
సాక్షి, అనంతపురం: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తోంటే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సైంధవుడిలా మారి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా నాయక్‌నగర్ వార్డు సచివాలయం వద్ద వైఎస్సార్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడిచిన ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా చంద్రబాబులో మార్పు రాలేదన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ రాష్ట్ర భవిష్యత్తుకు పునాది వేస్తుందని పేర్కొన్నారు. పింఛన్ల తొలగింపుపై టీడీపీ నేతలు దుష్ఫ్రచారం చేస్తున్నారని.. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హులకు అన్యాయం జరగదని వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.