మద్యం దుకాణాల వద్ద కట్టడి చేయండి

AP CS Neelam Sahni Comments About Liquor stores - Sakshi

ఐదుగురికి మించకుండా చర్యలు చేపట్టండి

సీఎస్‌ నీలం సాహ్ని ఆదేశం  

సాక్షి, అమరావతి: మద్యం దుకాణాలు వద్ద ఐదుగురికి మించి వినియోగదారులు గుమికూడకుండా కట్టడి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు. కరోనా వైరస్‌ నియంత్రణ చర్యలపై సోమవారం విజయవాడలోని తన క్యాంప్‌ కార్యాలయం నుంచి కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. మద్యం దుకాణాల వద్ద కచ్చితంగా భౌతిక దూరం పాటించేలా చూడాలని, ఒకవేళ ఎక్కువమంది గుమికూడితే తలుపులు మూసివేసి వారిని చెదరగొట్టాలని స్పష్టం చేశారు. భౌతిక దూరం పాటిస్తేనే అమ్మకాలు జరపాలన్నారు. ఈ విషయంలో ఎక్సైజ్, పోలీస్‌ అధికారులు చర్యలు తీసుకునేలా కలెక్టర్లు చూడాలన్నారు. 

ఇంకా ఏం చెప్పారంటే..
► వ్యవసాయ, నిర్మాణ, పారిశ్రామిక రంగాల పనులు పూర్తయిన లేదా నిలిచిపోయిన కార్మికులు సొంత జిల్లాలు/రాష్ట్రాలకు వెళ్లాలనుకుంటే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంపించేందుకు ఏర్పాట్లు చేయాలి.
► దూరప్రాంతాల్లో స్థిరపడిన కార్మికులను లాక్‌డౌన్‌ నేపథ్యంలో వారి స్వస్థలాలకు తరలించటం సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది.
► తరలించిన వలస కార్మికులను ఉంచేందుకు ప్రతి గ్రామంలో 10 పడకలతో ఏర్పాటు చేస్తున్న కమ్యూనిటీ క్వారంటైన్‌ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి.
► కంటైన్మెంట్‌ జోన్లకు వెలుపల సాధారణ కార్యకలాపాలు మొదలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి.
► కేసుల పాజిటివిటీ రేషియో, ఫెటాలిటీ రేషియో, వారం రోజుల వ్యవధిలో డబ్లింగ్‌ రేట్‌ ఇండికేటర్లపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి.
► కాన్ఫరెన్స్‌లో వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top