
సాక్షి, అమరావతి: అత్యవసర వస్తువుల సరఫరాకు వాహనాలను అనుమతిస్తుండటంతో రహదారుల్లో వారికి ఆహార ఇబ్బందులు తలెత్తకుండా పరిమిత సంఖ్యలో దాబాలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర రహదారులపై 129 దాబాలను ప్రారంభించడానికి అనుమతిచ్చినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు. ఇవి కేవలం రహదారులపై ప్రయాణించే వాహనదారుల కోసమేనని, సాధారణ జనాన్ని అనుమతించడానికి వీలులేదన్నారు. ఈ దాబాల్లో పరిశుభ్రత, భౌతిక దూరం కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. వీటిని పర్యవేక్షించే బాధ్యతను ఆయా జిల్లాల జీఎంలకు అప్పచెప్పినట్లు రజత్‌భార్గవ తెలిపారు.
అనుమతులు ఇలా...
► అత్యవసర సేవలు, నిత్యావసరాలకు సంబంధించిన వాహనాలకు..
► పండ్లు, కూరగాయలు తదితర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు...
► నిరంతరాయంగా పనిచేయాల్సిన పరిశ్రమలకు ముడి సరుకు తరలించేందుకు...
► లాక్‌డౌన్ సమయంలో ఫార్మా, ఆహార శుద్ధి రంగాలకు చెందిన పరిశ్రమలు పనిచేయడానికి అనుమతించడంతో వాటికి సంబంధించిన వాహనాలకు.