పకడ్బందీగా ఉపఎన్నిక

పకడ్బందీగా ఉపఎన్నిక


కర్నూలు(అగ్రికల్చర్):

 ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఆళ్లగడ్డ ఉప ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయమోహన్ అన్నారు. మంగళవారం సాయంత్రం శాంతిభద్రతలు, బందోబస్తు ప్లాన్‌పై పోలీసు, ఎక్సైజ్, రెవెన్యూ యంత్రాంగంతో కాన్ఫరెన్స్ హాల్‌లో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా  ఓట్లు వేసే అవకాశాన్ని కల్పించాలన్నారు.



ఎన్నికలు ఆళ్లగడ్డ నియోజకవర్గానికే పరిమితమైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి మాత్రం జిల్లా అంతటా ఉంటుందని చెప్పారు. మద్యం షాపులపై పూర్తిగా నియంత్రణ ఉండాలన్నారు. బెల్టు షాపులను సమూలంగా అరికట్టేందుకు పోలీసు, ఎక్సైజ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.  ఎట్టి పరిస్థితుల్లో అలసత్వం చూపవద్దన్నారు. అలాగే లా అండ్ ఆర్డర్ పూర్తిస్థాయిలో అదుపులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని.. లెసైన్స్ కలిగిన తుపాకులను సంబంధిత పోలీస్‌స్టేషన్లలో సరెండర్ చేయించాలన్నారు.



ఎవరూ ఆయుధాలను కలిగి ఉండరాదని పేర్కొన్నారు. క్రిటికల్ పోలింగ్ బూత్‌లు, సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, నామినేషన్ల ఉపసంహరణ తర్వాత అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.  ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై తగిన నిఘా ఉండాలని, కులమతాలను రెచ్చగొట్టే శక్తులను కనిపెట్టాలని అధికారులకు చెప్పారు.  జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు పోలీసు శాఖ అవసరమైన చర్యలను తీసుకుంటుందని తెలిపారు. బెల్టు షాపులు ఉంటే టోల్‌ఫ్రీ నంబర్ 100కి ఫోన్ చేయాలన్నారు. సమావేశంలో డీఆర్వో గంగాధర్‌గౌడు, ఆళ్లగడ్డ రిటర్నింగ్ అధికాారి సుధాకర్‌రెడ్డి, డీఎస్పీలు, ఎక్సైజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

 జిల్లాకు చేరిన వ్యయ పరిశీలకుడు

 కర్నూలు(అగ్రికల్చర్) : ఆళ్లగడ్డ ఉప ఎన్నిక ప్రక్రియ మొదలు కావడంతో ఎన్నికల కమిషన్ నియమించిన వ్యయ పరిశీలకులు చవాన్ మంగళవారం జిల్లాకు చేరుకున్నారు. ముందుగా జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌తో సమావేశమై ఆళ్లగడ్డ నియోజకవర్గంపై చర్చించారు. తర్వాత ఆళ్లగడ్డకు వెళ్లారు. ఆయన వెంట అసిస్టెంట్ వ్యయ పరిశీలకుడు సుబ్బారావు తదితరులు ఉన్నారు.



  ఏర్పాట్లను వేగవంతం చేయండి

 కర్నూలు(అగ్రికల్చర్): ఆళ్లగడ్డ ఉప ఎన్నిక సజావుగా జరిగేందుకు అవసరమైన ఏర్పాట్లను వేగవంతం చేయాలని  జిల్లా కలెక్టర్ సిహెచ్.విజయ్‌మోహన్ అధికారులకు ఆదేశించారు. పోలింగ్ సిబ్బంది ఎన్నికల మెటీరియల్‌తో ఆర్టీసీ బస్సుల్లోనే తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం కలెక్టర్ ఉప ఎన్నికల నిర్వహణ కోసం నియమించిన నోడల్ అధికారులతో కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.



ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  నామినేషన్లు మొదలుకొని ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు నోడల్ అధికారులు తమకు అప్పగించిన పనులను జవాబుదారీ తనంతో, ఎక్కడ ఏ చిన్న పొరపాట్లకు తావు లేకుండా పర్యవేక్షించాలన్నారు.  పోలింగ్ రోజు 25 రూట్లను 25 బస్సులు అవసరమవుతాయని, వీటితో పాటు ఎన్నికల పరిశీలకులకు, రూట్ ఆఫీసర్లకు, మరో 25 వాహనాలను సిద్ధం చేయాలని ట్రాన్స్‌పోర్టు డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించారు. పోలింగ్ సిబ్బంది, మైకో పరిశీలకులు, ఇతర పోలింగ్ అధికారులకు ఈనెల 19న శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికను సిద్ధం చేయాలని శిక్షణ నోడల్ అధికారి జేడీఏను ఆదేశించారు.  



ప్రతి ఓటరుతో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రతిజ్ఞ చేయించాలన్నారు. ఈవీఎంలు మొరాయించకుండా  జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.  ఎన్నికల మీడియా సెంటర్‌లో టీవీ ఏర్పాటు చేసుకుని ఇంగ్లిషు, తెలుగు ఛానల్స్ ద్వారా తాజా ఎన్నికల సమాచారాన్ని పత్రికలకు విడుదల చేయాలని సూచించారు. సమావేశంలో డీఆర్‌ఓ గంగాధర్ గౌడు, డీఈఓ నాగేశ్వరరావు, జేడీఏ ఠాగూర్ నాయక్, సీపీఓ ఆనంద్ నాయక్, డీటీసీ శివరాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top