పోరు.. జోరు | Anantapur district, was heading towards samaikyandhra relentless fighting | Sakshi
Sakshi News home page

పోరు.. జోరు

Sep 27 2013 2:36 AM | Updated on Jun 1 2018 8:36 PM

సమైక్యాంధ్రే ధ్యేయంగా అనంతపురం జిల్లాలో అలుపెరుగని పోరు సాగుతోంది. 58వ రోజు గురువారం కూడా సడలని దీక్షతో సమైక్యవాదులు ఉద్యమాన్ని మరింత ఉధృతంగా కొనసాగించారు. ఊరువాడా సమైక్య నినాదాలతో మార్మోగుతోంది. ర్యాలీలు, రిలే దీక్షలు, వినూత్న నిరసనలతో జిల్లా హోరెత్తుతోంది.

సాక్షి, అనంతపురం : సమైక్యాంధ్రే ధ్యేయంగా అనంతపురం జిల్లాలో అలుపెరుగని పోరు సాగుతోంది. 58వ రోజు గురువారం కూడా సడలని దీక్షతో సమైక్యవాదులు ఉద్యమాన్ని మరింత ఉధృతంగా కొనసాగించారు. ఊరువాడా సమైక్య నినాదాలతో మార్మోగుతోంది. ర్యాలీలు, రిలే దీక్షలు, వినూత్న నిరసనలతో జిల్లా హోరెత్తుతోంది. అనంతపురం నగరంలో ఏపీఎన్‌జీఓలు, గృహ నిర్మాణ శాఖ ఉద్యోగులు సమైక్యాంధ్రకు మద్దతుగా రక్తంతో సంతకాలు చేసి ఉద్యమానికి మరింత ఊపు తెచ్చారు.
 
 ఉపాధ్యాయులు జాక్టో ఆధ్వర్యంలో జోలె పట్టుకుని భిక్షాటన చేశారు. కార్పొరేషన్ ఉద్యోగుల దీక్షలకు స్వయం సహాయక సంఘాల మహిళలు మద్దతు తెలిపారు. పంచాయతీరాజ్ ఉద్యోగులు గీతా మందిరం ఎదుట సాష్టాంగ నమస్కారాలు, మోకాళ్లపై కూర్చుని రాష్ట్రాన్ని విడదీయొద్దని దేవుళ్లను ప్రార్థించారు.
 
 రాష్ట్ర విభజనకు కారకులైన వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని వేడుకున్నారు. విద్యుత్ శాఖ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. బుడగజంగాలు సమైక్య నినాదాలు చేస్తూ.. భారీ ర్యాలీ నిర్వహించారు. సప్తగిరి, టవర్ క్లాక్ సర్కిళ్లలో మానవహారం నిర్మించి.. ఒకే భాష.. ఒకే రాష్ట్రం అని నినాదాలు చేశారు. ఎస్కేయూ వద్ద 205 జాతీయ రహదారిపై వర్సిటీ పీజీ విద్యార్థులు, ఇంజనీరింగ్ విద్యార్థులు భారీ ర్యాలీ చేశారు. దీంతో రెండు గంటల పాటు వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి.
 
 వాడవాడన సమైక్యమే..
 ధర్మవరంలో జేఏసీ రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సూపర్‌వైజర్లు, కార్యకర్తలు, ఆయాలు భారీ ర్యాలీ నిర్వహించి.. రోడ్డుపై వంటావార్పు చేసి, సహపంక్తి భోజనాలు చేశారు. ముదిగుబ్బలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం, టీచర్లు, విద్యార్థులు కలసి సైకి ల్ ర్యాలీ చేశారు. గుంతకల్లులో వైఎస్సార్‌సీపీ, జేఏసీ నాయకుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ రిలే దీక్షలకు వండ్రంగులు మద్దతు తెలిపారు. గుత్తిలో శ్రీకృష్ణదేవరాయ యువసేన ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జేఏసీ, జాక్టో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లా సహకార శాఖ ఉద్యోగులు సమైక్య నినాదాలతో భారీ ర్యాలీ చేపట్టారు. పామిడిలో కుమ్మరులు రోడ్డుపైనే కుండలు తయారు చేసి నిరసన తెలిపారు.

హిందూపురంలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల ఆధ్యాపకులు అంబేద్కర్ సర్కిల్‌లో ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. విద్యుత్ జేఏసీ నాయకులు సద్భావన సర్కిల్‌లో రోడ్డుపై కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. ఏపీఎన్‌జీఓ అధ్యక్షుడు అశోక్‌బాబును విమర్శించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్, కేసీఆర్ కుమార్తె కవిత దిష్టి బొమ్మలను దహనం చేశారు. చిలమత్తూరులో సమైక్యవాదులు రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొడికొండ చెక్‌పోస్టు వద్ద రాస్తారోకో నిర్వహించారు.
 
 కదిరిలో ఉద్యోగులు.. సోనియా, దిగ్విజయ్‌సింగ్, షిండేల ముసుగులు ధరించి బైక్ ర్యాలీ చేపట్టారు. కళ్యాణదుర్గంలో అరేకటిక, రాజస్థాన్ వ్యాపారుల ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యమాన్ని ఉధృతం చేయాలని వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలు తిప్పేస్వామి, ఎల్‌ఎం మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు వేర్వేరుగా పిలుపునిచ్చారు. మడకశిరలో ఆటో యజమానులు, డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. అమరాపురంలో ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు.
 
 పుట్టపర్తిలో ఉద్యమకారులు ర్యాలీ చేపట్టి సమైక్య సమరభేరి పోస్టర్లను విడుదల చేశారు. ఆమడగూరు, బుక్కపట్నం, కొత్తచెరువుల్లో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పెనుకొండలో తొండంపల్లి, రాంపురం గ్రామస్తులు ర్యాలీ నిర్వహించారు. గోరంట్ల, పరిగిలో జేఏసీ నాయకులు ప్రైవేటు వాహనాలను అడ్డుకుని ఆందోళన చేశారు. రొద్దంలో ఉపాధ్యాయులు రోడ్డుపై వ్యాయామం చేస్తూ నిరసన తెలిపారు. రాయదుర్గంలో ప్రాణత్యాగం చేసైనా సమైక్యాంధ్రను పరిరక్షించుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మహిళా ఉపాధ్యాయులు బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు.
 
 బోర్‌వెల్స్ యజమానులు ర్యాలీ నిర్వహించారు. కణేకల్లులో స్వయం సహాయక సంఘాల మహిళలు ర్యాలీ చేపట్టారు. రాప్తాడులో జాతీయ రహదారిపై ఉపాధ్యాయులు రాస్తారోకో చేశారు. గార్లదిన్నెలో సమైక్యవాదులు వేపాకులు కట్టుకుని అర్ధనగ్న ప్రదర్శన చేశారు. తాడిపత్రిలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. జేఏసీ నాయకులు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. ఉరవకొండలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement