ఏపీ వాటా తెలంగాణ పరం | AP Government left vidyut soudha properties to Telangana | Sakshi
Sakshi News home page

ఏపీ వాటా తెలంగాణ పరం

Apr 26 2017 7:08 PM | Updated on Sep 5 2017 9:46 AM

ఏపీ వాటా తెలంగాణ పరం

ఏపీ వాటా తెలంగాణ పరం

హైదరాబాద్‌ విద్యుత్‌ సౌధాలో వాటాను వదులుకునేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది.

సాక్షి, అమరావతి :  హైదరాబాద్‌ విద్యుత్‌ సౌధాలో వాటాను వదులుకునేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఆస్తులు, అప్పులపై రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదం పరిష్కారం కాకుండానే ఆస్తులన్నీ అప్పగించాలనే నిర్ణయం విద్యుత్‌ సిబ్బందికి విస్మయం కలిగిస్తోంది. తెలంగాణకు భయపడి విలువైన ఆస్తులు వదులుకోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆరు అంతస్తుల్లో విద్యుత్‌ సౌధా నిర్మించారు. రాష్ట్ర విభజన తర్వాత దీన్ని ఏపీ, తెలంగాణ పంచుకోవాల్సి ఉంది.

భౌగోళికంగా తెలంగాణలో ఉండటం వల్ల ఇది ఆ రాష్ట్రానికే చెందే వీలుంది. అయితే, ఏపీ వాటా కింద తెలంగాణ కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఆస్తుల విలువ కట్టకపోవడం వల్ల ఎంతమొత్తం ఇవ్వాలనేది ఇంకా నిర్థారణ కాలేదు. ప్రస్తుతం విద్యుత్‌ సౌధాలో రెండు రాష్ట్రాల జెన్‌కో, ట్రాన్స్‌కో కార్యాలయాలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. పదేళ్ళ పాటు ఏపీ ఇక్కడ తమ ఆఫీసులను నిర్వహించుకునే హక్కు కూడా ఉంది. ఈ నేపథ్యంలో విద్యుత్‌ సంస్థలను విజయవాడకు తరలించాలని ప్రభుత్వం ఆదేశించింది.

మే నెలాఖరుకు అన్ని శాఖలను గుణదలకు తీసుకెళ్ళేందుకు ఏపీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కార్యాలయాలు ఖాళీ చేసినప్పటికీ ఆస్తుల పంపకం జరిగే వరకూ ఏపీ ఆఫీసులకు తాళాలు వేసి, తమ ఆధీనంలో ఉంచుకోవాలని ఏపీ విద్యుత్‌ సంస్థలు భావించాయి. దీనిపై తెలంగాణ అధికారులు తీవ్ర అభ్యంతరం లేవనెత్తినట్టు తెలిసింది. తాళాలు వేసుకుని పోతే ఆ గదుల్లో ఎలుకలు చనిపోతాయని, దీంతో పక్కన ఉన్న తమ గదుల్లోనూ భరించలేని వాసన వస్తుందని ఏపీకి తెలిపారు. తాళాలు వేసుకుని వెళ్ళే పరిస్థితే వస్తే ఒక్క ఫైల్‌ కూడా బయటకు వెళ్ళనీయమని హెచ్చరించినట్టు తెలిసింది. దీంతో తెలంగాణ అధికారులతో ఏపీ అధికారులు చర్చలు జరిపారు.

మొత్తం బిల్డింగ్‌ తమకు ఇవ్వాలని, ఆస్తుల పంపకం తేలే వరకూ నెలకు రూ.2 లక్షలు అద్దె చెల్లిస్తామని తెలంగాణ ప్రతిపాదించింది. దీనికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అయితే ఇప్పటికే తెలంగాణ రూ.4,800 కోట్ల విద్యుత్‌ బకాయిలు చెల్లించలేదని, అద్దె మాత్రం చెల్లిస్తుందా? అని ఏపీ విద్యుత్‌ సిబ్బంది పెదవి విరుస్తున్నారు. అయినా ఆరు అంతస్తుల భవనాన్ని కేవలం రూ.2 లక్షల అద్దెకే ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఖైరతాబాద్‌ ప్రాంతంలో ఒక్కో ఫ్లోర్‌ కనీసం రూ.25 లక్షల అద్దె పలుకుతుందని, ఆరు అంతస్తులకు దాదాపు రూ.1.50 కోట్ల వరకూ అద్దె వచ్చే వీలుందని చెబుతున్నారు. ప్రభుత్వ తీరుపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement