
చనిపోయాడని ఏర్పాట్లు..ఇంతలో కదలికలు
చిత్తూరు జిల్లాలో బతికుండగానే రోగి చనిపోయాడని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో అతని శరీరంలో కదలికలు వచ్చాయి.
చంద్రగిరి : చిత్తూరు జిల్లాలో బతికుండగానే రోగి చనిపోయాడని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో అతని శరీరంలో కదలికలు వచ్చాయి. ఈ ఘటన చంద్రగిరిలో శుక్రవారం చోటుచేసుకుంది. తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో రోగి చనిపోయాడని ఇంటికి పంపించేశారని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే కుటుంబ సభ్యులు వైద్యానికి నిరాకరించి బలవంతంగా ఇంటికి తీసుకెళ్లారని స్విమ్స్ వైద్యులు తెలపడంతో వివాదం కొనసాగుతోంది.
చంద్రగిరి కొత్తపేట దాసర వీధికి చెందిన ఆర్టీసీ కండక్టర్ విశ్వనాథం నాయుడుకు గురువారం గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు అతన్ని స్విమ్స్‌కు తరలించారు. వెంటిలేటర్ ద్వారా చికిత్సలు అందిస్తున్న సమయంలో తన తండ్రి చనిపోయాడని వైద్యులు నిర్ధారించారని విశ్వనాథం కుమారుడు ప్రదీప్ తెలిపాడు. దీంతో ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశామన్నారు. ఆ సమయంలో ఆయన శరీరంలో ఒక్కసారిగా కదలికలు వచ్చాయని.. హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించామని కుటుంబసభ్యులు వాపోయారు.
ఘటనపై స్విమ్స్ వైద్యులను వివరణ కోరగా విశ్వనాథంకు జబ్బు నయం కాలేదని చెప్పినా, రోగిని ఇంటికి వెళ్తామని కుటుంబసభ్యులు చెప్పారన్నారు. దీంతో రాతపూర్వకంగా రాసిచ్చి ఆయన్ను శుక్రవారం రాత్రి డిశ్చార్జ్ చేశామని చెప్పారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని విశ్వనాథం కుమారుడు డిమాండ్ చేస్తున్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విశ్వనాథం నాయుడిని శుక్రవారం చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ విశ్వనాథంనాయుడు మృతి చెందినట్లు వచ్చిన వార్తలు వాస్తవం కాదన్నారు.