హైదరాబాద్‌ బస్సులకు రిజర్వేషన్‌ నిలిపివేత | AP Is Dropping reservations to Hyderabad buses | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ బస్సులకు రిజర్వేషన్‌ నిలిపివేత

Apr 9 2020 4:13 AM | Updated on Apr 9 2020 8:15 AM

AP Is Dropping reservations to Hyderabad buses  - Sakshi

హైదరాబాద్‌ సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులకు అడ్వాన్స్‌డ్‌ రిజర్వేషన్‌ ప్రక్రియను ఏపీఎస్‌ఆర్టీసీ నిలిపివేసింది.

సాక్షి, అమరావతి: హైదరాబాద్‌ సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులకు అడ్వాన్స్‌డ్‌ రిజర్వేషన్‌ ప్రక్రియను ఏపీఎస్‌ఆర్టీసీ నిలిపివేసింది. తెలంగాణలో లాక్‌ డౌన్‌ కొనసాగుతుందని అక్కడి సీఎం కేసీఆర్‌ సంకేతాలివ్వడంతో ఆర్టీసీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. లాక్‌ డౌన్‌ కొనసాగితే ఇప్పటికే రిజర్వేషన్‌ చేసుకున్న వారికి పూర్తి సొమ్ము వాపసు ఇస్తామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. లాక్‌డౌన్‌ తర్వాత రోజు నుంచి వివిధ ప్రాంతాలకు నాన్‌–ఏసీ బస్సులు నడపాలని నిర్ణయించిన ఆర్టీసీ గత నాలుగు రోజులుగా ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ టిక్కెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచగా 15వ తేదీకి ఫుల్‌ అయ్యాయి.

మొత్తం 200 బస్సులకు రిజర్వేషన్‌ అవకాశం ఇవ్వగా మొత్తం 7 వేల టిక్కెట్లు ప్రయాణికులు కొనుగోలు చేశారు. అయితే తాజాగా లాక్‌ డౌన్‌పై ప్రతిష్టంభన నెలకొనడంతో బుధవారం నుంచి ఏపీలోని అన్ని ప్రాంతాలకు రెండు వైపులా బుకింగ్‌ను ఆపేశారు. లాక్‌ డౌన్‌ కొనసాగితే బుకింగ్‌ చేసుకున్న టిక్కెట్లకు సంబంధించి పూర్తి సొమ్మును వాపసు చేస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈనెల 14వ తేదీతో లాక్‌డౌన్‌ ముగుస్తుంది. దీంతో 15 నుంచి 20వ తేదీ వరకు ఆర్టీసీ టిక్కెట్ల రిజర్వేషన్‌ను అధికారులు నాలుగు రోజుల క్రితం అందుబాటులోకి తెచ్చారు. ఆరు రోజులకు వివిధ ప్రాంతాలకు కలిపి 42,377 టిక్కెట్లు ఇప్పటికే బుక్‌ అయ్యాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement