బంగారుతల్లి పథకానికి ఎంపికైన మహిళలు రచ్చబండ కార్యక్రమంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
మంచాల, న్యూస్‌లైన్: బంగారుతల్లి పథకానికి ఎంపికైన మహిళలు రచ్చబండ కార్యక్రమంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మంచాల మండల కేంద్రంలో శుక్రవారం రచ్చబండ కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభం కావడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ఉదయం 11.00 గంటలకే మంత్రి ప్రసాద్‌కుమార్ వస్తారని చెప్పడంతో మహిళలంతా గంట ముందుగానే ఫంక్షన్ హాలుకు చేరుకున్నారు. చిన్నపిల్లలను చంకన వేసుకుని 91మంది మహిళలు పడిగాపులు కాశారు.
పిల్లలు ఆకలి బాధ తట్టుకోలేక ఏడుస్తున్నారని, ఏంచేయాలో తోచడం లేదని కొంతమంది అధికారులకు తమ ఇబ్బందులను తెలియజేశారు. మంత్రిగారు వచ్చేదాకా ఎక్కడికీ వెళ్లడానికి వీల్లేదని అధికారులు చెప్పడంతో ఏడుస్తున్న పిల్లలను సముదాయిస్తూ మహిళలు అలాగే కూర్చుండిపోయారు. మంత్రిగారు తీరిగ్గా మధ్యాహ్నం 1.30గంటలకు వచ్చారు. తర్వాత మరో రెండుగంటల సేపు ప్రసంగాలు అవీ కొనసాగాయి. ఈ మధ్యలో సీపీఎం నాయకులు కాసేపు ఆందోళన చేయడంతో గొడవ జరుగుతుందేమోనని భయపడ్డారు. సాయంత్రం 4 గంటల తర్వాత మహిళలకు బంగారుతల్లి పథకం మంజూరుపత్రాలు అందజేశారు.