
పోలవరపు హరిబాబుపై దళిత సంఘాల నాయకులతో కలిసి ఫిర్యాదు చేస్తున్న వనరాణి. (ఇన్‌సెట్‌లో) మీడియా ముందు విలపిస్తున్న వనరాణి
మంగళగిరిరూరల్: తెలుగుదేశం పార్టీ సమావేశంలో ఆ పార్టీకి చెందిన దళిత మహిళా నాయకురాలికి అవమానం జరిగింది. నియోజకవర్గ ఇన్‌చార్జి ఎదుటే ఆ పార్టీ నాయకులు కొందరు ఆమెను కులం పేరుతో దూషించి దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు సదరు టీడీపీ నాయకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దర్శి వనరాణి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఆ పార్టీ అధినేత రాజకీయ ప్రస్థానం 40 ఏళ్లు అయిన సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి గంజి చిరంజీవి ఇంటి వద్ద ఆయనతో పాటు పార్టీ నాయకులు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా టీడీపీ మహిళా విభాగం జిల్లా కార్యవర్గ సభ్యురాలు దర్శి వనరాణి సమస్యలను వివరిస్తుంటే ‘‘ఇది చౌదర్ల పార్టీ నువ్వు మాట్లాడడానికి వీల్లేదు.. కూర్చో’’ అంటూ పార్టీ నేత పోలవరపు హరిబాబు అడ్డుకున్నాడు. ‘‘పదవులు ఇస్తే మీ స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు. మీకు పదవులు ఇచ్చినందుకు మా కాళ్లు కడిగి నెత్తిన నీళ్లు పోసుకోవాలి. కులం తక్కువవాళ్లను పక్కన పెట్టాలి.’’ అంటూ విద్వేషంగా మాట్లాడాడు. దీంతో ఆమె చిన్నబుచ్చుకుని బయటకు వస్తుంటే కులం పేరుతో మరోసారి దూషించి దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె భోరుమని విలపించింది. టీడీపీలో మొదటినుంచి పనిచేస్తున్న తమలాంటి వారిని కుల అహంకారంతో అందరి సమక్షంలోనే హరిబాబు దూషించి, దాడికి పాల్పడినా ఎవరూ మాట్లాడలేదని వాపోయారు. పైగా పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి గంజి చిరంజీవి తన వాహనంలో హరిబాబును తీసుకుని వెళ్లిపోయారన్నారు. తనను అవమానపరిచిన హరిబాబుని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసి దళితుల గౌరవాన్ని కాపాడాలని ఆమె విలేకరుల సమావేశంలో కోరారు. అనంతరం ఈ సంఘటనపై మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లో దళిత సంఘాల నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోలవరపు హరిబాబుపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
దళితతేజం కార్యక్రమాన్ని బహిష్కరిస్తూ తీర్మానం
టీడీపీ అధిష్టానం ఆదేశాల ప్రకారం నియోజకవర్గంలో నిర్వహిస్తున్న దళితతేజం కార్యక్రమాన్ని బహిష్కరిస్తూ టీడీపీ దళితనేతలు ఏకగ్రీవంగా తీర్మానించారు. మంగళగిరిలో నియోజకవర్గ దళిత నేతల అత్యవసర సమావేశం మంగళవారం నిర్వహించారు. దర్శి వనరాణి పట్ల హరిబాబు దాడిచేసి, కులంపేరుతో అసభ్యంగా మాట్లాడాడని, అతనిపై చర్యలు తీసుకునేవరకు దళితతేజం–తెలుగుదేశం కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామన్నారు. సమావేశంలో దళిత నాయకులు జ్యోతిబసు, వెలగపాటి విలియం, మరియదాసు, కుక్కమళ్ళ సాంబశివరావు, కొమ్మా లవకుమార్, కంచర్ల ప్రకాశరావు, రావూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.