.50.62 కోట్లకు తగ్గిపోయినట్లు చెప్పారు కానీ, అందుకు కారణాలను మాత్రం వివరించ లేదు. చంద్రబాబు ఆస్తులు మాత్రం  రూ.8.31 కోట్ల నుంచి రూ.9 కోట్లకు పెరిగినట్లు చెప్పారు. లోకేశ్‌ ఆస్తులు రూ.27.29 కోట్ల నుంచి రూ.24.70 కోట్లకు తగ్గగా, బ్రాహ్మణి ఆస్తులు రూ.13.38 కోట్ల నుంచి రూ.15.68 కోట్లకు, దేవాన్ష్ ఆస్తులు రూ.18.71 కోట్ల నుంచి రూ.19.42 కోట్లకు పెరిగినట్లు చూపించారు.

కళ్లెదుటే వేల కోట్ల ఆస్తులు! 
గతేడాదితో పోలిస్తే కుటుంబ నికర ఆస్తులు రూ.13.82 కోట్లు పెరిగి రూ.102.48 కోట్లకు చేరుకున్నట్లు ప్రకటించారు. కానీ ఇందులో పేర్కొన్న నికర ఆస్తుల విలువ వేల కోట్లలో ఉంటే ఈ కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న హెరిటేజ్‌ షేర్ల విలువే రూ.1,000 కోట్ల పైన ఉంది. ఇది కాకుండా నిర్వాణ హోల్డింగ్స్‌ పేరిట ఉన్న ఆస్తులు, పెట్టుబడులు అదనం. ఇలా వేల కోట్ల ఆస్తులను తక్కువ చేసి చూపిస్తూ నాటకాలు ఆడటం నారా వారికే చెల్లుతుందని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నాయి.

చంద్రబాబు కుటుంబ నికర ఆస్తులు కోట్లల్లో ఇలా పెరిగాయి.. (అప్పులు తీసివేయగా)
ఏడాది    ఆస్తుల విలువ
2011    38 
2012    35.59 
2013    41.70 
2014    63.95 
2015    47.3 
2016    74 
2017    75.06 
2018    88.66 
2019    102.48   


నాయనమ్మ, తాతల నుంచి దేవాన్ష్ గిఫ్టుగా పొందినట్లు కనిపిస్తున్న షేర్లు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top