పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు గురువారం విశాఖ విమానాశ్రయాన్ని పరిశీలించారు.
విశాఖ : పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు గురువారం విశాఖ విమానాశ్రయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన హుదూద్ తుఫాను విపత్తులో సమర్థవంతంగా పని చేసిన అధికారులను అభినందించారు. తుఫాను సమయంలో విమానాశ్రయాన్ని కాపాడేందుకు విమానాశ్రయ సిబ్బంది అంకితభావంతో పాటు మంచి నైపుణ్యం చూపారని కొనియాడారు. విపత్తులో కూడా సిబ్బంది విమానాశ్రయంలోనే ఉండి కీలక పరికరాలను ధైర్యంగా కాపాడారన్నారు. విమానాశ్రయంలో ప్రాణ నష్టం జరగలేదని అశోక్ గజపతిరాజు అన్నారు. ఆయన ఈ సందర్భంగా సిబ్బందిని సన్మానించి, జ్ఞాపికలు అందచేశారు.
విశాఖ విమానాశ్రయంలో శుక్రవారం నుంచి విమానాల రాకపోకలు యథావిధిగా కొనసాగుతాయని అశోక్ గజపతిరాజు తెలిపారు. నవంబర్ 1వ తేదీ నుంచి అంతర్జాతీయ విమాన సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. విమానాశ్రయం పూర్తి పునరుద్ధరణకు మూడు నెలల సమయం పడుతుందన్ని ఆయన తెలిపారు.