అటల్‌జీ.. నిన్ను మరువలేం

Atal Bihari Vajpayee Memories With Guntur - Sakshi

జిల్లాతో మాజీ ప్రధాని వాజ్‌పేయికి విడదీయరాని బంధం

15 సార్లు జిల్లాలో పర్యటించిన నేత

ఆయన స్మృతులను తలుచుకుంటున్న గుంటూరు ప్రజలు

రైలుపేట(గుంటూరు): భారతరత్న, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి(93) మృతి పట్ల గుంటూరు జిల్లాకు చెందిన బీజేపీ నేతలు పలువురు సంతాపం తెలియజేశారు. వాజ్‌పేయితో తమకున్న అనుబంధాలను నెమరువేసుకున్నారు.  రాజకీయంగా ఎంతో చైతన్యం ఉన్న గుంటూరు జిల్లా కు 15 సార్లు వచ్చిన వాజ్‌పేయి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జనసంఘ్‌ రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు సైతం గుంటూరులోనే జరిగింది. అనేకమార్లు రాజకీయ తీర్మానాలు గుంటూరు వేదికగా తీసుకున్నారు. అఖిల భారత జనసంఘం జాతీయ అధ్యక్షుడిగా, ఎంపీగా  పనిచేస్తున్న కాలంలో 1968లో గుంటూరు జిన్నాటవర్‌ సెంటర్‌లో వీరసావర్కర్‌ రోడ్డును వాజ్‌పేయి ప్రారంభించారు. జిన్నాటవర్‌ నుంచి ఎన్‌టీఆర్‌ స్టేడియం వరకు ఈ రోడ్డును నిర్మించారు. మున్సిపల్‌ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా పనిచేస్తున్న చేబ్రోలు హనుమయ్య కాంగ్రెస్‌పార్టీలో ఉన్నప్పటికీ వాజ్‌పేయితో ఈ రోడ్డును ప్రారంభింపచేశారు. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యాలయం వద్ద ఆయనకు పౌరసన్మానం కూడా చేశారు. తదుపరి  జనసంఘ్‌ నగర అధ్యక్షుడు వనమా పూర్ణచంద్రరావు 1983లో గుంటూరు తూర్పు ఎమ్మెల్యేగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో ఆయనకు మద్దతుగా వాజ్‌పేయి గుంటూరులో ఎన్నికల ప్రచారం చేశారు. తన గెలుపుకోసం ప్రచారం చేసిన వాజ్‌పేయి లేరనే మాటను జీర్ణించుకోలేక పోతున్నామని వనమా ఆవేదనగా అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ నలబోతు వెంకట్రావు, నగర అధ్యక్షుడు అమ్మిశెట్టి ఆంజనేయులు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెలవర్తిపాటి పాండురంగవిఠల్, జిల్లా కార్యదర్శి పునుగుళ్ల రవిశంకర్, ఉపాధ్యక్షులు సత్యన్నారాయణ వాజ్‌పేయి మృతికి సంతాపం తెలిపి, ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.

వాజ్‌పేయి మృతిపై వైఎస్సార్‌ సీపీ నేతల దిగ్బ్రాంతి
పట్నంబజారు(గుంటూరు): భారత రత్న, మాజీ ప్రధాని అటల్‌ బిహరీ వాజ్‌పేయి మృతి చెందటంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుంటూరులోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయం నుంచి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. వాజ్‌పేయి మృతి భారతదేశానికి, దేశ రాజకీయాలకు తీరని లోటని పార్టీ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త రావి వెంకటరమణ, సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు, నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే ముస్తఫా, బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఆతుకూరి ఆంజనేయులు, కిలారి రోశయ్య, పార్టీ నేత పాదర్తి రమేష్‌గాంధీ, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంగడి శ్రీనివాసరావు, అనుబంధ విభాగాల అధ్యక్షులు షేక్‌ జిలాని, బూరెల దుర్గాప్రసాద్, ఆళ్ళ పూర్ణచంద్రరావు, సాయిబాబుతో పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య కుటుంబంలో జన్మించి దేశంలో అత్యున్నత పదవులు చేపట్టిన గొప్ప వ్యక్తి వాజ్‌పేయి అని కీర్తించారు. కేంద్రంలో ఐదేళ్ల పాటు కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని నడిపించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అనేక ఆర్థిక సంస్కరణలు చేపట్టి, ప్రభుత్వ వృథా ఖర్చులను తగ్గించారని పేర్కొన్నారు.

వాజ్‌పేయి మృతికి ఎమ్మెల్యే ఆర్కే సంతాపం
మంగళగిరిటౌన్‌: భారతరత్న, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి మృతిపట్ల మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. నిజాయితీపరుడైన రాజకీయ వేత్తను కోల్పోయామని, విలువలతో కూడిన రాజకీయాలను నడిపి భారతదేశానికే కాకుండా, ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన వాజపేయి మృతి దేశానికి తీరని లోటని అన్నారు.  

మా కుటుంబంతో ఎంతో అనుబంధం
వాజ్‌పేయి జనసంఘ్‌ జాతీయ అ«ధ్యక్షుడిగా పనిచేస్తున్న సమయంలో మా తండ్రి జూపూడి యజ్ఙనారాయణ జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. తల్లి హైమావతమ్మతో పాటు నేను కూడా జన్‌సంఘ్‌లో పనిచేశాం. ఈ నేపథ్యంలో సుమారు 15 సార్లు వాజ్‌పేయి గుంటూరులోని మా ఇంటికి వచ్చి బసచేశారు. పలుమార్లు ఆయన గుంటూరు నుంచి ఇతర ప్రాంతాలకు సభలకు వెళ్లే సమయంలో నేనే స్వయంగా కారు  డ్రైవ్‌ చేసుకుంటూ వాజ్‌పేయిను తీసుకెళ్లాను. ఎన్నో విషయాలను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. కారులో వెళ్తున్న సమయంలో రోడ్డు అంతా గుంతల మయంగా ఉండి డ్రైవింగ్‌ ఇబ్బందిగా ఉండటాన్ని గమనించిన వాజ్‌పేయి ప్రభుత్వమే రోడ్ల నిర్వహణ బాధ్యతలు చేపట్టాలని భావించారు. అందుకే ఆయన ప్రధాని అవగానే నాలుగులైన్ల జాతీయ రహదారులను వేయించి రవాణా రంగం అభివృద్ధి చేశారు. గుంటూరు గోంగూర అంటే ఆయనకు ఎంతో ఇష్టం. మా ఇంటికి వచ్చినప్పుడు గోంగూరను అడిగి వడ్డించమనేవారు. అవకాయపచ్చడి సైతం ఎంతో ఇష్టంగా తినేవారు. ఆయన ప్రధాని అయ్యాక కూడా అదే పిలుపు, అదే ఆప్యాయత చూపించారు. ప్రధాని అయ్యాక ఢిల్లీకి వెళ్లిన సమయంలో మమ్ముల్ని ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు.  ఆయన మృతిని మా కుటుంబం జీర్ణించుకోలేకపోతుంది.
–బీజేపీ సీనియర్‌ నాయకుడు జూపూడి రంగరాజు

తెనాలిలో వాజ్‌పేయి జ్ఞాపకాలు
తెనాలి: భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి కన్నుమూశారన్న సమాచారం బీజేపీ అభిమానులనే కాదు, పట్టణానికి చెందిన పలువురు నాటి తరం పెద్దల మనసుల్లో విచారం నింపింది. అఖిల భారత జనసంఘ పార్టీ, బీజేపీ పార్టీ అధ్యక్షుడి హోదాలోనూ రెండు పర్యాయాలు ఆయన తెనాలిని సందర్శించారు. అప్పట్లో జిల్లా కేంద్రం కూడా కాని తెనాలి పట్టణానికి రావటానికి, జిల్లాలో ఆయా పార్టీలకు మూలస్తంభం వంటి ప్రముఖుడు దివంగత తమిరిశ రామాచార్యులు ఆహ్వానం ప్రధాన కారణం. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలానికి ఆకర్షితుడై జనసంఘ్‌ పార్టీ, తర్వాత బీజేపీలోనూ జీవితాంతం కొనసాగిన రాజకీయనేత టి.రామాచార్యులు, తెనాలిలో ఆయా పార్టీల రాష్ట్ర కార్యవర్గ సమావేశాలే కాదు, పార్టీ నిర్దేశించిన అనేక కార్యక్రమాల నిర్వహణలో చొరవ చూపారు. ఆయన ఆహ్వానంపైనే జనసంఘ సమావేశంలో పాల్గొనేందుకు 1971లో వాజ్‌పేయి అఖిల భారత జనసంఘ అధ్యక్షుని హోదాలో తొలిసారిగా తెనాలికి వచ్చారు. స్వరాజ్‌ టాకీస్‌లో జరిగిన సభలో ఆయన పాల్గొన్నారు. 1980 ఏప్రిల్‌ 6వ తేదీన ఢిల్లీలో వాజ్‌పేయి అధ్యక్షతన జరిగిన సమావేశంలోనే నూతన పార్టీ ఏర్పాటుకు నిర్ణయం జరిగి, భారతీయ జనతా పార్టీ అవిర్భవించింది. తెనాలి నుంచి ఆ సమావేశానికి టి.రామాచార్యులు హాజరై వాజ్‌పేయిని అభినందించారు. ఆ వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ శాఖ ఏర్పాటైంది. జిల్లా సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన టి.రామాచార్యులు ఆహ్వానంపై మరోసారి వాజ్‌పేయి తెనాలికి వచ్చారు. తెనాలి మార్కెట్‌ సెంటర్లో జరిగిన సభలో వాజ్‌పేయితో అప్పటి ఎమ్మెల్సీ జూపూడి యజ్ఞనారాయణ, బీజే పీ రాష్ట్ర అధ్యక్షుడు డీఎస్‌పీ రెడ్డి, జానా కృష్ణమూర్తి వేదికపై ఉన్నారు.  

మాచర్లతో ఎనలేని అనుబంధం
మాచర్లరూరల్‌: మాజీ ప్రధాని వాజ్‌పేయికి మాచర్ల నియోజకవర్గంతో ఎంతో అనుబంధం ఉంది. ఈయన 1983లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కర్పూరపు కోటయ్య తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కోదండ రామాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top